ముంబై, సాక్షి: దాదాపు ఐదు నెలల చర్చల అనంతరం ఆన్‌లైన్ గ్రోసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,600 కోట్లు)కు టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బిగ్‌బాస్కెట్ విలువను 1.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,850 కోట్లు)గా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
డీల్ ఇలా..
ఒప్పందంలో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే వాటా కలిగిన ఇన్వెస్టర్ల నుంచి టాటా గ్రూప్ 50-60 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లలో చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలున్నాయి. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్కెట్ తాజాగా జారీ చేయనున్న మరో 20-30 శాతం వాటాను సైతం టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా బిగ్‌బాస్కెట్‌లో మొత్తం 80 శాతం వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకునే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
సూపర్-యాప్..
గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. డీల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను సైతం సూపర్ యాప్‌లో భాగం చేసే యోచనలోఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో హౌస్‌హోల్డ్, గ్రోసరీ విభాగంలో పలు ప్రొడక్టులను అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. టాటా సన్స్ వార్షిక సమావేశంలో భాగంగా గతేడాది చైర్మన్ చంద్రశేఖరన్ సూపర్‌యాప్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం విదితమే. సూపర్ యాప్ ద్వారా గ్రోసరీ, ఫ్యాషన్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ తదితర పలు సర్వీసులకు తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా దేశీ ఈకామర్స్ మార్కెట్లో అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్లిప్‌కార్ట్ తదితర దిగ్గజాలు వేగవంతంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగినంత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్‌పై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment