new customers
-
కొత్త చందాదారుల ఆకర్షణలో జియో టాప్
న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి. మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి. -
నెల రోజుల్లోనే 10 లక్షల 5జీ యూజర్లు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6–9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం: పేటిఎమ్
పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటిఎమ్'ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చి 11న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై పేటీఎమ్ మార్చి 12న స్పందించింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేయకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేటిఎమ్ తెలిపింది. "పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సాధ్యమైనంత త్వరగా ఆర్బీఐ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాత కొత్త ఖాతాలను తిరిగి ప్రారంభించేటప్పుడు మేము తెలియజేస్తాము" అని రుణదాత తన ప్రకటనలో తెలిపింది. అయితే, కొత్త కస్టమర్లు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతాలను తెరవలేరు. నూతన వినియోగదారులు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ను కూడా తెరవలేరని రుణదాత పేర్కొంది. ఇంకా, పేటిఎమ్ యాప్ వినియోగించే కొత్త వినియోగదారులు పేటిఎమ్ యుపీఐ హ్యాండిల్స్ సృష్టించవచ్చు, వాటిని వారి ప్రస్తుత పేమెంట్స్ బ్యాంక్ ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు లింక్ చేయవచ్చు అని తెలిపింది. "బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్బీఐ తన అధికారాల మేరకు.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డింగ్ చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు" ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. (చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!) -
బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..! ఉచితంగా 5జీబీ డేటా..! ఎన్ని రోజులంటే..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం జియో పోటీగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2399 ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే యూజర్ల కోసం క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. స్విచ్ టూ బీఎస్ఎన్ఎల్...! యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ముందుకొచ్చింది. #switchtoBSNL అనే ప్రచారాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్కు మారే కొత్త యూజర్లకు 5జీబీ హైస్పీడ్ డేటాను 30 రోజుల పాటు ఉచితంగా అందించనుంది. ఆయా యూజరు ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ ఐనా వారికే మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ అన్ని సర్కిళ్లలో జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది. షరుతులు వర్తిస్తాయి..! బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ ఆఫర్‌ను సొంతం చేసేకునే కొత్త కస్టమర్లకు పలు షరతులను పెట్టింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునే సదరు యూజరు ఫేస్బుక్, ట్విటర్ ప్లాట్‌ఫామ్స్‌లో #switchtoBSNL ప్రచారాన్ని షేర్ చేయాలి. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక ఫేస్బుక్ పేజీ (@bsnlcorporate), ట్విట్టర్ హ్యాండిల్ (@BSNLcorporate) ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆయా యూజర్ బీఎస్ఎన్ఎల్కు ఎందుకుమారుతున్నారో కూడా సోషల్‌మీడియా హ్యండిల్స్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పోర్ట్ కానున్న నంబర్‌నుంచి 9457086024 నంబర్‌కు స్క్రీన్షాట్లను పంపాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి ఆయా యూజర్లకు 30 రోజుల పాటు 5జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది. A great reason to #SwitchToBSNL!#BSNL #NewYear #Offers T&C: https://t.co/4YNfqFRgLU pic.twitter.com/voDknZFvI2 — BSNL India (@BSNLCorporate) January 4, 2022 చదవండి: BSNL: జియోకు పోటీగా...బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..! -
