Small towns
-
బిలియనీర్లు C/O బుల్లి పట్టణాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిలో చిన్న పట్టణాలు పెద్ద నగరాలతో పోటీపడుతూ తగ్గేదేలేదంటున్నాయి. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగిన వారిలో 178 మంది చిన్న పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు ఐఐఎఫ్ఎల్ హూరన్ ఇండియా రిచ్ లిస్ట్–2022 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లపైగా సంపద కలిగిన వారు 1,103 మంది ఉండగా.. అందులో 178 మంది చిన్న పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ఈ 178 మంది కలిసి రూ.6,37,800 కోట్ల సంపదను సృష్టించారు. అత్యధికంగా గుజరాత్లో 38 మంది బిలియనీర్లు చిన్న పట్టణాల్లో ఉంటే.. తమిళనాడులో 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పట్టణాల్లో ఆరుగురు బిలియనీర్లు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. చిన్న పట్టణాల్లో అత్యధికంగా గుజరాత్‌లోని సూరత్‌లో 19 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ 19 మంది కలిసి రూ.51 వేల కోట్ల సంపద సృష్టించారు. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 14మంది కలిసి రూ.38,200 కోట్ల సంపద కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఏడుగురు, పంజాబ్‌లోని లుథియానాలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు. నగరాల్లో చూస్తే ఒక్క ముంబైలోనే అత్యధికంగా 283 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీలో 185 మంది, బెంగళూరులో 89 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో 64 మంది, చెన్నైలో 51 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. పట్టణాల్లో సూరత్.. త్రిసూర్ సంపద విలువ పరంగా చూస్తూ సూరత్, త్రిస్సూర్, కోయంబత్తూర్ పట్టణాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సూరత్‌లో 19 మంది బిలియనీర్లు రూ.51 వేల కోట్ల సంపదను కలిగి ఉంటే త్రిస్సూర్‌లో నలుగురు బిలియనీర్లు రూ.40 వేల కోట్ల సంపద కలిగి ఉన్నారు. కోయంబత్తూర్‌లో 14 మంది రూ.38,200 కోట్ల సంపదను, హరిద్వార్‌లో ఒకరే రూ.32,400 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. కేరళలోని పట్టణాల్లో బిలియనీర్ల సగటు సంపద విలువ ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది. ఎర్నాకుళంలో నలుగురు కలిసి రూ.18,800 కోట్లు, కొట్టాయంలో ఒకరే రూ.8,600 కోట్లు, తిరువనంతపురంలో ముగ్గురు కలిసి రూ.10,800 కోట్ల సంపద కలిగి ఉన్నారు. మన రాష్ట్రంలో ఆరుగురు మన రాష్ట్రం విషయానికి వస్తే.. విశాఖలో అత్యధికంగా ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. ఆ ముగ్గురి సంపద విలువ రూ.7,100 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రూ.వెయ్యి కోట్ల సంపదతో ఒకరు, విజయవాడలో రూ.3,600 కోట్ల సంపద కలిగిన ఒకరు, తిరుపతిలో రూ.2,800 కోట్ల సంపదతో ఒకరు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. -
అటు ఓలా స్కూటర్... ఇటు ఓల్ట్రో సైకిల్...
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్లో ఓల్ట్రో దూసుకొస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్ ఓల్ట్రో. ఓల్ట్రో ఓల్ట్రో స్టార్టప్ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ నుంచి ఓల్ట్రాన్ పేరుతో ఇ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్ని డిజైన్ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ ఓల్ట్రో సైకిల్లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సగటున ఒక యూనిట్ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ధర ఎంతంటే ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్‌పై వన్ ఇయర్ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్‌గడ్‌లో ఈ సంస్థకు సైకిల్ తయారీ యూనిట్ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది. వారంటీ సైకిల్‌కి సంబంధించిన కంట్రోలర్, మోటార్లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్‌నే రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్ రిపేర్ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. -
చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం!
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (సత్వర సేవలు అందించేవి/క్యూఎస్ఆర్), మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు చిన్న పట్టణాల్లోకి వేగంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లు కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకుంటుండడం.. డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఈ సంస్థలు వేగంగా విస్తరించాలనుకుంటున్నాయి. డోమినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీ ఇవన్నీ క్యూఎస్ఆర్ కిందకే వస్తాయి. వీటితోపాటు గ్రోసరీ గొలుసు దుకాణాల సంస్థ మోర్ సైతం చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. చిన్న పట్టణాల్లో వీటి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుండడం ఆయా సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది. యువత నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని, ఆకర్షణీయమైన ధరలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద క్యూఎస్ఆర్ అయిన జుబిలంట్ ఫుడ్ వర్క్స్ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ బ్రాండ్ల కింద దేశవ్యాప్తంగా 1,360 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కొత్తగా 135 స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో నూతన స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలతో పోలిస్తే ఇతర పట్టణాల్లో వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు మార్చి ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల సదస్సులో ఈ కంపెనీ తెలిపింది. వృద్ధి బాటలోకి.. ‘‘మార్చి త్రైమాసికంలో తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టాం. భారీగా నూతన స్టోర్లను ప్రారంభించడం కూడా జరిగింది. మార్జిన్లతోపాటు పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్ల సంఖ్య కూడా పెరిగింది’’ అని జుబిలంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో ప్రతీక్పోట తెలిపారు. కరోరా రెండో విడత పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రభావం చూపించిందని.. నూతన వినియోగదారులకు చేరువ కావడమే వృద్ధి చోదకం అవుతుందని ఈ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘టైర్ 2, 3, 4 పట్టణాల్లోకి ప్రముఖ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న పట్టణాల్లో ఆయా కంపెనీలకు ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉంటోంది’’ అని అనరాక్ రిటైల్ సంయుక్త ఎండీ పంకజ్ రెంజెన్ చెప్పారు. స్టోర్లను పెంచుకుంటూనే ఉన్నాయ్.. సాధారణంగా రెస్టారెంట్ల వ్యాపారం డెలివరీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. దీంతో చిన్న పట్టణాల్లో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా డెలివరీ డిమాండ్‌ను చేరుకోవచ్చని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘‘కరోనా కారణంగా సమస్యలు ఏర్పడినప్పటికీ టైర్–2, 3 పట్టణాల్లో, మెట్రోల్లోనూ మా ఫ్రాంచైజీ రెస్టారెంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూనే ఉంది’’అని కేఎఫ్‌సీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కోజికోడ్, నిజామాబాద్, ముజఫర్‌పూర్, భాగల్పూర్ తదితర పట్టణాల్లో కేఎఫ్‌సీకి చెందిన యూమ్ రెస్టారెంట్లను తెరిచినట్టు చెప్పారు. మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు సైతం చిన్న పట్టణాల్లో విస్తరణపై దృష్టి పెట్టాయి. ఆగ్రా, ఫైజాబాద్, ముజఫర్‌పూర్, సితాపూర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో విస్తరణ కోసం మోర్ సంస్థ స్థలాలను లీజుకు తీసుకుంది. కరోనా వల్ల లాక్డౌన్లు విధించినప్పటికీ చిన్న పట్టణాల్లోని యువ వినియోగదారులు తమ వృద్ధి చోదకాలని కంపెనీలు చెబుతున్నాయి. డోమినోస్ తన యాప్‌లో హిందీని చేర్చగా.. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది. -
స్పైస్‌జెట్ కొత్తగా 14 విమానాలు, బుకింగ్స్ ఓపెన్
న్యూఢిల్లీ : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్‌జెట్ కొత్తగా 14 దేశీయ విమానాలను ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ కొత్త విమానాలు తిరగనున్నాయని పేర్కొంది. డైరెక్ట్ కనెక్టివిటీని పెంచడానికి, నాన్-మెట్రోలు, చిన్న నగరాల్లో విమాన సర్వీసులను అందజేయడానికి ఈ కొత్త విమానాలను స్పైస్‌జెట్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త విమానాలతో సౌత్, వెస్ట్ ఇండియాలో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్టు పేర్కొంది. పుణే-పాట్నా, చెన్నై-రాజమండ్రి, హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి సెక్టార్లలో ఈ కొత విమానాలను ప్రవేశపెడుతోంది. అదనంగా ఢిల్లీ-పాట్నా(రెండో ఫ్రీక్వెన్సీ), బెంగళూరు-రాజమండ్రి(రెండో ఫ్రీక్వెన్సీ), ముంబై-బెంగళూరు(ఐదో ఫ్రీక్వెన్సీ) సెక్టార్లలో కూడా ఆపరేషన్లను కొనసాగించనుంది. తమ కొత్త బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్, క్యూ400 రీజనల్ టర్బోప్రూప్స్తో తమ సర్వీసులను వేగవంతంగా విస్తరించనున్నామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భటియా చెప్పారు. ఢిల్లీ-పాట్నా, ముంబై-బెంగళూరు, చెన్నై-రాజమండ్రి సెక్టార్లలో ప్రవేశపెట్టిన విమానాలు రోజువారీ నడవనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి, బెంగళూరు-రాజమండ్రి రూట్లలో నడిచే విమానాలు మంగళవారాలు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తాయి. పాట్నా-పుణే మధ్యలో నడిచే విమానాలు శనివారం మినహాయించి, మిగిలిన అన్ని రోజుల్లో తన కార్యకలాపాలను సాగిస్తాయి. రాజమండ్రి, పాట్నా, తూత్కుడి, కాలికట్ వంటి చిన్న నగరాల ప్రజలు కూడా ఇక నుంచి చాలా తేలికగా ప్రయాణించనున్నారు. స్పైస్‌జెట్ అధికారిక వెబ్సైట్-స్పైస్‌జెట్.కామ్, యాప్‌లలో కూడా ఈ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే స్పైస్‌జెట్ తూత్కుడి నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. -
చిన్న పట్టణాల్లోనూ మహీంద్రా ఫస్ట్ చాయిస్
* సర్టిఫైడ్ యూజ్డ్ కార్లకు డిమాండ్ * కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ (ఎంఎఫ్‌సీడబ్ల్యుఎల్) చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 701 ఔట్‌లెట్లున్నాయి. ఇందులో 300 కేంద్రాలు చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యాయని, వీటి సంఖ్యను 2018 కల్లా రెండింతలు చేస్తామని కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె తెలిపారు. తెలంగాణలో కంపెనీ 12వ ఔట్లెట్ ‘పారమౌంట్ ఆటోబే సర్వీసెస్’ను ప్రారంభించిన సందర్భంగా రిటైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ నాగర్, జోన్ హెడ్ సురేశ్ కుమార్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయాల్లో మెట్రో నగరాల వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైతే, చిన్న పట్టణాల్లో రెండంకెలుందన్నారు. సర్టిఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నందునే 3, 4, 5వ శ్రేణి పట్టణాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు. మూడున్నరేళ్లకో కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల విక్రయాలు 17 శాతం వృద్ధితో 30 లక్షల యూనిట్లు నమోదవుతాయన్న అంచనాలున్నాయి. పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం. ఇందులో తొలి స్థానంలో ఉన్న మహీంద్రాకు 24 శాతం వాటా ఉందని నాగేంద్ర వెల్లడించారు. ‘కస్టమర్లు మూడున్నరేళ్లకో కారును మారుస్తున్నారు. పాత కారు సగటు అమ్మకం ధర రూ.3.65 లక్షలుంది. రూ.3.5-7 లక్షల ధరలో లభించే కార్ల విక్రయాలు మూడింట రెండొంతులు కైవసం చేసుకున్నాయి. సర్టిఫైడ్ కార్లకు బ్యాంకులు 85 శాతం రుణమివ్వడం కలిసి వచ్చే అంశం’ అని తెలిపారు. కంపెనీకి గ్రామీణ ప్రాంతాల నుంచి 35 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయి. -
చిన్న నగరాల్లోనూ ఇంటర్చేంజ్ వంతెనలు
వరంగల్‌తో శ్రీకారం.. 5 కూడళ్లను గుర్తించిన ఆర్ అండ్ బీ * విదేశీ తరహా వంతెనలుండాలన్న సీఎం ఆదేశంతో కదలిక * నిర్మాణ నమూనా ఎంపిక బాధ్యత కన్సల్టెంట్లకు... ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై దృష్టి * వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్చేంజ్ తరహా వంతెనలు ఇక రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కనిపించనున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన తర్వాత పరిష్కారాల కోసం వెదికే బదులు ముందుగానే ప్రత్యామ్నాయాలు చూపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ కదిలింది. గతంలో సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో అక్కడ చిన్న నగరాల్లో కూడా భారీ వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్ పెట్టిన తీరును గమనించారు. రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారినప్పటికీ సకాలంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాహనం ముందుకు కదలడమే గగనంగా మారింది. ఇదే పరిస్థితి ఇతర నగరాలకు ఎదురుకావద్దంటే విదేశీ నగరాల ఆలోచనలను అనుసరించటం తప్పదని ఆయన ఇటీవల దిశానిర్దేశం చేశారు. దీంతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లను నాలుగు లేన్లకు విస్తరించటంతోపాటు అవసరమైన జంక్షన్లలో ఇంటర్చేంజ్ వంతెనల నిర్మాణం చేపట్టాలన్న సీఎం ఆదేశంతో ఆర్ అండ్ బీ శాఖ తొలుత వరంగల్ నగరంపై దృష్టి సారించింది. ఐదు కూడళ్ల ఎంపిక హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇటీవల అక్కడ జనాభా పెరుగుతుండటంతో నగరం వేగంగా విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులేర్పడుతున్నాయి. నగరాభివృద్ధిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్లు ఇరుగ్గా మారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కీలక జంక్షన్లలో భారీ ఫ్లైఓవర్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. సాధారణ వంతెనలుగా కాకుండా.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు కూడళ్లలో నిర్మించిన ఇంటర్చేంజ్ వంతెనలను నిర్మిస్తే బాగుంటుందని ఆర్ అండ్ బీ భావిస్తోంది. అయితే అక్కడి ట్రాఫిక్‌కు ఏ తరహా వంతెన సరిపోతుందనే విషయమై నిపుణులతో సర్వే చేయించేయిందుకు కన్సల్టెంట్ల కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఐదు రోడ్లను రెండు ప్యాకేజీలుగా చేసి పిలిచిన టెండర్లకు నాలుగు కంపెనీలు ముందుకొచ్చాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే సర్వే చేసి ఏ తరహా నిర్మాణాలు అనుసరణీయమో అవి సూచిస్తాయి. నిధుల లేమితో కొంత జాప్యం ఈ కసరత్తు ఈసరికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభత్వం తాత్సారం చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రెండు వరసల రోడ్లు, వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టినందున ప్రస్తుతం నిధుల లభ్యత కష్టంగా మారింది. వరంగల్‌లోని గుర్తించిన ఐదు కూడళ్లలో వంతెనల నిర్మాణానికి రూ.160 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు ఈ నిధుల విడుదల సాధ్యం కానందున వచ్చే బడ్జెట్ వరకు దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కొత్త బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఆ వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అధ్యయనం చేస్తారు. వరంగల్‌లో వంతెనలకు గుర్తించిన కూడళ్లివే.. కాజీపేట-కడిపికొండ జంక్షన్, ఉరుసుగుట్ట కూడలి, ఖమ్మం రోడ్డులోని పెట్రోలు బంకు కూడలి, ఎస్పీ కార్యాలయం జంక్షన్, కాకతీయ విశ్వవిద్యాలయం క్రాస్ రోడ్డు -
గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..!
* సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల్లోనే... * స్మార్ట్ఫోన్ల నుంచే ఆన్లైన్లో ఆర్డర్లు... * కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫీవర్ గ్రామీణ మార్కెట్లో చొచ్చుకుపోతోంది. సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల నుంచే నమోదవుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మార్కెటింగ్ వ్యూహంతో మారుమూల పల్లెల్లోని కస్టమర్లూ ఆకర్షితులవుతున్నారు. ప్రతిరోజు ‘సేల్స్’ పేరుతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఆర్డరు ఇస్తే చాలు ఉత్పాదన రాగానే ఎంచక్కా ఇంటి వద్దే డబ్బులు చెల్లించేలా క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉండడం కస్టమర్లను ఆకట్టుకునే అంశం. వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ సంస్థలు రవాణా, కొరియర్ కంపెనీలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన ఇండియా పోస్ట్ ద్వారా మారుమూలనున్న కస్టమర్లకూ ఉత్పత్తులను చేరవేస్తున్నాయి. ఇంకేముంది జోష్మీదనున ్న వినియోగదార్లు సింపుల్‌గా తమకు కావాల్సిన వస్తువులను స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డరు ఇచ్చేస్తున్నారు. ఈ-రిటైల్‌లో 40 శాతం వాటా మొబైల్స్‌దే కావడం విశేషం. బ్రాండ్స్ పట్ల అవగాహన.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి ఉపకరణాలు ఖరీదైనవి. చాలామంది గ్రామీణులకు ఇవేంటో కూడా తెలియదు. ఇవి కొనలేనివారు ఎంచక్కా స్మార్ట్ఫోన్లలో షాపింగ్ చేస్తున్నారు. రూ.3 వేల నుంచి స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. అటు గ్రామీణ కస్టమర్లకు బ్రాండ్స్‌పట్ల అవగాహన పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా టెలికం కంపెనీల దూకుడుతో డేటా టారిఫ్‌లు దిగొస్తున్నాయి. ఆఫర్ల పేరుతో ఈ-కామర్స్ కంపెనీలు ఊరిస్తున్నాయి. నలుగురిలో ప్రత్యేకత కోసం ఆన్లైన్లో ఆర్డరు ఇచ్చేవారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏదైతేనేం ఇప్పుడు గ్రామీణ వినియోగదారులు ఉన్నచోట నుంచే ఏం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెప్పించుకుంటున్నారు. టాప్ ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. తమ కంపెనీకి భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా కస్టమర్లు ఉన్నారని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. చిన్న ఊర్లు-పెద్ద వాటా.. భారత్‌లో ఈ-కామర్స్ కంపెనీలు పండుగల సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి. గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు రాకుండా టెక్నాలజీని సిద్ధం చేశాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే, మింత్రా, ఆస్క్‌మీబజార్ వంటి కంపెనీలు పోటాపోటీగా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అన్ని కంపెనీల అమ్మకాల్లో చిన్న పట్టణాలదే పైచేయి. కంపెనీనిబట్టి ఈ మార్కెట్ల వాటా 70 శాతం వరకు ఉంది. ఆన్లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఇందులో 4.5 కోట్ల మంది తమ కస్టమర్లని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 2015లో ఈ-కామర్స్ మార్కెట్ దేశంలో రూ.52,000 కోట్లు నమోదు చేస్తుందని అసోచామ్ వెల్లడించింది. కాగా, భారత స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 30 శాతం ఉంది. మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల వాటా 22-25 శాతముంది. అమ్మకాలూ ఎక్కువే.. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డే సేల్‌లో అత్యధిక అమ్మకాలు గ్రామీణ మార్కెట్ల నుంచే నమోదయ్యాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునీత్ సోని తెలిపారు. అది కూడా మొబైల్ ఫోన్ల ద్వారానే జరిగాయని చెప్పారు. బిగ్ బిలియన్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించింది. అక్టోబర్ 13-17 మధ్య జరిగిన ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్‌లో 65 శాతంపైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి వచ్చాయని అమెజాన్ వెల్లడించింది. ఆర్డరు బుక్ నాలుగు రెట్లు పెరిగిందని వివరించింది. కస్టమర్లలో 70 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డర్లిచ్చినట్టు తెలిపింది. లక్షలాది మంది కొత్త కస్టమర్లు చిన్న పట్టణాల నుంచి ఉన్నారని వివరించింది. ఇప్పుడు ఇదే ఊపుతో అక్టోబర్ 26-28 మధ్య గ్రేట్ ఇండియన్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. మారుమూల ప్రాంతాల నుంచి 70 శాతం వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే దిల్ కీ డీల్ దివాలీ సేల్‌లో పరిమాణం పరంగా 10 రెట్లు, కస్టమర్ల పరంగా 5 రెట్లు అధికమైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి రెండింట మూడొంతుల వ్యాపారం సమకూరిందని వెల్లడించింది. మొత్తం 60 లక్షల ఆర్డర్లను పొందింది.