online retail market
-
భారీ స్థాయికి ఆన్లైన్ రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2022 నాటికి 70 బిలియన్ డాలర్లుగా (రూ.5.74 లక్షల కోట్లు) ఉన్న మార్కెట్ విలువ 2030 నాటికి నాలుగు రెట్ల వృద్ధితో 325 బిలియన్ డాలర్లకు (రూ.26.65 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఈ కామర్స్ రంగం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. ఆర్డర్ల సంఖ్యా పరంగా ప్రథమ శ్రేణి పట్టణాలను ఇవి అధిగమించినట్టు పేర్కొంది. ఆఫ్‌లైన్ (భౌతిక దుకాణాలు)తో పోలిస్తే వచ్చే దశాబ్ద కాలంలో ఆన్లైన్ రిటైల్ విస్తరణ రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని వివరించింది. ‘‘2022లో టైర్–2, 3 పట్టణాలు మొత్తం ఈ కామర్స్ ఆర్డర్లలో 60 శాతం వాటా ఆక్రమించాయి. టైర్–3 పట్టణాల్లో ఆర్డర్లు 65 శాతం పెరిగాయి. టైర్–2 పట్టణాల్లో ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల కనిపించింది. ఆన్లైన్ రిటైల్ భారీగా వృద్ధి చెందడానికి ఎన్నో అంశాలున్నాయి. ఆర్డర్ చేయడంలో, వాటిని తిప్పి పంపించడంలో సౌకర్యం ఉండడం, 19,000 పిన్కోడ్ల పరిధిలో లాజిస్టిక్స్ వసతులు (డెలివరీ, పికప్) ఉండడం కీలకమైనవి’’అని ఈ నివేదిక వివరించింది. పైగా భారత్‌లో 22 కోట్ల ఆన్లైన్ షాపర్స్ ఉండడం కూడా ఈ కామర్స్ వృద్ధిని మరింత నడిపిస్తోందని తెలిపింది. భారీగా పెట్టుబడులు ఈ కామర్స్ రంగంలో భారీ పెట్టుబడులు రావడాన్ని సైతం డెలాయిట్ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి గత ఐదేళ్లలో 23 బిలియన్ డాలర్ల నిధులను ఆకర్షించినట్టు తెలిపింది. రిటైలర్లు సైతం ఓమ్నిచానల్ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు, ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు మార్గాల్లోనూ కస్టమర్లకు చేరువు అవుతున్నట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న ఆదాయం, వేగంగా డిజిటలైజేషన్, మధ్యతరగతి వర్గం విస్తరణతో భారత్‌లో ఆన్లైన్ రిటైల్ రంగం అసాధారణ వృద్ధిని చూస్తుందన్న నమ్మకం ఉంది. టెక్నాలజీ సామర్థ్యాలు, భవిష్యత్తు వ్యూహాల ద్వారా రిటైలర్లు కస్టమర్ల డిమాండ్‌ను చేరుకోవడమే కాదు, విలువ పరంగా నూతన ప్రమాణాలను సృష్టించనున్నారు. మరిచిపోలేని షాపింగ్ అనుభూమతిని ఇవ్వనున్నారు’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ అభిప్రాయపడ్డారు. టైర్–2 పట్టణాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఆన్లైన్ వ్యాపారాలను సులభంగా ప్రారంభించే అవకాశం, కావాల్సినవి సులభంగా గుర్తించడం, సులభతర చెల్లింపుల విధానాలు దేశంలో రిటైల్ రంగ ముఖచిత్రా న్ని మార్చేస్తాయని డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మెటావర్స్ అనేవి కస్టమర్‌తో అనుసంధానతను మార్చేస్తాయని, కస్టమర్లకు రిటైలర్లు మరింత దగ్గర కావడంతోపాటు, వారి సంతృప్తిని సంపాదించేందుకు వీలు కలి్పస్తాయని పేర్కొంది. కిరాణా దుకాణాలను పెద్ద రిటైల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానించడం ద్వారా ఉత్పత్తుల శ్రేణి, వ్యాపా రం మరింత విస్తరించుకోవచ్చని సూచించింది. -
వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!
ఆసియాలోని అతిపెద్ద పూల మార్కెట్ అయిన చైనా పూల మార్కెట్ రోజుకి వేలాదిమంది కస్టమర్ల ఆర్డర్లతో కళకళలాడుతుంది. ఇ-కామర్స్ అనేది చైనాలో అతి పెద్ద వ్యాపారం. అయితే ఇంతవరకు ఆన్లైన్లో సౌందర్య సాధనాలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్ల విక్రయాలతో శరవేగంగా దూసుకుపోయింది. కానీ ఇప్పడూ మాత్రం అనుహ్యంగా ఆన్లైన్ పూల మార్కెట్ మంచి ఆదాయ వనరుగా శరవేగంగా పుంజుకుంటుంది. అంతేకాదు ప్రజలంతా తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఆన్లైన్లో తమకు నచ్చిన పూల బోకేలను లేదా పూలను ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చైనా పేర్కొంది. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) పైగా చైనా దేశం తమ ఉద్యాన పరిశ్రమ ఆదాయం సుమారు 160 బిలియన్ యువాన్ల (రూ.180 కోట్లు) గా అంచనా వేసింది. అంతేకాదు ఈపూల మార్కెట్‌కి సంబంధించిన ఆన్లైన్ రిటైల్ ఇప్పుడు సెక్టార్ టర్నోవర్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మేరకు ఐదు పుష్పగుచ్ఛాలు, వెంటనే ఆర్డర్ చేసే వారికి కేవలం 39.8 యువాన్లు (రూ.468) మాత్రమే అంటూ చక్కటి ఆకర్షించే ఆఫర్లతో కస్టమర్లను మైమరిపించి కొనేలా చేస్తుంది. దీంతో ఆయా ఆన్లైన్ వ్యాపారా సంస్థలకు సంబంధించిన తమ రోజు వారి ఆదాయాలు మారుతూ వస్తున్నాయి. అంతేకాదు చైనాలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కట్ ఫ్లవర్‌లకు డిమాండ్ పెరగడంతో దక్షిణ ప్రావిన్స్ యునాన్ ఆ విజృంభణకు కేంద్రంగా మారింది. పైగా ప్రాంతీయ రాజధాని కున్మింగ్ ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌ను కలిగి ఉంది. పైగా నెదర్లాండ్స్‌లోని ఆల్స్మీర్ తర్వాత ఇదే ప్రపంచంలో రెండవ అతిపెద్దది పూల మార్కెట్. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా స్థంభించిపోయిన ఈ పూల మార్కెట్ ప్రస్తుతం ఈ ఆన్లైన్ విక్రయాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మేరకు ప్రజలు కూడా ఈ మహమ్మారీ భయంతో ఆన్లైన్లోనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నటు చైనా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజూ సగటున నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులు అమ్ముడవుతున్నాయని, పైగా చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే దాదాపు 9.3 మిలియన్లను విక్రయిస్తుందని అంటున్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
ఆన్లైన్ రిటైల్... ఆకాశమే హద్దు!!