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు శుభవార్త, కొత్త ఫీచర్
సాక్షి, ముంబై: వాల్‌మార్ట్ సొంతమైన భారత ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆన్లైన్ లావాదేవీల సందర్భంగా కొత్త కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ‘ఫ్లిప్‌కార్ట్ సాథీ’ అనే ‘స్మార్ట్ అసిస్టివ్ ఇంటర్ఫేస్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో టెక్స్ట్, ఆడియో-గైడెడ్ నావిగేషన్ ద్వారా మొదటిసారి ఇకామర్స్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. గ్రామీణ భారతదేశం, టైర్ 2, 3 నగరాల్లో ఆన్లైన్ లావాదేవీలను సౌకర్యవంతంగా, సులభంగా చేయడంతో పాటు, మరింత ఎక్కువమంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న 200 మిలియన్ల వినియోగదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు. కొత్త వినియోగదారులు తమ స్వంతంగా బ్రాండ్లు, ఉత్పత్తుల ఎంపిక, ఫిల్టర్ చేయడంలో సహాయం అవసరమని తమ అధ్యయనంలో గ్రహించామనీ, ఈ నేపథ్యంలోనే ఆడియో పాఠాల(ఆడియో-గైడెడ్ నావిగేషన్) ఫీచర్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ఈ కొత్త ఫీచర్ కొత్తగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు టెక్స్ట్ ఆడియో ద్వారా అవగాహన కల్పిస్తుంది, మార్గ నిర్దేశనం చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని, ఆస్వాదించడాన్ని ఈ ఫీచర్ మరింత సులభతరం చేస్తుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ అన్నారు. ఆన్లైన్ షాపింగ్ సందర్భంగా వినియోగదారులు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా స్మార్ట్ అసిస్టివ్ ఇంటర్ఫేస్ లక్ష్యమని చెప్పారు. -
ఆన్లైన్ రిటైల్... ఆకాశమే హద్దు!!
ముంబై: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్లో ఆన్లైన్ రిటైల్ వాటా 25 శాతంగా ఉండగా, 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని తెలియజేసింది. నివేదికలోని అంశాల మేరకు... ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. ఒక్కో ఆన్లైన్ షాపింగ్ కస్టమర్ ప్రస్తుతం ఒక ఏడాదిలో రూ.12,800ను ఖర్చు చేస్తుంటే... 2030 నాటికి ఇది రూ.25,138 స్థాయికి పెరుగుతుంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ సహా ఎలక్ట్రానిక్స్ విభాగంలో భౌతిక రిటైల్ దుకాణాల మార్కెట్ వాటాను ఆన్లైన్ రిటైల్ రంగం సొంతం చేసుకున్నట్లు జెఫ్రీస్ తెలియజేసింది. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆన్లైన్ రిటైల్ రంగానికి ప్రధాన విభాగాలుగా ఉండగా, ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలు కూడా పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. బిగ్‌బాస్కెట్, అమేజాన్ ప్యాంట్రీ ప్రతీ నెలా ప్రారంభంలో ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. సౌకర్యమే ఆకర్షణీయత కొత్త కస్టమర్లు ఆన్లైన్ విభాగానికి రావటమనేది మున్ముందు బాగా పెరుగుతుందని అంచనా వేసిన ఈ నివేదిక... ధరల పరంగా తక్కువ వ్యత్యాసం, సౌకర్యాలు ఇందుకు కారణాలని వివరించింది. వ్యక్తిగత సంరక్షణ, మేకప్ ఉత్పత్తులకూ ఆన్లైన్ మార్కెట్ పెరుగుతున్నట్టు పేర్కొంది. ‘‘ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విస్తరణకు ప్రస్తుతం తగ్గింపు ధరలు, సౌకర్యం అన్నవి సానుకూలతలు. మధ్యకాలానికి తగ్గింపులన్నవి క్రమబద్ధీకరణ అవుతాయి. ఆ తర్వాత సౌకర్యం మాత్రమే వినియోగదారులను ఆకర్షించే అంశంగా ఉంటుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మందికి ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన ఉంది. నకిలీ వస్తువులు పంపుతున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఆన్లైన్ రిటైలర్లు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అప్పటి వరకు కొంత మంది కస్టమర్లు ఆన్లైన్ రిటైల్‌కు దూరంగానే ఉంటారు’’ అని జెఫరీస్ వివరించింది. -
