వరంగల్‌తో శ్రీకారం.. 5 కూడళ్లను గుర్తించిన ఆర్ అండ్ బీ
* విదేశీ తరహా వంతెనలుండాలన్న సీఎం ఆదేశంతో కదలిక
* నిర్మాణ నమూనా ఎంపిక బాధ్యత కన్సల్టెంట్లకు... ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై దృష్టి
* వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్‌చేంజ్ తరహా వంతెనలు ఇక రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కనిపించనున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన తర్వాత పరిష్కారాల కోసం వెదికే బదులు ముందుగానే ప్రత్యామ్నాయాలు చూపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ కదిలింది. గతంలో సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో అక్కడ చిన్న నగరాల్లో కూడా భారీ వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్ పెట్టిన తీరును గమనించారు.
రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారినప్పటికీ సకాలంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాహనం ముందుకు కదలడమే గగనంగా మారింది. ఇదే పరిస్థితి ఇతర నగరాలకు ఎదురుకావద్దంటే విదేశీ నగరాల ఆలోచనలను అనుసరించటం తప్పదని ఆయన ఇటీవల దిశానిర్దేశం చేశారు. దీంతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లను నాలుగు లేన్లకు విస్తరించటంతోపాటు అవసరమైన జంక్షన్లలో ఇంటర్‌చేంజ్ వంతెనల నిర్మాణం చేపట్టాలన్న సీఎం ఆదేశంతో ఆర్ అండ్ బీ శాఖ తొలుత వరంగల్ నగరంపై దృష్టి సారించింది.
ఐదు కూడళ్ల ఎంపిక
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇటీవల అక్కడ జనాభా పెరుగుతుండటంతో నగరం వేగంగా విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులేర్పడుతున్నాయి. నగరాభివృద్ధిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్లు ఇరుగ్గా మారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కీలక జంక్షన్లలో భారీ ఫ్లైఓవర్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. సాధారణ వంతెనలుగా కాకుండా.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు కూడళ్లలో నిర్మించిన ఇంటర్‌చేంజ్ వంతెనలను నిర్మిస్తే బాగుంటుందని ఆర్ అండ్ బీ భావిస్తోంది. అయితే అక్కడి ట్రాఫిక్‌కు ఏ తరహా వంతెన సరిపోతుందనే విషయమై నిపుణులతో సర్వే చేయించేయిందుకు కన్సల్టెంట్ల కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఐదు రోడ్లను రెండు ప్యాకేజీలుగా చేసి పిలిచిన టెండర్లకు నాలుగు కంపెనీలు ముందుకొచ్చాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే సర్వే చేసి ఏ తరహా నిర్మాణాలు అనుసరణీయమో అవి సూచిస్తాయి.
నిధుల లేమితో కొంత జాప్యం
ఈ కసరత్తు ఈసరికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభత్వం తాత్సారం చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రెండు వరసల రోడ్లు, వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టినందున ప్రస్తుతం నిధుల లభ్యత కష్టంగా మారింది. వరంగల్‌లోని గుర్తించిన ఐదు కూడళ్లలో వంతెనల నిర్మాణానికి రూ.160 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు ఈ నిధుల విడుదల సాధ్యం కానందున వచ్చే బడ్జెట్ వరకు దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కొత్త బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే ఆ వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అధ్యయనం చేస్తారు.
వరంగల్‌లో వంతెనలకు గుర్తించిన కూడళ్లివే..
కాజీపేట-కడిపికొండ జంక్షన్, ఉరుసుగుట్ట కూడలి, ఖమ్మం రోడ్డులోని పెట్రోలు బంకు కూడలి, ఎస్పీ కార్యాలయం జంక్షన్, కాకతీయ విశ్వవిద్యాలయం క్రాస్ రోడ్డు