interchange bridges
-
Hyderabad Regional Ring Road: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన ఇంటర్ ఛేంజర్ల (జంక్షన్లు) నిర్మాణం ఆయా ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తుంటే.. ఇంటర్ ఛేంజర్లపై ప్రజల అభ్యంతరాలు అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. చుట్టూ ఇంటర్ ఛేంజర్ నిర్మాణం..మధ్యలో కొన్ని మిల్లులు, దుకాణాలు, పెట్రోలు పంపులు.. వంటి వాణిజ్యపరమైన ప్రైవేటు నిర్మాణాలు, ఇళ్లు సైతం ఉండటం సమస్యగా మారింది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు తొలగించాల్సి రావటం ఇప్పుడు చాలా కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. భూసేకరణ ప్రక్రియ షురూ.. హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులను కొంతమేర తగ్గించే క్రమంలో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఉత్తర భాగానికి సంబంధించిన 162 కి.మీ. రోడ్డుకు గాను భూసేకరణకు మార్గం సుగమం చేస్తూ 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదలయ్యాయి. అభ్యంతరాల గడువు కూడా పూర్తి కావటంతో ఇక భూమిని సేకరించే పని మొదలైంది. దీనికి సంబంధించి సర్వే కూడా ఇటీవలే పూర్తి చేశారు. రోడ్డు అలైన్మెంట్ విషయంలో రాయిగిరి, సంగారెడ్డిలాంటి ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఆయా ప్రాంతాల్లో 30 కి.మీ.కు సంబంధించిన సర్వేను అధికారులు పెండింగులో పెట్టారు. ఆయా ప్రాంతాల్లో భూ యజమానులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కుదరని పక్షంలో చివరి అస్త్రంగా పోలీసు రక్షణ మధ్య భూమిపై హద్దులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంటర్ ఛేంజర్లపై తీవ్ర అభ్యంతరాలు జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగురోడ్డు దాటే ప్రాంతాల్లో నిర్మించాల్సిన ఇంటర్ ఛేంజర్లపై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి వందల్లో వినతులు ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులకు చేరాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు రెండు ఇంటర్ ఛేంజర్ల విషయంలో మాత్రం ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు వినియోగించుకునేలా అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా వాటి విషయంలో మాత్రం కచ్చితంగా ఆయా నిర్మాణాలను తొలగించాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజర్స్ వద్ద వెసులుబాటు? రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజర్లు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ ట్రంపెట్ (గుండ్రంగా ఉండే రెండు నిర్మాణాలు) నమూనాలో ఇంటర్ ఛేంజర్ నిర్మించాల్సి ఉండగా..ఆ భూమి పరిధిలో రైస్ మిల్లులున్నాయి. ఇక జోగిపేట రోడ్డులో మరో డబుల్ ట్రంపెట్ నిర్మాణం రానుంది. ఇక్కడ పెట్రోలు బంకు వస్తోంది. అయితే ఈ రెండూ డబుల్ ట్రంపెట్ నిర్మాణాలైనందున, స్ట్రక్చర్ లూప్‌లో ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండి, మిగతా మూడు వైపులా ఖాళీగా ఉంటుంది. ఆ లూప్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ (వంతెన లాంటి నిర్మాణం) కావటంతో కింది నుంచి మిల్లులు, పెట్రోల్ బంకు వంటి ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ రెండుచోట్లా ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాడుకునేలా వెసులుబాటు కల్పించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల డబుల్ ట్రంపెట్ నమూనాలు లేనందున, మధ్యలో ఉండే ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటుకు అవకాశం ఉండదు. యజమానుల్లో ఆందోళన డబుల్ ట్రంపెట్లు కాని 9 ప్రాంతాల్లో రెండు చోట్ల పెట్రోలు బంకులు, దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యం కాదని అధికారులంటున్నారు. దాంతో వాటి యజమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఊళ్లకు కొంచెం దూరంగా అలైన్మెంట్ మార్చి ఖాళీ ప్రాంతాల్లో జంక్షన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే రోడ్డు అలైన్మెంట్ ఖరారైనందున జంక్షన్లను మార్చటం సాధ్యం కాదని, ఒకవేళ మార్చాలంటే మరో 10 కి.మీ. దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అప్పుడు రోడ్డు నిర్మాణానికి మరింత భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. ఆ రెండు చోట్ల మాత్రం!) -
చిన్న నగరాల్లోనూ ఇంటర్చేంజ్ వంతెనలు
వరంగల్‌తో శ్రీకారం.. 5 కూడళ్లను గుర్తించిన ఆర్ అండ్ బీ * విదేశీ తరహా వంతెనలుండాలన్న సీఎం ఆదేశంతో కదలిక * నిర్మాణ నమూనా ఎంపిక బాధ్యత కన్సల్టెంట్లకు... ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై దృష్టి * వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్చేంజ్ తరహా వంతెనలు ఇక రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కనిపించనున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన తర్వాత పరిష్కారాల కోసం వెదికే బదులు ముందుగానే ప్రత్యామ్నాయాలు చూపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ కదిలింది. గతంలో సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో అక్కడ చిన్న నగరాల్లో కూడా భారీ వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్ పెట్టిన తీరును గమనించారు. రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారినప్పటికీ సకాలంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాహనం ముందుకు కదలడమే గగనంగా మారింది. ఇదే పరిస్థితి ఇతర నగరాలకు ఎదురుకావద్దంటే విదేశీ నగరాల ఆలోచనలను అనుసరించటం తప్పదని ఆయన ఇటీవల దిశానిర్దేశం చేశారు. దీంతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లను నాలుగు లేన్లకు విస్తరించటంతోపాటు అవసరమైన జంక్షన్లలో ఇంటర్చేంజ్ వంతెనల నిర్మాణం చేపట్టాలన్న సీఎం ఆదేశంతో ఆర్ అండ్ బీ శాఖ తొలుత వరంగల్ నగరంపై దృష్టి సారించింది. ఐదు కూడళ్ల ఎంపిక హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇటీవల అక్కడ జనాభా పెరుగుతుండటంతో నగరం వేగంగా విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులేర్పడుతున్నాయి. నగరాభివృద్ధిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్లు ఇరుగ్గా మారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కీలక జంక్షన్లలో భారీ ఫ్లైఓవర్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. సాధారణ వంతెనలుగా కాకుండా.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు కూడళ్లలో నిర్మించిన ఇంటర్చేంజ్ వంతెనలను నిర్మిస్తే బాగుంటుందని ఆర్ అండ్ బీ భావిస్తోంది. అయితే అక్కడి ట్రాఫిక్‌కు ఏ తరహా వంతెన సరిపోతుందనే విషయమై నిపుణులతో సర్వే చేయించేయిందుకు కన్సల్టెంట్ల కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఐదు రోడ్లను రెండు ప్యాకేజీలుగా చేసి పిలిచిన టెండర్లకు నాలుగు కంపెనీలు ముందుకొచ్చాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే సర్వే చేసి ఏ తరహా నిర్మాణాలు అనుసరణీయమో అవి సూచిస్తాయి. నిధుల లేమితో కొంత జాప్యం ఈ కసరత్తు ఈసరికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభత్వం తాత్సారం చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రెండు వరసల రోడ్లు, వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టినందున ప్రస్తుతం నిధుల లభ్యత కష్టంగా మారింది. వరంగల్‌లోని గుర్తించిన ఐదు కూడళ్లలో వంతెనల నిర్మాణానికి రూ.160 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు ఈ నిధుల విడుదల సాధ్యం కానందున వచ్చే బడ్జెట్ వరకు దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కొత్త బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఆ వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అధ్యయనం చేస్తారు. వరంగల్‌లో వంతెనలకు గుర్తించిన కూడళ్లివే.. కాజీపేట-కడిపికొండ జంక్షన్, ఉరుసుగుట్ట కూడలి, ఖమ్మం రోడ్డులోని పెట్రోలు బంకు కూడలి, ఎస్పీ కార్యాలయం జంక్షన్, కాకతీయ విశ్వవిద్యాలయం క్రాస్ రోడ్డు