ఈ–కిరాణాలో హోరాహోరీ | Paytm Mall likely to buy majority stake in BigBasket to enter online grocery market | Sakshi
Sakshi News home page

ఈ–కిరాణాలో హోరాహోరీ

Published Wed, Oct 3 2018 12:30 AM | Last Updated on Wed, Oct 3 2018 12:30 AM

Paytm Mall likely to buy majority stake in BigBasket to enter online grocery market - Sakshi

ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ (ఆన్‌లైన్‌ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్‌ ఆర్డర్‌ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్‌ కేక్‌. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, –మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింతగా గుమ్మరించడం తదితర చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ సెగ్మెంట్లో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం కోసం పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎమ్‌ మాల్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ సంస్థ ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తన ఈ కామర్స్‌ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయబోతోంది.  అంతేకాకుండా ఇటీవలనే మోర్‌ సూపర్‌ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్‌ కంపెనీ కూడా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ కోసం భారీగా పెట్టుబడులు గుమ్మరించబోతోంది.

బిగ్‌బాస్కెట్‌ కోసం పేటీఎమ్‌ మాల్‌...
బిగ్‌బాస్కెట్‌ మొదటగా బెంగళూరులో తన కార్యకలాపాలు ఆరంభించింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ను డెలివరీ చేస్తోంది. 20,000పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. లో అత్యధిక మార్కెట్‌ వాటా బిగ్‌ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా.

ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినప్పటికీ, ఈ కంపెనీ ఇంకా బ్రేక్‌ ఈవెన్‌కు రాలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్‌ ప్లాట్‌ఫార్మ్‌  పేటీఎమ్‌ మాల్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు గత ఏడాదే ప్రారంభమయ్యాయని,  ప్రస్తుతం  జోరుగా సాగుతున్నాయని సమాచారం. వాల్‌మార్ట్‌ సంస్థ, భారత్‌లో ఈ కామర్స్‌ సంస్థతో టై–అప్‌ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని గత ఏడాది వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు వచ్చినప్పటినుంచే బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు పేటీఎమ్‌ చర్చలు జరపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే  బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎమ్‌కు దన్నుగా నిలుస్తున్న అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని  చైనా ఈ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా పేర్కొంది.  

విలువ దగ్గరే పీటముడి ?
బిగ్‌బాస్కెట్‌–పేటీఎమ్‌ మాల్‌ డీల్‌ విషయమై... బిగ్‌బాస్కెట్‌ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైననే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.  ఈ అంశం తేలకనే చర్చలు ముందుకు సాగట్లేదని  ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకుగాను పేటీఎమ్‌ మాల్‌లో తమకొక డైరెక్టర్‌ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్‌ కోరుతోందని సమాచారం. డీల్‌ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్‌ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి.  

బిగ్‌బాస్కెట్‌ అయితే  బావుంటుంది..!
ఈ కామర్స్‌ స్పేస్‌లో అమెజాన్‌–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్‌ మాల్‌ ఈ కామర్స్‌ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎమ్‌ మాల్‌ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని నిపుణులంటున్నారు. బిగ్‌బాస్కెట్‌తో టై అప్‌ వల్ల పేటీఎమ్‌ మాల్‌కు రిపీటెడ్‌ కస్టమర్లు లభిస్తారని,  ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్‌ మాల్‌కు, బిగ్‌బాస్కెట్‌.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు.  

ఈ–గ్రోసరీదే హవా...
ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థలకు భవిష్యత్తులో గ్రోసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని  రెండేళ్ల క్రితమే అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అంచనా వేశారు.  అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

రానున్న ఐదేళ్లలో ఆన్‌లైన్‌ వ్యాపారంలో సగం వాటా గ్రోసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్‌ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.  ఈ గ్రోసరీ మార్కెట్‌ జోరు అంతకంతకూ పెరగనున్నదని  గుర్తించిన అన్ని ఈ–కామర్స్‌ సంస్థలు గ్రోసరీస్పేస్‌లో మరింత మార్కెట్‌ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

వాల్‌మార్ట్‌ నుంచి సూపర్‌మార్ట్‌...
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ తదితర సంస్థలు ఈ గ్రోసరీ సెగ్మెంట్‌లో మరింత వాటా కొల్లగొట్టడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలనే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌...ఈ గ్రోసరీ సెగ్మెంట్‌ కోసమే 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్‌లైన్‌ గ్రోసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్‌ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సప్లై చెయిన్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్‌ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్‌ చెయిన్‌ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్‌ ప్రయత్నాలు చేస్తోంది.  మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్‌ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు.


రూ.1,460 కోట్లు–బిగ్‌బాస్కెట్‌లో ఆలీబాబా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం  
రూ.2,920 కోట్లు –ఈ–గ్రోసరీ కోసం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ ఇన్వెస్ట్‌ చేయనున్న మొత్తం  
రూ.4,200 కోట్లు–మోర్‌ కోసం అమెజాన్, సమర క్యాపిటల్‌లు వెచ్చించిన మొత్తం
8,000– రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్ల సంఖ్య. ఈ స్టోర్స్‌ను ఈ–గ్రోసరీ కోసం వినియోగించాలనుకుంటున్న రిలయన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement