సాక్షి, బిజినెస్ విభాగం: ఇపుడు మీ ఇంటికి ఉదయాన్నే పాలు ఎవరు తెస్తారు? మీ ఇంటికి దగ్గర్లోని పాల ఏజెన్సీ నడుపుతున్న వ్యక్తేనా..? ఇప్పటికిప్పుడు కాకున్నా... మున్ముందు పరిస్థితి మారబోతోంది. ఇప్పటికే ఈ రంగంలోకి కొన్ని స్టార్టప్‌లు ప్రవేశించగా... కొత్త వ్యాపారావకాశాల కోసం వెదుకుతున్న ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీ దిగ్గజాల కన్ను వీటిపై పడింది. వీటిని కొనుగోలు చేసి ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటానికి స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటివి ప్రయత్నాలు మొదలెట్టాయి.
స్టార్టప్‌లతో స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ చర్చలు
పుష్కలంగా నిధులు కలిగి, గ్రాసరీ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తోన్న స్విగ్గీ... సబ్‌స్క్రిప్షన్ విధానంలో పాలు డెలివరీ చేసే ‘సూపర్ డైలీ’ స్టార్టప్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఇక అలీబాబా దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్‌బాస్కెట్... పుణేకు చెందిన రెయిన్‌క్యాన్, గుర్గావ్‌కు చెందిన మిల్క్ బాస్కెట్, బెంగళూరుకు చెందిన డైలీ నింజా స్టార్టప్‌లతో కొనుగోలు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలేవీ ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఈ వార్తలపై అటు బిగ్ బాస్కెట్, స్విగ్గీలు కానీ ఇటు ఆయా స్టార్టప్‌లు గానీ స్పందించటం లేదు. ‘కంపెనీలు స్టార్టప్‌లకు మూలధనం అందించాలి. ఇవి సామర్థ్యం పెంచుకోవటానికి ఈ పెట్టుబడులును వినియోగించుకోవాలి. కస్టమర్లను దక్కించుకోవడం కోసం ప్రయత్నించాలి. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవలు అందించే సంస్థలు విశ్వసనీయమైన కస్టమర్లను ఇవ్వగలవు. అందుకే స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలు వ్యాపారంలో మంచి వృద్ధిని ఆశిస్తే... స్టార్టప్‌ల కొనుగోలు ద్వారా ముందుకెళ్లాలి’ అని అల్టెరియా క్యాపిటల్ మేనేజింగ్ పార్ట్‌నర్ వినోద్ మురళీ వివరించారు.
ఆర్డర్లు పెరుగుతాయ్!
మిల్క్ డెలివరీ స్టార్టప్‌లు స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ సంస్థల ఆర్డర్ల పెరుగుదలకు దోహదపడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నెలవారీ ఆర్డర్లు 15–20 రెట్లుకు పెరగొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డర్లు నెలకు 4–5 రెట్లుగా ఉన్నాయన్నారు. ‘మనం పాలు ప్రతిరోజూ కొంటాం. ఇందుకోసం ప్రతి కుటుంబం సగటున నెలకు రూ.1,000కు పైగా వెచ్చిస్తుంది. పాల విక్రయంపై మార్జిన్లు తక్కువగా ఉండటంతో ఆన్‌లైన్ మిల్క్ డెలివరీ స్టార్టప్స్.. ఇతర గ్రాసరీ ప్రొడక్టులను వారి పోర్ట్‌ఫోలియోకి జత చేసుకుంటున్నాయి’ అని రెడ్‌సీర్ కన్సల్టింగ్ పేర్కొంది.
గ్రాసరీలో తీవ్రమైన పోటీ
గ్రాసరీ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వల్ల పోటీ తీవ్రమౌతోంది. ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీలోకి అడుగు పెడుతుండటంతో బిగ్‌బాస్కెట్ వచ్చే రెండు త్రైమాసికాల్లో వీలైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. పరిశ్రమ అంచనా ప్రకారం.. బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా రోజుకు 60,000 నుంచి 70,000 ఆర్డర్లను హ్యాండిల్ చేస్తోంది. ఇక స్విగ్గీకి అయితే రోజుకు 3,00,000 పైగా ఫుడ్ డెలివరీ ఆర్డర్లు వస్తున్నాయి. ఇక డైలీ నింజా రోజుకు 25,000 ఆర్డర్లను, రెయిన్‌క్యాన్ రోజుకు 10,000 ఆర్డర్లను, మిల్క్‌బాస్కెట్ రోజుకు 8,000 ఆర్డర్లను, సూపర్ డైలీ రోజుకు 5,000 ఆర్డర్లను పొందుతున్నాయి. మరొకవైపు గ్రోఫర్స్ జనవరిలో సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇక బిగ్‌బాస్కెట్ ఈ ఏడాది 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇటీవలే 100 మిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 200 మిలియన్ డాలర్లను సమీకరించడానికి చర్చలు జరుపుతోంది.
స్విగ్గీ, బిగ్‌బాస్కెట్.. ఓ పాలప్యాకెట్!
Published Thu, May 31 2018 1:40 AM | Last Updated on Thu, May 31 2018 1:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment