నెట్లోనే కాదు... కొట్లోనూ
⇒ రెండింటా ఉండాలనుకుంటున్న రిటైల్ సంస్థలు
⇒ ఈ-కామర్స్ సంస్థల ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు
⇒ ఆన్‌లైన్ వ్యాపారంలోకి రిటైల్ చైన్‌లు
⇒ భవిష్యత్తుపై బెంగతోనే ఈ వైఖరి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముప్పై ఎనిమిది లక్షల కోట్ల విలువైన భారత రిటైల్ రంగంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సంస్థల్ని విస్తరణ భయం ఆవరించింది.
దీంతో అవి అటూ-ఇటూ విస్తరించడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు బిగ్ ఫార్మాట్ రిటైల్ సంస్థల ద్వారా ఉత్పత్తులు విక్రయించిన రిటైల్ కంపెనీలు... కొత్త వ్యాపార వేదికైన ఆన్‌లైన్ బాటపడుతున్నాయి. ఆన్‌లైన్ కంపెనీలేమో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి.
ఉదాహరణకు కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు మేక్ మై ట్రిప్, కార్ ట్రేడ్, ఫస్ట్ క్రై, లెన్స్ కార్ట్ వంటి ఆన్‌లైన్ దిగ్గజాలు దేశవ్యాప్తంగా స్టోర్లు తెరుస్తున్నాయి. ఆన్‌లైన్ ట్రావెల్ రంగంలో ఉన్న మేక్ మై ట్రిప్ ఇప్పటికే 18 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు తెరిచింది. టికెట్ల డబ్బులు చెల్లించేందుకు తమ సిబ్బందిని కలవాలని కస్టమర్లు భావిస్తుండడమే స్టోర్లు తెరవడానికి ప్రధాన కారణమని కంపెనీ సీఎంవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. ఆన్‌లైన్ ఆటో క్లాసిఫైడ్స్ సేవల్లో ఉన్న ‘కార్ ట్రేడ్’ పలు నగరాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది.
ఆరు నెలల్లో ఈ సంఖ్యను రెండింతలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఫర్నీచర్ విక్రయ కంపెనీ ‘ఫ్యాబ్ ఫర్నిష్’ ఇప్పటికే 4 స్టోర్లను తెరిచింది. బ్రాండ్‌ను విస్తరించడానికే ఇదంతా చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. పెళ్లి సంబంధాల సేవల్లో ఉన్న ‘భారత్ మ్యాట్రిమోనీ’కి 20 నగరాల్లో 180కి పైగా కార్యాలయాలున్నాయి. టెక్నాలజీ పరంగా ముందుండే యూఎస్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఇవి విస్తరించాయి. షాదీ.కామ్ హైదరాబాద్‌తో సహా 87 నగరాల్లో 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కళ్లద్దాల వ్యాపారంలో ఉన్న లెన్స్‌కార్ట్ 68 స్టోర్లను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా కొత్తగా 10 ఔట్‌లెట్లు ప్రారంభిస్తోంది. పిల్లల దుస్తులు, బొమ్మలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘ఫస్ట్ క్రె’ై 22 రాష్ట్రాల్లో 100కుపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 9 స్టోర్లున్నాయి. విజయవాడతో సహా వివిధ నగరాల్లో 19 స్టోర్లను త్వరలో తెరుస్తోంది. ఈ ఏడాదిలో మరో 100కుపైగా స్టోర్లను తెరవాలన్నది కంపెనీ లక్ష్యం. ఆన్‌లైన్ షాపింగ్ వల్ల టచ్ అండ్ ఫీల్ అనుభూతి ఉండదని, అందుకే స్టోర్లను ప్రారంభించామని ఫస్ట్ క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి తెలియజేశారు.
స్టోర్ల నుంచి ఆన్‌లైన్‌కు..
కొత్త మాల్ ఎక్కడ వచ్చినా స్టోర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఒకే నగరంలో విరివిగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఈ-కామర్స్ ధాటికి కొన్ని స్టోర్లను మూసివేయడం, మాల్స్‌లో స్థలాన్ని తగ్గించుకోవడం చేశాయి. భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోలు దార్లు 2014లో 3.5 కోట్ల మంది ఉన్నారని, 2016లో ఈ సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశముందని గూగుల్ వంటి సంస్థలు అంచనా వేయటంతో ఈ రిటైల్ చైన్లు ఆన్‌లైన్ బాట పట్టాయి. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ బిగ్ బజార్, షాపర్స్ స్టాప్, పాంటలూన్స్ సైతం ఆన్‌లైన్ బాట పట్టాయి.
రిటైల్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన టైటన్... తనిష్క్, ఫాస్ట్ ట్రాక్, టైటన్ ఐ ప్లస్, సొనాటా తదితర బ్రాండ్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఉన్న శామ్‌సంగ్, ఎల్‌జీ, ప్యానాసోనిక్, వర్ల్‌పూల్, డెల్, హెచ్‌పీ, లెనోవో, హెచ్‌సీఎల్, మైక్రోమ్యాక్స్, కార్బన్ తదితర కంపెనీలు ఈ-కామర్స్‌కు సై అన్నాయి. మొబైల్స్ విక్రయంలో ఉన్న బిగ్ సి, లాట్, యూనివర్‌సెల్, సంగీత కూడా వీటి సరసన చేరాయి.
‘‘దేశంలో కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు. అందుకే ఇంకా ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం దేశంలో రూ.24,000 కోట్లుగానే ఉంది. ఐదేళ్ల తరవాత కూడా 85 శాతం వ్యాపారం రిటైల్ దుకాణాల (ఆఫ్‌లైన్లో) ద్వారానే జరుగుతుంది. వినియోగదార్లకు ఆన్‌లైన్ షాపింగ్ చాలా అనువుగా ఉంటోంది కానీ వారు కోరుకునే టచ్ అండ్ ఫీల్ అనుభూతి రావటం లేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో అమ్మాలంటే కస్టమర్లకు చేరువగా దుకాణాలు ఉండాల్సిందే’’.
- ఇదీ... దేశంలోని ఆన్‌లైన్ కంపెనీల ధోరణి
‘‘దేశంలో ఈ-కామర్స్ విజృంభణ మామూలుగా లేదు. దాని ధాటికి చిన్న చిన్న దుకాణాలు కనుమరుగైపోతున్నాయి. ఇంటర్నెట్ బూమ్‌తో ఈ-కామర్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆన్‌లైన్ వ్యాపారంలో నిర్వహణ వ్యయాలూ తక్కువే. భారత్‌లో నాలుగేళ్లలో ఇది నాలుగు రెట్లు పెరగబోతోంది. అందుకే విస్తరణ విషయంలో బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా ఆచితూచి అడుగేస్తున్నాయి. కంపెనీలు అద్దె చెల్లిస్తే తప్ప ఫ్రాంచైజీలు కొనసాగలేకపోతున్నాయి. అందుకని ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకోవాల్సిందే.’’
- ఇదీ... ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల ఆలోచన