ఆన్‌లైన్ విక్రయ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్న సంస్థలు రాష్ట్రంలో విక్రయాలు చేసిన పక్షంలో... వాటికి సంబంధించిన వ్యాట్‌ను తెలంగాణలోనే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో ఉంటున్న పలు సంస్థలు ఆన్‌లైన్‌లో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ... సదరు వస్తువులు, సామగ్రిని కొరియర్ సంస్థలతోనో, తమ నెట్‌వర్క్‌తోనో వినియోగదారులకు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలు పడిపోయి వ్యాట్ ఆదాయం తగ్గుతోంది.
ఈ నేపథ్యంలో ఆ ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఓఎల్‌ఎక్స్ తదితర ఆన్‌లైన్ విక్రయాల సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే, దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆన్‌లైన్ విక్రయ సంస్థలు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు చేసి, రాష్ట్రంలోని వినియోగదారులకు అమ్మినట్లు తేలితే, నోటీసులు జారీ చేసి.. పన్నులు వసూలు చేస్తామని చెప్పారు.