వోడాఫోన్ కొత్త ప్లాన్ : కొత్త కస్టమర్లకే
సాక్షి, ముంబై: వోడాఫోన్ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.351 ల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఫస్ట్ రీచార్జ్ ప్లాన్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్ వోడాఫోన్ కొత్త సిమ్ వాడే కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ఎస్ఎంఎస్ కూడా సదుపాయాన్ని అందిస్తున్నట్టు వోడాఫోన్ తెలిపింది. -
భారతీ ఎయిర్‌టెల్‌కు మరో షాక్
ముంబై : భారతీ ఎయిర్‌టెల్‌కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి లేదని ఆర్బీఐ తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారుల రిజిస్ట్రేషన్లను ఆపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో మార్చిలోనే ఈ సంస్థ 5 కోట్ల రూపాయల మేర భారీ జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఉల్లంఘనపై ప్రస్తుతం కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ‘ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జనవరి 5, 2018 నుంచి కొత్త కస్టమర్లను తీసుకోవట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను మేం అధికారులకు అందజేశాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ప్రతినిధి తెలిపారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వారి ఖాతాలు ప్రారంభించించింది. గత ఏడాది నవంబరు 20-22 తేదీల మధ్య ఆర్బీఐ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం తేలింది. ఇలా దాదాపు 30 లక్షల ఖాతాలు తెరిచింది. ఆధార్‌తో నెంబర్ వెరిఫికేషన్ చేపట్టిన కస్టమర్లపై ఈ ప్రభావం పడింది. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా.. వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లబ్ధిదారుల రెగ్యులర్ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా తన పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో, జనవరి 15న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు సూచించిన మార్గదర్శకాలు పాటించకుండా.. ఖాతాదారుల అనుమతి లేకుండా ఎందుకు ఖాతాలు తెరిచారో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. బ్యాంకు ఇచ్చిన సమాధానం విన్న తరవాత రూ.5 కోట్ల జరిమానా విధించింది. -
బీఎస్ఎన్ఎల్ కాల్ రేట్లు 80% వరకు తగ్గింపు
కొత్త వినియోగదారులకు మొదటి రెండు నెలల్లో వర్తింపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మొబైల్ కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు కాల్ రేట్లలో భారీ డిస్కాంట్‌ను ఆఫర్ చేస్తోంది. కంపెనీ మౌలిక సదుపాయాలను పునర్వ్యస్థీకరించామని, కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్నిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు మొదటి రెండు నెలల్లో కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్నిస్తామని, నిమిషాల, సెకన్ల బిల్లింగ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుందని వివరించారు. రూ.36 ప్లాన్ ఓచర్(సెకన్ బిల్లింగ్), రూ.37 ప్లాన్ ఓచర్(నిమిషాల బిల్లింగ్)లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.37 ప్లాన్ ఓచర్లో బీఎస్ఎన్ల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 10 పైసలు చార్జ్ చేస్తామని చెప్పారు. ఇతర నెట్వర్క్లకైతే ఈ చార్జీ నిమిషానికి 30 పైసలు ఉంటుందని తెలిపారు. ఇక రూ.36 ప్లాన్ ఓచర్లో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ప్రతి మూడు సెకన్లకు 1 పైసా వంతున చార్జ్ చేస్తామని, ఇతర నెట్వర్క్లకైతే ప్రతి 3 సెకన్లకు 2 పైసలు చొప్పున చార్జీ ఉంటుందని వివరించారు. వినియోగదారుల సేవల కోసం ఏజీస్ బీపీవోతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది జూలై-నవంబర్ కాలానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కింద 1,24,158 మంది తమ నెట్వర్క్ నుంచి వెళ్లిపోగా, 1,57,564 మంది ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 7.96 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో కొత్తగా చేరిన మొబైల్ వినియోగదారుల విషయంలో టాప్ ఫైవ్ కంపెనీల్లో ఒకటిగా బీఎస్ఎన్ఎల్ నిలిచింది. -
80 శాతం కాల్రేట్లు తగ్గించిన బీఎస్ఎన్ఎల్
♦ 80 శాతం మొబైల్ కాల్రేట్లు తగ్గింపు ♦ మొదటి రెండు నెలలు వరకే ఈ స్కీం వర్తింపు ♦ ఒక సెకన్, ఒక నిమిషం బిల్లింగ్ ప్లాన్లకు మాత్రమే ♦ రూ. 36 వోచర్‌తో రిచార్జ్.. సెకండ్ ప్లాన్ వర్తింపు ♦ రూ. 37 వోచర్‌తో రిచార్జ్.. నిమిషం ప్లాన్: బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపామ్ శ్రీవాస్తవ న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు శుభవార్త. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి రెండు నెలల స్కీం కింద 80 శాతం మొబైల్ కాల్‌రేట్లను తగ్గిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ఇతర నెట్‌వర్క్‌ల పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఒక నిమిషం, ఒక సెకన్ బిల్లింగ్ ప్లాన్ వంటి కొత్త ఆపర్లతో వినియోగదారుల మందుకు వస్తోంది. అయితే కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు తొలుత రూ. 36 వోచర్( ఒక సెకన్ ప్లాన్)తో రిచార్జ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. రూ. 37 తో రిచార్జ్ చేసుకున్నట్లయితే వారికి నిమిషానికి 10 పైసల చొప్పున చార్జ్ చేయబడుతుందని తెలిపింది. దీంతో కొత్త యూజర్లు తమ సర్వీసులను పునరుద్ధరించుకోవడానికి చక్కగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపామ్ శ్రీవాస్తవ పిటిఐకి తెలిపారు. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటిసారి ఒక సెకన్ ప్లాన్ కోసం తొలుత రూ. 36 వోచర్, ఒక నిమిషం ప్లాన్ కోసం రూ. 37 వోచర్‌తో రిచార్జ్ చేసుకోవాలి.ఈ స్కీం (మొబైల్ నంబర్ పోర్టబులుటీ) వినియోగదారులు కూడా వర్తిస్తుందన్నారు. అయితే రూ. 37 స్కీంలో ఉన్న వినియోగదారులకు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకుంటే నిమిషానికి 10 పైసలు చొప్పున చార్జ్ చేయబడుతుంది. మిగతా నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 30 పైసలు చొప్పున చార్జ్ పడుతుంది. అదేవిధంగా రూ. 36 తో రిచార్జ్ చేసుకుంటే బీఎస్ఎన్ఎల్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ప్రతి మూడు సెకన్లకు ఒక పైసా చొప్పున చార్జ్ పడుతుంది. అలాగే ఇతర సర్వీసులకుగానూ ప్రతి మూడు సెకన్లకు 2 పైసల చొప్పున కాల్ చార్జీలు వర్తిస్తాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్
ముంబై: త్వరలో క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డెరైక్ట్-టు-హోమ్(డీటీహెచ్) సేవల సంస్థ టాటాస్కై భారత్‌లో తొలి 4కే సెట్-టాప్ బాక్స్‌ను (ఎస్టీబీ) ఆవిష్కరించింది. ఈ తరహా ఎస్టీబీలు ప్రసారాలను మరింత నాణ్యతతో అందించగలవు. 4కే సెట్ టాప్ బాక్సుల ధర ప్రస్తుత కస్టమర్లకు రూ. 5,900కి, కొత్త కస్టమర్లకు రూ. 6,400కు లభించగలదని సంస్థ తెలిపింది. -
44 లక్షల మంది కొత్త జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: గత నెలలో 44 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) బుధవారం తెలిపింది. దీంతో మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.65% వృద్ధితో 67.88 కోట్లకు పెరిగింది. సీఓఏఐ వివరాల ప్రకారం..., కొత్తగా లభించిన 12.07 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులార్ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌లో అధిక వినియోగదారులు ఈ కంపెనీకే లభించారు. 12.05 లక్షల మంది కొత్త వినియోగదారులతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 15.55 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ సంస్థ 11.6 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.33 కోట్లకు పెరిగింది. ఎయిర్‌సెల్‌కు 6.4 లక్షల మంది, యూనినార్‌కు 1 లక్ష మంది చొప్పున కొత్త వినియోగదారులు లభించారు. వీడియోకాన్ యూజర్ల సంఖ్య 11% వృద్ధితో 32.4 లక్షలకు చేరింది.