రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..! | Million jobs in two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..!

Published Tue, Sep 8 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..!

రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..!

లాజిస్టిక్స్‌కు చేయూతనిస్తున్న ఈ- కామర్స్ బూమ్
- నిపుణులతో పాటు క్షేత్ర స్థాయిలో భారీగా వేకెన్సీలు...
- అనుభవాన్ని బట్టి చక్కని జీతభత్యాలు
- సొంత లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్న దిగ్గజాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఇప్పుడు దేనికైనా ఈ-కామర్సే. మాల్ గానీ... మండీ గానీ... ఏదైనా చేతిలోని స్మార్ట్ ఫోనే. సింపుల్‌గా ఫోన్‌పైన క్లిక్ చేస్తే చాలు. కావాల్సిన కూరగాయలు, సరుకులు, ఉపకరణాలు, ఇతర వస్తువులు నేరుగా ఇంటికొచ్చి వాలిపోతున్నాయి. దీనికోసం ఇ-కామర్స్ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇక నిధులంటారా! ఆ సమస్యే లేదు. ఎంతంటే అంత పెట్టుబడికి విదేశీ దిగ్గజాలు రెడీగా ఉన్నాయి. భారత్‌లోనూ పెట్టుబడిదారులకు కొదవ లేదు. ఇంత వరకూ బాగానే ఉన్నా... ఇవేమీ డిజిటల్ ఉత్పత్తులు కాదు కదా నేరుగా ఫోన్లోనే డెలివరీ చేయడానికి.

మరి ఈ వస్తువుల్ని కస్టమర్‌కు చేరవేసేదెవరు? ఇదిగో... ఈ అంశమే ఇపుడు ప్రపంచ ఈ-కామర్స్ రంగాన్ని శాసిస్తోంది. చెప్పిన టైముకు డెలివరీ చేయకపోతే కస్టమర్ ఆగ్రహానికి  గురి కావాల్సిందే. రేటింగ్ తగ్గిందా ఇక ఆ కంపెనీ మనుగడ పెద్ద సవాలే. అదీ లాజిస్టిక్స్ పాత్ర. కాకపోతే సరుకుల డెలివరీకి అమెరికాలో డ్రోన్‌ల వంటివి ఉపయోగించాలని చూస్తున్నా... దానిలో ఉండే ఇబ్బందుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం అనుమతివ్వలేదు. అవి సాకారం దాల్చటం అంత ఈజీ కాదు కూడా. అందుకే ఈ రంగంలో మానవ వనరుల అవసరం విపరీతంగా కనిపిస్తోంది. అది ఎంతంటే... వచ్చే రెండేళ్లలో ఒక్క భారతదేశంలోనే కోటి మంది సిబ్బంది అదనంగా అవసరమవుతారనే స్థాయిలో!!.
 
ప్రధాన భూమిక లాజిస్టిక్స్‌దే...

ఇ-కామర్స్ రంగంలో విక్రయానికి లక్షలాది ఉత్పత్తులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ వస్తువు ఎక్కడున్నా తెప్పించి ఇక్కడి కస్టమర్‌కు విక్రయించే కంపెనీలూ ఉన్నాయి.   కంపెనీతో కస్టమర్‌ను అనుసంధానించేందుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇదంతా ఒక ఎత్తై ఇ-కామర్స్ కంపెనీ వ్యవహారాల్లో 70 శాతానికి పైగా భూమిక లాజిస్టిక్స్‌దే. దీనికంతటికీ కారణం చాలా కంపెనీలు మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే సరుకులను కొనుగోలు చేసి తమ గిడ్డంగుల్లో నిల్వ చేయవు.

స్థానిక విక్రేతలతో చేతులు కలుపుతూ... అక్కడి నుంచే నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేస్తాయన్న మాట. ఈ విధానంలో సరుకులను నిల్వ చేసే బాధ్యత విక్రేతలదే. ఆర్డరు ఇవ్వగానే విక్రేత స్వయంగా కస్టమర్‌కు ఆ ఉత్పాదనను చేరవేస్తారు. ఇప్పుడు ఆస్క్‌మీ బజార్, పెప్పర్‌ట్యాప్ వంటి చాలా కంపెనీలు అగ్రిగేటర్ల అవతారం ఎత్తాయి. విక్రేతల నుంచి సరుకులను తీసుకుని కస్టమర్‌కు చేరవేయడం వీటి పని. ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ కోసం డెలివరీ బాయ్స్‌ను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. కస్టమర్ ఎంచుకున్న సమయంలో వేగంగా సరుకులను చేరవేయడం వీరి బాధ్యత.
 
మంచి వేతనాలూ ఉన్నాయి..
ఉపాధి అవకాశాల పరంగా లాజిస్టిక్స్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాలు రానున్న రోజుల్లో అత్యంత కీలకంగా ఉంటాయని హెచ్‌ఆర్ రంగ  నిపుణులు, టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి తెలిపారు. ఇ-కామర్స్ కంపెనీలు కొన్ని సొంతంగా లాజిస్టిక్స్ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి మంచి వేతనాలను చెల్లిస్తున్నాయి కూడా. లాజిస్టిక్స్ రంగంలో క్షేత్రస్థాయి ఉద్యోగాలు చాలా శ్రమతో కూడుకున్నవి. అందుకే ఈ రంగంలో ఏడాది కూడా పూర్తి కాకముందే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య 50 శాతం ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.

అయితే కార్మిక చట్టాలను అనుసరించి ఇ-కామర్స్ కంపెనీలు వేతనాలు చెల్లిస్తున్నాయని హ్యూసిస్ వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి వెల్లడించారు. ‘టెండర్ డాక్యుమెంట్లూ కొరియర్ ద్వారానే చేరుతున్నాయి. ఏ మాత్రం ఆలస్యమైనా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు చేజారతాయి. కొరియర్ బాయ్‌కి టెండర్ విలువ తెలిసినప్పుడే అతను విజయవంతం అవుతాడు. నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంది. వీరికి వచ్చే రెండేళ్లలో మూడున్నర రెట్ల వేతనాలు పెరగడం ఖాయం’ అని ఆయన పేర్కొన్నారు.
 
మరో కోటి మంది..
రవాణా, పంపిణీ రంగం లో భారత్‌లో ప్రస్తు తం 80 లక్షల మంది దాకా ఉపాధి పొందుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరో కోటి మంది ఈ రంగంలో అవసరమవుతారని అంచనాలున్నాయని 24 ఏళ్లుగా లాజిస్టిక్స్ రంగంలో సేవలందించి, టెలికం వ్యాపారంలోకి ప్రవేశించిన హైదరాబాద్‌కు చెందిన జైపాల్ రెడ్డి వెల్లడించారు. లాజిస్టిక్స్  కంపెనీలు 10 ఏళ్ల క్రితం ఒకరిని నియమించుకుంటే, ఇప్పుడు 100 మందిని నియమించుకోవాల్సి వస్తోందని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇచ్చే సంస్థలు కేవలం ఆదాయంపైనే దృష్టిసారిస్తున్నాయి.

ఏ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో శిక్షణ సంస్థలకు తెలియడం లేదు. 100 శాతం అవకాశాలు ఉన్నా, ఒక్కో శిక్షణ సంస్థలో 30-40 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. పరిశ్రమతో కలిసి పనిచేస్తేనే ఈ గ్యాప్ తగ్గుతుంది’ అని జి.ఆర్.రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, టైమ్స్‌జాబ్స్.కామ్ రిక్రూట్‌మెంట్ ఇండెక్స్ ‘రిక్రూట్‌ఎక్స్’, మాన్‌స్టర్.కామ్  మంత్లీ ఇండెక్స్ ప్రకారం జూలైలో అధిక ఉద్యోగాలను కల్పించిన రంగాల్లో లాజిస్టిక్స్ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement