సాక్షి, ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్ గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఈ కోవలో ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్ల పై ఆధారపడిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
(చదవండి: అమ్మను సర్‌ప్రైజ్ చేస్తానని.. అనంత లోకాలకు)
‘ప్రస్తుతానికి సేవలను నిలిపివేశాం..కేంద్ర అధికారుల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికారుల ఆంక్షల కారణంగా సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవు. త్వరలోనే పునరుద్దిస్తాం’ అనే సందేశం దేశవ్యాప్తంగా చాలామంది బిగ్‌బాస్కెట్ వినియోగదారులకు దర్శనమిస్తోంది. అంతేకాదు ఆర్డర్ రద్దు చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నామనే సందేశం కూడా కొంతమంది వినియోగదారులను వెక్కిరిస్తోంది. ప్రభుత్వం అత్యవసర సేవలుగా ప్రకటించినప్పటికీ డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది.
(చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?)
అంతేకాదు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు వేధింపులకు గురి కావల్సి వస్తోందని వాపోయింది. తమ డెలివరీ బాయ్స్‌ని పోలీసులు ఆపి ప్రశ్నించడంతోపాటు, కొన్ని సందర్భాల్లో దాడి చేసినట్టు కూడా ఆరోపించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవడం ఆపేసి, అవసరమైన వస్తువుల పంపిణీపై మాత్రమే దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల రవాణాను నిలిపివేసినట్టు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని మరో సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే ఈ సంస్థల సేవలు తిరిగి ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు.
మరోవైపు తాజా పరిమాణాలపై స్పందించిన ఒక నెటిజన్ తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను తగిన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందే కేటీఆర్ ఆశిస్తూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్ -19 ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితం కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో నిత్యాసరాలకోసం ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఆన్‌లైన్ సైట్ల ద్వారానే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు అన్నీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment