Retail companies
-
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం: ప్లీజ్ మోదీజీ! పుతిన్ ఆసక్తిర వ్యాఖ్యలు!
భారత్ - రష్యా వ్యాపార ఒప్పొందాలపై వ్లాదమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారత్ రీటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు భారత్ (కేంద్రం)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యద్దం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన వేలాది దిగ్గజ కంపెనీలు రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. పుతిన్ మాత్రం ప్రపంచ దేశాలతో వ్యాపార ఒప్పొందాలు చేసి రష్యాకు పున: వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా ఉనికి పెరిగిపోతుంది! ఈనేపథ్యంలో రష్యా- బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోమేతమైనట్లు బ్రిక్స్ వేదికగా పుతిన్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రష్యా సమాఖ్య, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 38 శాతం పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. ఉదాహరణకు..రష్యాలో రీటైల్ స్టోర్లను ఓపెన్ చేసేందుకు ప్రధాని మోదీతో ఒప్పిస్తున్నామని, దేశీయ మార్కెట్(రష్యా)లో చైనా కార్లు, ఇతర ప్రొడక్ట్‌లు, హార్డ్‌వేర్ వాటాల్నిపెంచేలా చర్చిస్తున్నట్లు తెలిపారు. తద్వారా బ్రిక్స్ దేశాలలో రష్యా ఉనికి పెరుగుతుంది' అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ నిర్ణయం భేష్! రష్యా నుండి ఎక్కువ చమురును దిగుమతి చేసుకోవాలన్న భారత్ నిర్ణయంతో అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలతో దాని సంబంధాలు దెబ్బ తిన్నాయని అన్నారు. అయినప్పటికీ భారత్ రష్యా నుంచి చేసుకున్న చమురు దిగుమతులలో 2శాతం కంటే ఎక్కువ లేదు. ఆంక్షలు ఉన్నప్పటికీ ఐరోపా స్వయంగా రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారత్ సైతం చమరు కొనుగోళ్లను సమర్ధించుకుంటుంది. అంతేకాదు తమ దేశం బ్రిక్స్ దేశాలకు పెద్దమొత్తంలో ఎరువులను ఎగుమతి చేస్తుందని, రష్యా ఐటి కంపెనీలు భారత్, దక్షిణాఫ్రికాలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని పుతిన్ చెప్పారు. చదవండి👉ఉద్యోగుల తొలగింపు..మరింత దూకుడుగా ఎలన్ మస్క్! -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్‌కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్‌లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్‌కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్‌యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం!
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (సత్వర సేవలు అందించేవి/క్యూఎస్ఆర్), మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు చిన్న పట్టణాల్లోకి వేగంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లు కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకుంటుండడం.. డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఈ సంస్థలు వేగంగా విస్తరించాలనుకుంటున్నాయి. డోమినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీ ఇవన్నీ క్యూఎస్ఆర్ కిందకే వస్తాయి. వీటితోపాటు గ్రోసరీ గొలుసు దుకాణాల సంస్థ మోర్ సైతం చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. చిన్న పట్టణాల్లో వీటి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుండడం ఆయా సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది. యువత నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని, ఆకర్షణీయమైన ధరలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద క్యూఎస్ఆర్ అయిన జుబిలంట్ ఫుడ్ వర్క్స్ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ బ్రాండ్ల కింద దేశవ్యాప్తంగా 1,360 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కొత్తగా 135 స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో నూతన స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలతో పోలిస్తే ఇతర పట్టణాల్లో వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు మార్చి ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల సదస్సులో ఈ కంపెనీ తెలిపింది. వృద్ధి బాటలోకి.. ‘‘మార్చి త్రైమాసికంలో తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టాం. భారీగా నూతన స్టోర్లను ప్రారంభించడం కూడా జరిగింది. మార్జిన్లతోపాటు పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్ల సంఖ్య కూడా పెరిగింది’’ అని జుబిలంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో ప్రతీక్పోట తెలిపారు. కరోరా రెండో విడత పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రభావం చూపించిందని.. నూతన వినియోగదారులకు చేరువ కావడమే వృద్ధి చోదకం అవుతుందని ఈ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘టైర్ 2, 3, 4 పట్టణాల్లోకి ప్రముఖ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న పట్టణాల్లో ఆయా కంపెనీలకు ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉంటోంది’’ అని అనరాక్ రిటైల్ సంయుక్త ఎండీ పంకజ్ రెంజెన్ చెప్పారు. స్టోర్లను పెంచుకుంటూనే ఉన్నాయ్.. సాధారణంగా రెస్టారెంట్ల వ్యాపారం డెలివరీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. దీంతో చిన్న పట్టణాల్లో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా డెలివరీ డిమాండ్‌ను చేరుకోవచ్చని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘‘కరోనా కారణంగా సమస్యలు ఏర్పడినప్పటికీ టైర్–2, 3 పట్టణాల్లో, మెట్రోల్లోనూ మా ఫ్రాంచైజీ రెస్టారెంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూనే ఉంది’’అని కేఎఫ్‌సీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కోజికోడ్, నిజామాబాద్, ముజఫర్‌పూర్, భాగల్పూర్ తదితర పట్టణాల్లో కేఎఫ్‌సీకి చెందిన యూమ్ రెస్టారెంట్లను తెరిచినట్టు చెప్పారు. మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు సైతం చిన్న పట్టణాల్లో విస్తరణపై దృష్టి పెట్టాయి. ఆగ్రా, ఫైజాబాద్, ముజఫర్‌పూర్, సితాపూర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో విస్తరణ కోసం మోర్ సంస్థ స్థలాలను లీజుకు తీసుకుంది. కరోనా వల్ల లాక్డౌన్లు విధించినప్పటికీ చిన్న పట్టణాల్లోని యువ వినియోగదారులు తమ వృద్ధి చోదకాలని కంపెనీలు చెబుతున్నాయి. డోమినోస్ తన యాప్‌లో హిందీని చేర్చగా.. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది. -
అమెజాన్ ‘సూపర్ మార్కెట్లు’!
న్యూఢిల్లీ: దేశీయ ఆన్లైన్ మార్కెట్లో ప్రధాన కంపెనీగా అవతరించిన అమెజాన్, ఆఫ్‌లైన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకుగాను దేశీయ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, రిటైల్ కంపెనీల్లో ఒకదానిలో వాటా కొనుగోలు చేసేందుకు ప్రాథమిక సంప్రదింపులు మొదలు పెట్టింది. పెద్ద రిటైల్ సంస్థలు సైతం అమెజాన్‌తో చర్చించాయని, ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల దేశీయ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ జరిగిన వెంటనే తన కంపెనీలో వాటాను బలమైన అంతర్జాతీయ రిటైలర్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫ్యూచర్ గ్రూపు వ్యవస్థాపకుడు కిషోర్బియానీ ప్రకటించారు. కిషోర్బియానీ ఇప్పటికే అమెజాన్‌తో, వాల్మార్ట్తోనూ సంప్రదింపులు జరపడం గమనార్హం. ఫ్యూచర్‌గ్రూపు బిగ్‌బజార్ సహా మరెన్నో బ్రాండ్లపై దుకాణాలు నిర్వహిస్తోంది. ఇక అమెజాన్‌తో ప్రాంతీయ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ సంస్థలు కూడా చర్చలు జరిపాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్‌తో ఈ వ్యవహారానికి సంబంధం లేదని, ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి ప్రవేశించాలన్న ప్రయత్నాలు అమెజాన్ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నట్టు చెప్పాయి. ‘‘అమెజాన్ అమెరికాలో మాదిరిగానే భారత రిటైల్ మార్కెట్లో విస్తరించాలనుకుంటోంది. కొన్ని కంపెనీలతో సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయి. అన్నీ కుదిరితే భారీ రిటైలర్‌తో ఈ ఏడాది చివరికి డీల్ కుదరొచ్చు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అమెజాన్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. తొలుత చిన్నగానే... ‘‘తొలుత 10 నుంచి 15 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనిపైనే చర్చిస్తోంది. తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. అవసరం అనుకుంటే మెజారిటీ వాటా కొనుగోలు చేస్తుంది. కానీ, ప్రస్తుతమైతే ఆఫ్‌లైన్ రిటైల్ ఎలా ఉంటుందో చూడాలన్నదే ప్రణాళిక. భారత్‌లో రిటైల్ చైన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలనుకుంటోంది. దీర్ఘకాలంలో శీతల గోదాములపై ఇన్వెస్ట్ చేస్తుంది. రైతుల నుం చి నేరుగా ఉత్పత్తులను సమీకరిస్తుంది. స్థానికంగా ఉత్పత్తి అయిన వాటిని విదేశాలకు షిప్ చేసే ప్రణాళికలతోనూ ఉంది. స్థానిక కంపెనీలు తయారు చేసిన వాటిని ఇప్పటికే విదేశాల్లో విక్రయిస్తోంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో షాపర్స్‌స్టాప్‌లో అమెజాన్ ఎన్వీ హోల్డింగ్స్ 1.79 బిలియన్ డాలర్లతో 5% వాటా కొనడం విదితమే. తన ఉత్పత్తులను అమెజాన్ డాట్ ఇన్‌లో విక్రయించేందుకు షాపర్స్‌స్టాప్ ఒప్పందం కూడా చేసుకుంది. అమెజాన్.ఇన్ ఇప్పటికే ఆన్లైన్లో గ్రోసరీ ఉత్పత్తులను విక్రయిస్తుండగా, ఆహార రిటైల్‌లో ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతినీ తీసుకుంది. జొమాటోపై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను! వాల్‌మార్ట్‌లో తనకున్న వాటాలను భారీ విలువకు విక్రయించేందుకు డీల్ చేసుకున్న జపాన్ దేశ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై కన్నేసింది. జొమాటోలో పెట్టుబడులు పెట్టేందుకు గాను చర్చలు ప్రారంభించింది. ఈ వారం మొదట్లో ఇది జరిగినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడి చేశాయి. ఆరు నెలల క్రితం బెంగళూరుకు చెందిన మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో 200–250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సాఫ్ట్ బ్యాంకులు చర్చలు జరిపిన విషయం గమనార్హం. గతేడాది నవంబర్ నుంచి పలు మార్లు సంప్రదింపులు సాగించింది. అయితే, సాఫ్ట్‌బ్యాంకు నుంచి నిధులు సమీకరించే విషయంలో స్విగ్గీ ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు దేశీయ ఫుడ్ డెలివరీ మార్కెట్లో కీలక పాత్రను పోషించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పాయి. కనీసం 200–400 మిలియన్ డాలర్ల మధ్య ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది సాఫ్ట్‌బ్యాంకు యోచనని, ఈ ఏడాది చివరి నాటికి ఇది కార్యరూపం దాల్చొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఎఫ్‌డీఐ నిబంధనలు సరళం
కాంపోజిట్ పరిమితి అమలు ప్రతిపాదన రిటైల్ కంపెనీలు, కమోడిటీ, పవర్ ఎక్స్చేంజీలకు ప్రయోజనకరం కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్రం నిబంధనలను మరింత సరళతరం చేసింది. పలు రంగాల్లో ఎన్నారై, ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ తదితర మార్గాల్లో వచ్చే విదేశీ పెట్టుబడులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి కాంపోజిట్ పరిమితుల విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. రిటైల్ కంపెనీలు, మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు, కమోడిటీ.. పవర్ ఎక్స్చేంజీలు మొదలైన వాటికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళతరం చేసేందుకే కాంపోజిట్ పరిమితుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై అన్ని ఎఫ్ఐఐలు, ప్రవాస భారతీయుల పెట్టుబడులు, ఇతరత్రా విదేశీ పెట్టుబడులన్నింటినీ ఒక్క విభాగం కింద చేర్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఎన్నారైలు మొదలైన ఇన్వెస్టర్లను వేర్వేరు కేటగిరీలుగా పరిగణిస్తూ, వేర్వేరు పరిమితులను అమలుచేస్తున్నారు. విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు(ఎఫ్‌సీసీబీ), డిపాజిటరీ రిసీట్స్(డీఆర్) రూపంలో వచ్చిన పెట్టుబడులను ఈక్విటీ కిందికి మార్చుకోనంత వరకూ విదేశీ పెట్టుబడుల కింద పరిగణించడం జరగదని కేంద్రం తెలిపింది. వివిధ విభాగాల పరిమితులకు సంబంధించి గందరగోళాన్ని తొలగించి, విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేసేలా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. 2014-15లో ఎఫ్ఐఐ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగి 40.92 బిలియన్ డాలర్లకు, ఎఫ్‌డీఐలు 27 శాతం ఎగిసి 30.93 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్ఆర్బీలకు అదనంగా రూ. 700 కోట్లు.. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్ఆర్బీ) ఊరటనిచ్చేలా మరో రూ. 700 కోట్ల మేర నిధులను కేబినెట్ మంజూరు చేసింది. ఆర్ఆర్బీలు అదనంగా మూలధనాన్ని సమకూర్చుకునేందుకు రీక్యాపిటలైజేషన్ స్కీమ్ గడువును 2016-17 దాకా పొడిగించింది. రుణాల రిస్కులకు తగ్గట్లుగా మూలధన నిష్పత్తిని పాటించాల్సిన నిబంధనలను (సీఆర్ఏఆర్) అందుకోగలిగేలా 21 రాష్ట్రాల్లోని 40 ఆర్ఆర్బీలకు రూ. 2,200 కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ అవసరమంటూ కేసీ చక్రవర్తి కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 2010-11లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2014 మార్చి ఆఖరు దాకా 39 ఆర్ఆర్బీలకు రూ.1,087 కోట్లు విడుదలయ్యాయి. ఆర్బిట్రేషన్ చట్ట సవరణపై నిర్ణయం వాయిదా వ్యాపారపరమైన వివాదాలను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ధారించేందుకు, ఆర్బిట్రేషన్ ఫీజుపై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఆర్బిట్రే షన్ చట్టాన్ని సవరించడంపై నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
నెట్లోనే కాదు... కొట్లోనూ
⇒ రెండింటా ఉండాలనుకుంటున్న రిటైల్ సంస్థలు ⇒ ఈ-కామర్స్ సంస్థల ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ⇒ ఆన్లైన్ వ్యాపారంలోకి రిటైల్ చైన్లు ⇒ భవిష్యత్తుపై బెంగతోనే ఈ వైఖరి! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముప్పై ఎనిమిది లక్షల కోట్ల విలువైన భారత రిటైల్ రంగంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థల్ని విస్తరణ భయం ఆవరించింది. దీంతో అవి అటూ-ఇటూ విస్తరించడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు బిగ్ ఫార్మాట్ రిటైల్ సంస్థల ద్వారా ఉత్పత్తులు విక్రయించిన రిటైల్ కంపెనీలు... కొత్త వ్యాపార వేదికైన ఆన్లైన్ బాటపడుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలేమో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి. ఉదాహరణకు కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు మేక్ మై ట్రిప్, కార్ ట్రేడ్, ఫస్ట్ క్రై, లెన్స్ కార్ట్ వంటి ఆన్లైన్ దిగ్గజాలు దేశవ్యాప్తంగా స్టోర్లు తెరుస్తున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ రంగంలో ఉన్న మేక్ మై ట్రిప్ ఇప్పటికే 18 ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు తెరిచింది. టికెట్ల డబ్బులు చెల్లించేందుకు తమ సిబ్బందిని కలవాలని కస్టమర్లు భావిస్తుండడమే స్టోర్లు తెరవడానికి ప్రధాన కారణమని కంపెనీ సీఎంవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. ఆన్లైన్ ఆటో క్లాసిఫైడ్స్ సేవల్లో ఉన్న ‘కార్ ట్రేడ్’ పలు నగరాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది. ఆరు నెలల్లో ఈ సంఖ్యను రెండింతలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఫర్నీచర్ విక్రయ కంపెనీ ‘ఫ్యాబ్ ఫర్నిష్’ ఇప్పటికే 4 స్టోర్లను తెరిచింది. బ్రాండ్‌ను విస్తరించడానికే ఇదంతా చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. పెళ్లి సంబంధాల సేవల్లో ఉన్న ‘భారత్ మ్యాట్రిమోనీ’కి 20 నగరాల్లో 180కి పైగా కార్యాలయాలున్నాయి. టెక్నాలజీ పరంగా ముందుండే యూఎస్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఇవి విస్తరించాయి. షాదీ.కామ్ హైదరాబాద్‌తో సహా 87 నగరాల్లో 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కళ్లద్దాల వ్యాపారంలో ఉన్న లెన్స్‌కార్ట్ 68 స్టోర్లను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా కొత్తగా 10 ఔట్లెట్లు ప్రారంభిస్తోంది. పిల్లల దుస్తులు, బొమ్మలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘ఫస్ట్ క్రె’ై 22 రాష్ట్రాల్లో 100కుపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 9 స్టోర్లున్నాయి. విజయవాడతో సహా వివిధ నగరాల్లో 19 స్టోర్లను త్వరలో తెరుస్తోంది. ఈ ఏడాదిలో మరో 100కుపైగా స్టోర్లను తెరవాలన్నది కంపెనీ లక్ష్యం. ఆన్లైన్ షాపింగ్ వల్ల టచ్ అండ్ ఫీల్ అనుభూతి ఉండదని, అందుకే స్టోర్లను ప్రారంభించామని ఫస్ట్ క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి తెలియజేశారు. స్టోర్ల నుంచి ఆన్‌లైన్‌కు.. కొత్త మాల్ ఎక్కడ వచ్చినా స్టోర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఒకే నగరంలో విరివిగా ఔట్లెట్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఈ-కామర్స్ ధాటికి కొన్ని స్టోర్లను మూసివేయడం, మాల్స్‌లో స్థలాన్ని తగ్గించుకోవడం చేశాయి. భారత్‌లో ఆన్లైన్ కొనుగోలు దార్లు 2014లో 3.5 కోట్ల మంది ఉన్నారని, 2016లో ఈ సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశముందని గూగుల్ వంటి సంస్థలు అంచనా వేయటంతో ఈ రిటైల్ చైన్లు ఆన్లైన్ బాట పట్టాయి. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ బిగ్ బజార్, షాపర్స్ స్టాప్, పాంటలూన్స్ సైతం ఆన్లైన్ బాట పట్టాయి. రిటైల్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన టైటన్... తనిష్క్, ఫాస్ట్ ట్రాక్, టైటన్ ఐ ప్లస్, సొనాటా తదితర బ్రాండ్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఉన్న శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, వర్ల్‌పూల్, డెల్, హెచ్‌పీ, లెనోవో, హెచ్‌సీఎల్, మైక్రోమ్యాక్స్, కార్బన్ తదితర కంపెనీలు ఈ-కామర్స్‌కు సై అన్నాయి. మొబైల్స్ విక్రయంలో ఉన్న బిగ్ సి, లాట్, యూనివర్సెల్, సంగీత కూడా వీటి సరసన చేరాయి. ‘‘దేశంలో కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారు. అందుకే ఇంకా ఆన్లైన్ రిటైల్ వ్యాపారం దేశంలో రూ.24,000 కోట్లుగానే ఉంది. ఐదేళ్ల తరవాత కూడా 85 శాతం వ్యాపారం రిటైల్ దుకాణాల (ఆఫ్‌లైన్‌లో) ద్వారానే జరుగుతుంది. వినియోగదార్లకు ఆన్లైన్ షాపింగ్ చాలా అనువుగా ఉంటోంది కానీ వారు కోరుకునే టచ్ అండ్ ఫీల్ అనుభూతి రావటం లేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో అమ్మాలంటే కస్టమర్లకు చేరువగా దుకాణాలు ఉండాల్సిందే’’. - ఇదీ... దేశంలోని ఆన్లైన్ కంపెనీల ధోరణి ‘‘దేశంలో ఈ-కామర్స్ విజృంభణ మామూలుగా లేదు. దాని ధాటికి చిన్న చిన్న దుకాణాలు కనుమరుగైపోతున్నాయి. ఇంటర్నెట్ బూమ్‌తో ఈ-కామర్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆన్లైన్ వ్యాపారంలో నిర్వహణ వ్యయాలూ తక్కువే. భారత్‌లో నాలుగేళ్లలో ఇది నాలుగు రెట్లు పెరగబోతోంది. అందుకే విస్తరణ విషయంలో బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా ఆచితూచి అడుగేస్తున్నాయి. కంపెనీలు అద్దె చెల్లిస్తే తప్ప ఫ్రాంచైజీలు కొనసాగలేకపోతున్నాయి. అందుకని ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకోవాల్సిందే.’’ - ఇదీ... ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల ఆలోచన