బిగ్‌బాస్కెట్‌‌ వాడుతున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! | Grocery app BigBasket hacked data of 2 crore users leaked | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్కెట్‌ యూజర్లూ.. అప్రమత్తంకండి!

Published Mon, Nov 9 2020 3:42 PM | Last Updated on Mon, Nov 9 2020 5:07 PM

Grocery app BigBasket hacked data of 2 crore users leaked - Sakshi

సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్‌ బాస్కెట్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్కెట్‌ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది.

డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్‌‌ వెబ్‌‌లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్‌ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్‌ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్‌‌ వెబ్‌‌ను మానిటర్‌‌‌‌ చేస్తున్నప్పుడు బిగ్‌‌బాస్కెట్‌కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది. 

 బిగ్‌బాస్కెట్‌ వినియోగదారులు - జాగ్రత్తలు

  •  ఓటీపీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ చెప‍్పవద్దు.
  • ఆప్ నుండి ఆర్డర్ చేయడానికుపయోగించే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చండి.
  • యూపీఐ  యాప్‌ పిన్‌లను మార్చండి. 
  • అలాగే ఈమెయిల్, ఇతర సేవలకు ఒకే పాస్‌వర్డ్ లేదా పిన్‌లను ఉపయోగిస్తుంటే తక్షణమే వాటన్నింటి పాస్‌వర్డ్‌లను మార్చండి. వేరు వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఉత్తమం. 
  • బిగ్‌బాస్కెట్ యాప్‌ను అధికారిక ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి లేదా అప్‌ డేట్‌ చేయండి. అప్‌డేట్‌కు సంబంధించి  ఎలాంటి తప్పుడు సందేశాలను నమ్మకండి. 
  • కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లపై  పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • మీకుసంబంధంలేని, మీరు ఆర్డర్‌ ఇవ్వని ప్యాకేజీలను డెలివరీలు స్వీకరించవద్దు.
  • మీరు ఆర్డర్‌ ఇవ్వని క్యాష్‌ ఆన్‌ డెలివరీ ప్యాకేజీలను విశ్వసించకండి. వాటికి ఎలాంటి నగదు చెల్లించకండి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా నటిస్తూ మానిప్యులేట్  చేస్తున్న స్కాం పట్ల జాగ్రత్త వహించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement