ఈ–కామర్స్ దిగ్గజాల మెగాసేల్
వరుసలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. 8 రోజులపాటు కస్టమర్లకు అదిరే ఆఫర్లు
న్యూఢిల్లీ: మన కోసం ఈ–కామర్స్ సంస్థలు పండుగ సీజన్‌ను ముందే తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటికే వాటి మెగా సేల్ తేదీలను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కస్టమర్ల ఆకర్షణే లక్ష్యంగా భారీ డిస్కౌంట్లకు, డీల్స్‌కు తెరలేపనున్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్స్‌లో కస్టమర్లు ప్రధానంగా ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టెలివిజన్లు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను పొందొచ్చు. మార్కెట్‌లో అగ్రస్థానం కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలు ఇండియన్ మార్కెట్‌లో భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా మంది విక్రయదారులను, కొనుగోలుదారులను వాటి వాటి ప్లాట్‌ఫామ్‌లలోకి తెచ్చుకునేందుకు వీలుగా ఇరు సంస్థలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి.
ముందు అమెజాన్ సందడి..
భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, డీల్స్‌తో అమెజాన్ ముందుగా కస్టమర్లను పలకరించనుంది. మే నెల 11 నుంచి 14 వరకు ‘గ్రేట్ ఇండియా సేల్’ను నిర్వహిస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది.
మే 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10’ సేల్
ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ 10’ సేల్‌ను మే నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ‘బిగ్ 10’ సేల్.. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌కు భిన్నమైనదని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ‘బిగ్ 10’ సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ తర్వాత అదేతరహాలో అంతే స్థాయిలో ‘బిగ్ 10’ సేల్‌ను తీసుకువస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.