ముంబై: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్లో ఆన్లైన్ రిటైల్ వాటా 25 శాతంగా ఉండగా, 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని తెలియజేసింది. నివేదికలోని అంశాల మేరకు... ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. ఒక్కో ఆన్లైన్ షాపింగ్ కస్టమర్ ప్రస్తుతం ఒక ఏడాదిలో రూ.12,800ను ఖర్చు చేస్తుంటే... 2030 నాటికి ఇది రూ.25,138 స్థాయికి పెరుగుతుంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ సహా ఎలక్ట్రానిక్స్ విభాగంలో భౌతిక రిటైల్ దుకాణాల మార్కెట్ వాటాను ఆన్లైన్ రిటైల్ రంగం సొంతం చేసుకున్నట్లు జెఫ్రీస్ తెలియజేసింది. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆన్లైన్ రిటైల్ రంగానికి ప్రధాన విభాగాలుగా ఉండగా, ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలు కూడా పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. బిగ్‌బాస్కెట్, అమేజాన్ ప్యాంట్రీ ప్రతీ నెలా ప్రారంభంలో ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. సౌకర్యమే ఆకర్షణీయత కొత్త కస్టమర్లు ఆన్లైన్ విభాగానికి రావటమనేది మున్ముందు బాగా పెరుగుతుందని అంచనా వేసిన ఈ నివేదిక... ధరల పరంగా తక్కువ వ్యత్యాసం, సౌకర్యాలు ఇందుకు కారణాలని వివరించింది. వ్యక్తిగత సంరక్షణ, మేకప్ ఉత్పత్తులకూ ఆన్లైన్ మార్కెట్ పెరుగుతున్నట్టు పేర్కొంది. ‘‘ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విస్తరణకు ప్రస్తుతం తగ్గింపు ధరలు, సౌకర్యం అన్నవి సానుకూలతలు. మధ్యకాలానికి తగ్గింపులన్నవి క్రమబద్ధీకరణ అవుతాయి. ఆ తర్వాత సౌకర్యం మాత్రమే వినియోగదారులను ఆకర్షించే అంశంగా ఉంటుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మందికి ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన ఉంది. నకిలీ వస్తువులు పంపుతున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఆన్లైన్ రిటైలర్లు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అప్పటి వరకు కొంత మంది కస్టమర్లు ఆన్లైన్ రిటైల్‌కు దూరంగానే ఉంటారు’’ అని జెఫరీస్ వివరించింది. -
ఏడాదిలో 3.68 కోట్ల ఉద్యోగాలు...
బీజింగ్ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారీగా ఉద్యోగావకాశాలను కల్పించింది. వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించనుంది. తాజా నివేదికల ప్రకారం 2017 సంవత్సరంలో 3.68 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. అలీబాబా గ్రూప్ నిర్వహిస్తున్న వివిధ సంస్థల ద్వారా 50కోట్ల వినియోగదారులకు సేవలందిస్తుందని, అన్లైన్ రిటైల్ విభాగంలోనే కొత్తగా 1.4 కోట్ల ఉద్యోగాలను కల్పించినట్టు పేర్కొంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, నిత్యవసరాలు, గృహోపకరణాల విభాగాలు ఈ నియామకాల్లో అగ్రభాగాన ఉన్నాయని తెలిపింది. ఆర్ అండ్ డీ, డిజైన్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లోని నిపుణలకు డిమాండ్ పెరగడానికి అన్లైన్ రిటైల్ సేవల విస్తరణ ఎంతగానో దోహదపడినట్టు, కేవలం ఈ రంగాల్లోనే 2.27 కోట్ల ఉద్యోగాలు కల్పించగలిగారని నివేదించింది. గత ఏడాదితో పోల్చితే 2017 నాలుగో త్రైమాసికంలో ఆదాయంలో 56 శాతం వృద్ధి సాధించినట్టు అలీబాబా గ్రూప్ పేర్కొంది. భవిష్యత్తులో ఈ కామర్స్ రంగం మరింత కీలకంగా మారనున్నట్టు వెల్లడించింది. వ్యాపార విధానాలను సంస్కరించడం, అఫ్లైన్ రిటైల్ వ్యాపారాన్ని డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఈ రిపోర్ట్ తెలిపింది. -
ఇక్కడ అమ్మితే.. మాకే పన్ను కట్టండి!
ఆన్లైన్ విక్రయ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అమ్మకాలు సాగిస్తున్న సంస్థలు రాష్ట్రంలో విక్రయాలు చేసిన పక్షంలో... వాటికి సంబంధించిన వ్యాట్‌ను తెలంగాణలోనే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో ఉంటున్న పలు సంస్థలు ఆన్లైన్లో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ... సదరు వస్తువులు, సామగ్రిని కొరియర్ సంస్థలతోనో, తమ నెట్వర్క్తోనో వినియోగదారులకు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలు పడిపోయి వ్యాట్ ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఓఎల్ఎక్స్ తదితర ఆన్లైన్ విక్రయాల సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే, దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆన్లైన్ విక్రయ సంస్థలు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు చేసి, రాష్ట్రంలోని వినియోగదారులకు అమ్మినట్లు తేలితే, నోటీసులు జారీ చేసి.. పన్నులు వసూలు చేస్తామని చెప్పారు.