అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.
భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.
రిలయన్స్ జియో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.
భారతదేశ టెలికామ్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్‌లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.
ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment