సాక్షి, అమరావతి: సంపద సృష్టిలో చిన్న పట్టణాలు పెద్ద నగరాలతో పోటీపడుతూ తగ్గేదేలేదంటున్నాయి. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగిన వారిలో 178 మంది చిన్న పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు ఐఐఎఫ్‌ఎల్ హూరన్ ఇండియా రిచ్ లిస్ట్–2022 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లపైగా సంపద కలిగిన వారు 1,103 మంది ఉండగా.. అందులో 178 మంది చిన్న పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది.
ఈ 178 మంది కలిసి రూ.6,37,800 కోట్ల సంపదను సృష్టించారు. అత్యధికంగా గుజరాత్‌లో 38 మంది బిలియనీర్లు చిన్న పట్టణాల్లో ఉంటే.. తమిళనాడులో 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పట్టణాల్లో ఆరుగురు బిలియనీర్లు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. చిన్న పట్టణాల్లో అత్యధికంగా గుజరాత్‌లోని సూరత్‌లో 19 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ 19 మంది కలిసి రూ.51 వేల కోట్ల సంపద సృష్టించారు.
ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 14మంది కలిసి రూ.38,200 కోట్ల సంపద కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఏడుగురు, పంజాబ్‌లోని లుథియానాలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు. నగరాల్లో చూస్తే ఒక్క ముంబైలోనే అత్యధికంగా 283 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీలో 185 మంది, బెంగళూరులో 89 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో 64 మంది, చెన్నైలో 51 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు.
పట్టణాల్లో సూరత్.. త్రిసూర్
సంపద విలువ పరంగా చూస్తూ సూరత్, త్రిస్సూర్, కోయంబత్తూర్ పట్టణాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సూరత్‌లో 19 మంది బిలియనీర్లు రూ.51 వేల కోట్ల సంపదను కలిగి ఉంటే త్రిస్సూర్‌లో నలుగురు బిలియనీర్లు రూ.40 వేల కోట్ల సంపద కలిగి ఉన్నారు.
కోయంబత్తూర్‌లో 14 మంది రూ.38,200 కోట్ల సంపదను, హరిద్వార్‌లో ఒకరే రూ.32,400 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. కేరళలోని పట్టణాల్లో బిలియనీర్ల సగటు సంపద విలువ ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది. ఎర్నాకుళంలో నలుగురు కలిసి రూ.18,800 కోట్లు, కొట్టాయంలో ఒకరే రూ.8,600 కోట్లు, తిరువనంతపురంలో ముగ్గురు కలిసి రూ.10,800 కోట్ల సంపద కలిగి ఉన్నారు.
మన రాష్ట్రంలో ఆరుగురు
మన రాష్ట్రం విషయానికి వస్తే.. విశాఖలో అత్యధికంగా ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. ఆ ముగ్గురి సంపద విలువ రూ.7,100 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రూ.వెయ్యి కోట్ల సంపదతో ఒకరు, విజయవాడలో రూ.3,600 కోట్ల సంపద కలిగిన ఒకరు, తిరుపతిలో రూ.2,800 కోట్ల సంపదతో ఒకరు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment