గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..! | Online Fever rural market E commerce | Sakshi
Sakshi News home page

గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..!

Published Tue, Oct 27 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..!

గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..!

* సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల్లోనే...
* స్మార్ట్‌ఫోన్ల నుంచే ఆన్‌లైన్లో ఆర్డర్లు...   
* కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ ఫీవర్ గ్రామీణ మార్కెట్లో చొచ్చుకుపోతోంది. సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల నుంచే నమోదవుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మార్కెటింగ్ వ్యూహంతో మారుమూల పల్లెల్లోని కస్టమర్లూ ఆకర్షితులవుతున్నారు. ప్రతిరోజు ‘సేల్స్’ పేరుతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

ఆర్డరు ఇస్తే చాలు ఉత్పాదన రాగానే ఎంచక్కా ఇంటి వద్దే డబ్బులు చెల్లించేలా క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉండడం కస్టమర్లను ఆకట్టుకునే అంశం. వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ సంస్థలు రవాణా, కొరియర్ కంపెనీలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన ఇండియా పోస్ట్ ద్వారా మారుమూలనున్న కస్టమర్లకూ ఉత్పత్తులను చేరవేస్తున్నాయి. ఇంకేముంది జోష్‌మీదనున ్న వినియోగదార్లు సింపుల్‌గా తమకు కావాల్సిన వస్తువులను స్మార్ట్‌ఫోన్లో ఆర్డరు ఇచ్చేస్తున్నారు. ఈ-రిటైల్‌లో 40 శాతం వాటా మొబైల్స్‌దే కావడం విశేషం.
 
బ్రాండ్స్ పట్ల అవగాహన..
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి ఉపకరణాలు ఖరీదైనవి. చాలామంది గ్రామీణులకు ఇవేంటో కూడా తెలియదు. ఇవి కొనలేనివారు ఎంచక్కా స్మార్ట్‌ఫోన్లలో షాపింగ్ చేస్తున్నారు. రూ.3 వేల నుంచి స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. అటు గ్రామీణ కస్టమర్లకు బ్రాండ్స్‌పట్ల అవగాహన పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా టెలికం కంపెనీల దూకుడుతో డేటా టారిఫ్‌లు దిగొస్తున్నాయి. ఆఫర్ల పేరుతో ఈ-కామర్స్ కంపెనీలు ఊరిస్తున్నాయి. నలుగురిలో ప్రత్యేకత కోసం ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇచ్చేవారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఏదైతేనేం ఇప్పుడు గ్రామీణ వినియోగదారులు ఉన్నచోట నుంచే ఏం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెప్పించుకుంటున్నారు. టాప్ ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. తమ కంపెనీకి భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా కస్టమర్లు ఉన్నారని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.
 
చిన్న ఊర్లు-పెద్ద వాటా..
భారత్‌లో ఈ-కామర్స్ కంపెనీలు పండుగల సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి. గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు రాకుండా టెక్నాలజీని సిద్ధం చేశాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే, మింత్రా, ఆస్క్‌మీబజార్ వంటి కంపెనీలు పోటాపోటీగా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అన్ని కంపెనీల అమ్మకాల్లో చిన్న పట్టణాలదే పైచేయి. కంపెనీనిబట్టి ఈ మార్కెట్ల వాటా 70 శాతం వరకు ఉంది.

ఆన్‌లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఇందులో 4.5 కోట్ల మంది తమ కస్టమర్లని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 2015లో ఈ-కామర్స్ మార్కెట్ దేశంలో రూ.52,000 కోట్లు నమోదు చేస్తుందని అసోచామ్ వెల్లడించింది. కాగా, భారత స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 30 శాతం ఉంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల వాటా 22-25 శాతముంది.
 
అమ్మకాలూ ఎక్కువే..
ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డే సేల్‌లో అత్యధిక అమ్మకాలు గ్రామీణ మార్కెట్ల నుంచే నమోదయ్యాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునీత్ సోని తెలిపారు. అది కూడా మొబైల్ ఫోన్ల ద్వారానే జరిగాయని చెప్పారు. బిగ్ బిలియన్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించింది. అక్టోబర్ 13-17 మధ్య జరిగిన ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్‌లో 65 శాతంపైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి వచ్చాయని అమెజాన్ వెల్లడించింది.

ఆర్డరు బుక్ నాలుగు రెట్లు పెరిగిందని వివరించింది. కస్టమర్లలో 70 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డర్లిచ్చినట్టు తెలిపింది. లక్షలాది మంది కొత్త కస్టమర్లు చిన్న పట్టణాల నుంచి ఉన్నారని వివరించింది. ఇప్పుడు ఇదే ఊపుతో అక్టోబర్ 26-28 మధ్య గ్రేట్ ఇండియన్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. మారుమూల ప్రాంతాల నుంచి 70 శాతం వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే దిల్ కీ డీల్ దివాలీ సేల్‌లో పరిమాణం పరంగా 10 రెట్లు, కస్టమర్ల పరంగా 5 రెట్లు అధికమైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి రెండింట మూడొంతుల వ్యాపారం సమకూరిందని వెల్లడించింది. మొత్తం 60 లక్షల ఆర్డర్లను పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement