భారతీ ఎయిర్‌టెల్ మరో షాక్ (ఫైల్ ఫోటో)
ముంబై : భారతీ ఎయిర్‌టెల్‌కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారుల రిజిస్ట్రేషన్లను ఆపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో మార్చిలోనే ఈ సంస్థ 5 కోట్ల రూపాయల మేర భారీ జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఉల్లంఘనపై ప్రస్తుతం కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ‘ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం జనవరి 5, 2018 నుంచి కొత్త కస్టమర్లను తీసుకోవట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను మేం అధికారులకు అందజేశాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’ అని ఎయిర్‌టెల్ ప్రతినిధి తెలిపారు.
ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వారి ఖాతాలు ప్రారంభించించింది. గత ఏడాది నవంబరు 20-22 తేదీల మధ్య ఆర్‌బీఐ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం తేలింది. ఇలా దాదాపు 30 లక్షల ఖాతాలు తెరిచింది. ఆధార్‌తో నెంబర్ వెరిఫికేషన్ చేపట్టిన కస్టమర్లపై ఈ ప్రభావం పడింది. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా.. వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లబ్ధిదారుల రెగ్యులర్ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా తన పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో, జనవరి 15న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు సూచించిన మార్గదర్శకాలు పాటించకుండా.. ఖాతాదారుల అనుమతి లేకుండా ఎందుకు ఖాతాలు తెరిచారో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. బ్యాంకు ఇచ్చిన సమాధానం విన్న తరవాత రూ.5 కోట్ల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment