న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం సంస్థలు చెల్లింపులు ప్రారంభించాయి. సోమవారం భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ కొంత మొత్తాన్ని కట్టాయి. టెలికం శాఖకు (డాట్) ఎయిర్‌టెల్ రూ. 10,000 కోట్లు, టాటా గ్రూప్ రూ.2,197 కోట్లు చెల్లించాయి. ‘భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరఫున రూ.10,000 కోట్లు చెల్లించాం. మిగతా బాకీలపై స్వీయ మదింపు చేపట్టాం. సుప్రీం కోర్టులో తదుపరి విచారణ తేదీలోగా దీన్ని కట్టేస్తాం’ అని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ.9,500 కోట్లు భారతి ఎయిర్‌టెల్‌కి సంబంధించినవి కాగా రూ.500 కోట్లు భారతి హెక్సాకామ్‌కు చెందినవి. మరోవైపు, టాటా టెలీ, టాటా టెలీ (మహారాష్ట్ర) తరఫున మొత్తం బాకీల కింద రూ.2,197 కోట్లు కట్టేశామని, వీటికి సంబంధించిన లెక్కల వివరాలను కూడా డాట్‌కు అందజేశామని టాటా టెలీసర్వీసెస్ తెలిపింది.
సోమవారం రూ.2,500 కోట్లు కట్టిన వొడాఫోన్ ఐడియా.. శుక్రవారం నాటికి మరో రూ.1,000 కోట్లు కడతామంటూ సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటిదాకా డాట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా సూచనలివ్వాలని కోరింది. అయితే, సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. బ్యాంక్ గ్యారంటీల స్వాధీనం సహా బాకీల వసూలుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డాట్‌కు వెసులుబాటునిచ్చింది. డాట్ గణాంకాలను బట్టి సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం టెల్కోల నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద సుమారు రూ.1.47 లక్షల కోట్లు వసూలు కావాలి. ఎయిర్‌టెల్ సుమారు రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ సుమారు రూ.13,800 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరి 23లోగా వీటిని కట్టేయాలంటూ గతేడాది ఆదేశించినా.. అమలు కాకపోవడంపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీలు, డాట్ కదిలాయి. దీనిపై మార్చి 17న సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపనుంది.
బ్యాంక్ గ్యారంటీలపై డాట్ దృష్టి..
బాకీలను పూర్తిగా వసూలు చేసుకునే క్రమంలో.. టెల్కోలిచ్చిన బ్యాంక్ గ్యారంటీలను స్వాధీనం చేసుకునే అవకాశాలను డాట్ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై డాట్ అధికారులు మంగళవారం సమావేశమై, నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. ఒకవేళ బ్యాంక్ గ్యారంటీలను నిజంగానే స్వాధీనం చేసుకుంటే... నిధులు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మూతబడక తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రెండు త్రైమాసికాల లైసెన్సు ఫీజులు, ఇతర బకాయిలకు సరిపడే స్థాయిలో ఈ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు సంబంధించి ఇది సుమారు రూ.5,000 కోట్ల మేర ఉంటుంది. డాట్ లెక్కలను టెల్కోలు ప్రశ్నించాయి. తమ సొంత మదింపు ప్రకారమే కడతామంటూ సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ మొత్తం వివాద ప్రభావం బ్యాంకులపై ఎలా ఉండవచ్చన్న అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ఇంటర్వూ్య సందర్భంగా తెలిపారు.
ఆ ఉత్తర్వులు.. నాన్–టెల్కోలకు కాదేమో: ధర్మేంద్ర ప్రధాన్
నాన్ టెలికామ్ ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కంపెనీలు ఏజీఆర్ బాకీలు కట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు.. టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించకపోవచ్చని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. సమాచార లోపం వల్లే చమురు కంపెనీలకు కూడా డాట్ నోటీసులిచ్చి ఉంటుందని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నాక తమ అభిప్రాయం తెలియజేశామని చెప్పారు. నోటీసులు అందుకున్న కంపెనీలకు టెలికం కార్యకలాపాలు ప్రధాన వ్యాపారం కాదన్నారు. స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్‌గ్రిడ్ వంటి టెలికంయేతర కంపెనీలు కూడా రూ.2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ నోటీసులివ్వటం తెలిసిందే.
ద్రవ్య లోటు తగ్గుతుంది: ఆర్థికవేత్తల అంచనా
టెలికం సంస్థలు రూ.1.20 లక్షల కోట్ల బాకీలు కట్టిన పక్షంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో.. సవరించిన గణాంకాల కన్నా ద్రవ్య లోటు తగ్గగలదని ఆర్థికవేత్తలు తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఇది 3.5 శాతానికి పరిమితం కాగలదని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. సవరించిన గణాంకాల ప్రకారం ఇది 3.8 శాతం స్థాయిలో ఉండొచ్చని గతంలో అంచనా వేశారు. ‘టెల్కోలు బాకీలు కట్టేందుకు గడువైన మార్చి 16 తర్వాత ద్రవ్య లోటు పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. ఏజీఆర్ బాకీలు కనీసం రూ.1.20 కోట్లు వసూలైనా.. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. జీడీపీలో 3.5 శాతానికి దిగి రావొచ్చు‘ అని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు మళ్లీ కాలుష్యకారక పాత ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందుబాటు ధరల్లో అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment