
ముంబై: దేశ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్లో ఆన్‌లైన్ రిటైల్ వాటా 25 శాతంగా ఉండగా, 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని తెలియజేసింది. నివేదికలోని అంశాల మేరకు... ప్రస్తుతం ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. ఒక్కో ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్ ప్రస్తుతం ఒక ఏడాదిలో రూ.12,800ను ఖర్చు చేస్తుంటే... 2030 నాటికి ఇది రూ.25,138 స్థాయికి పెరుగుతుంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ సహా ఎలక్ట్రానిక్స్ విభాగంలో భౌతిక రిటైల్ దుకాణాల మార్కెట్ వాటాను ఆన్‌లైన్ రిటైల్ రంగం సొంతం చేసుకున్నట్లు జెఫ్రీస్ తెలియజేసింది. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆన్‌లైన్ రిటైల్ రంగానికి ప్రధాన విభాగాలుగా ఉండగా, ఆన్‌లైన్ గ్రోసరీ విక్రయాలు కూడా పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. బిగ్‌బాస్కెట్, అమేజాన్ ప్యాంట్రీ ప్రతీ నెలా ప్రారంభంలో ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపింది.
సౌకర్యమే ఆకర్షణీయత
కొత్త కస్టమర్లు ఆన్‌లైన్ విభాగానికి రావటమనేది మున్ముందు బాగా పెరుగుతుందని అంచనా వేసిన ఈ నివేదిక... ధరల పరంగా తక్కువ వ్యత్యాసం, సౌకర్యాలు ఇందుకు కారణాలని వివరించింది. వ్యక్తిగత సంరక్షణ, మేకప్ ఉత్పత్తులకూ ఆన్‌లైన్ మార్కెట్ పెరుగుతున్నట్టు పేర్కొంది. ‘‘ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ విస్తరణకు ప్రస్తుతం తగ్గింపు ధరలు, సౌకర్యం అన్నవి సానుకూలతలు. మధ్యకాలానికి తగ్గింపులన్నవి క్రమబద్ధీకరణ అవుతాయి. ఆ తర్వాత సౌకర్యం మాత్రమే వినియోగదారులను ఆకర్షించే అంశంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మందికి ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన ఉంది. నకిలీ వస్తువులు పంపుతున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఆన్‌లైన్ రిటైలర్లు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అప్పటి వరకు కొంత మంది కస్టమర్లు ఆన్‌లైన్ రిటైల్‌కు దూరంగానే ఉంటారు’’ అని జెఫరీస్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment