చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం! | QSRs, mid-sized retail chains plan aggressive growth in smaller markets | Sakshi
Sakshi News home page

చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం!

Published Sat, Jun 19 2021 12:37 AM | Last Updated on Sat, Jun 19 2021 12:37 AM

QSRs, mid-sized retail chains plan aggressive growth in smaller markets - Sakshi

న్యూఢిల్లీ: క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (సత్వర సేవలు అందించేవి/క్యూఎస్‌ఆర్‌), మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్‌ సంస్థలు చిన్న పట్టణాల్లోకి వేగంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లు కరోనా లాక్‌డౌన్‌ల నుంచి కోలుకుంటుండడం.. డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఈ సంస్థలు వేగంగా విస్తరించాలనుకుంటున్నాయి. డోమినోస్‌ పిజ్జా, మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీ ఇవన్నీ క్యూఎస్‌ఆర్‌ కిందకే వస్తాయి. వీటితోపాటు గ్రోసరీ గొలుసు దుకాణాల సంస్థ మోర్‌ సైతం చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.

చిన్న పట్టణాల్లో వీటి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుండడం ఆయా సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది. యువత నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోందని, ఆకర్షణీయమైన ధరలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద క్యూఎస్‌ఆర్‌ అయిన జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ డోమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ బ్రాండ్ల కింద దేశవ్యాప్తంగా 1,360 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కొత్తగా 135 స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో నూతన స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. టైర్‌–1 పట్టణాలతో పోలిస్తే ఇతర పట్టణాల్లో వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు మార్చి ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల సదస్సులో ఈ కంపెనీ తెలిపింది.  

వృద్ధి బాటలోకి..  
‘‘మార్చి త్రైమాసికంలో తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టాం. భారీగా నూతన స్టోర్లను ప్రారంభించడం కూడా జరిగింది. మార్జిన్లతోపాటు పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్ల సంఖ్య కూడా పెరిగింది’’ అని జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సీఈవో ప్రతీక్‌పోట తెలిపారు. కరోరా రెండో విడత పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రభావం చూపించిందని.. నూతన వినియోగదారులకు చేరువ కావడమే వృద్ధి చోదకం అవుతుందని ఈ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘టైర్‌ 2, 3, 4 పట్టణాల్లోకి ప్రముఖ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న పట్టణాల్లో ఆయా కంపెనీలకు ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉంటోంది’’ అని అనరాక్‌ రిటైల్‌ సంయుక్త ఎండీ పంకజ్‌ రెంజెన్‌ చెప్పారు.  

స్టోర్లను పెంచుకుంటూనే ఉన్నాయ్‌..
సాధారణంగా రెస్టారెంట్ల వ్యాపారం డెలివరీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. దీంతో చిన్న పట్టణాల్లో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా డెలివరీ డిమాండ్‌ను చేరుకోవచ్చని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘‘కరోనా కారణంగా సమస్యలు ఏర్పడినప్పటికీ టైర్‌–2, 3 పట్టణాల్లో, మెట్రోల్లోనూ మా ఫ్రాంచైజీ రెస్టారెంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూనే ఉంది’’అని కేఎఫ్‌సీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.

కోజికోడ్, నిజామాబాద్, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్‌ తదితర పట్టణాల్లో కేఎఫ్‌సీకి చెందిన యూమ్‌ రెస్టారెంట్లను తెరిచినట్టు చెప్పారు. మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్‌ సంస్థలు సైతం చిన్న పట్టణాల్లో విస్తరణపై దృష్టి పెట్టాయి. ఆగ్రా, ఫైజాబాద్, ముజఫర్‌పూర్, సితాపూర్, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో విస్తరణ కోసం మోర్‌ సంస్థ స్థలాలను లీజుకు తీసుకుంది. కరోనా వల్ల లాక్‌డౌన్‌లు విధించినప్పటికీ చిన్న పట్టణాల్లోని యువ వినియోగదారులు తమ వృద్ధి చోదకాలని కంపెనీలు చెబుతున్నాయి. డోమినోస్‌ తన యాప్‌లో హిందీని చేర్చగా.. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement