న్యూఢిల్లీ: దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రధాన కంపెనీగా అవతరించిన అమెజాన్, ఆఫ్‌లైన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకుగాను దేశీయ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, రిటైల్ కంపెనీల్లో ఒకదానిలో వాటా కొనుగోలు చేసేందుకు ప్రాథమిక సంప్రదింపులు మొదలు పెట్టింది. పెద్ద రిటైల్ సంస్థలు సైతం అమెజాన్‌తో చర్చించాయని, ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల దేశీయ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ జరిగిన వెంటనే తన కంపెనీలో వాటాను బలమైన అంతర్జాతీయ రిటైలర్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫ్యూచర్ గ్రూపు వ్యవస్థాపకుడు కిషోర్‌బియానీ ప్రకటించారు. కిషోర్‌బియానీ ఇప్పటికే అమెజాన్‌తో, వాల్‌మార్ట్‌తోనూ సంప్రదింపులు జరపడం గమనార్హం. ఫ్యూచర్‌గ్రూపు బిగ్‌బజార్ సహా మరెన్నో బ్రాండ్లపై దుకాణాలు నిర్వహిస్తోంది. ఇక అమెజాన్‌తో ప్రాంతీయ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ సంస్థలు కూడా చర్చలు జరిపాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్‌తో ఈ వ్యవహారానికి సంబంధం లేదని, ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి ప్రవేశించాలన్న ప్రయత్నాలు అమెజాన్ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నట్టు చెప్పాయి. ‘‘అమెజాన్ అమెరికాలో మాదిరిగానే భారత రిటైల్ మార్కెట్లో విస్తరించాలనుకుంటోంది. కొన్ని కంపెనీలతో సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయి. అన్నీ కుదిరితే భారీ రిటైలర్‌తో ఈ ఏడాది చివరికి డీల్ కుదరొచ్చు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అమెజాన్ నుంచి ఎటువంటి సమాచారం లేదు.
తొలుత చిన్నగానే...
‘‘తొలుత 10 నుంచి 15 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనిపైనే చర్చిస్తోంది. తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. అవసరం అనుకుంటే మెజారిటీ వాటా కొనుగోలు చేస్తుంది. కానీ, ప్రస్తుతమైతే ఆఫ్‌లైన్ రిటైల్ ఎలా ఉంటుందో చూడాలన్నదే ప్రణాళిక. భారత్‌లో రిటైల్ చైన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలనుకుంటోంది. దీర్ఘకాలంలో శీతల గోదాములపై ఇన్వెస్ట్ చేస్తుంది. రైతుల నుం చి నేరుగా ఉత్పత్తులను సమీకరిస్తుంది. స్థానికంగా ఉత్పత్తి అయిన వాటిని విదేశాలకు షిప్ చేసే ప్రణాళికలతోనూ ఉంది. స్థానిక కంపెనీలు తయారు చేసిన వాటిని ఇప్పటికే విదేశాల్లో విక్రయిస్తోంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో షాపర్స్‌స్టాప్‌లో అమెజాన్ ఎన్‌వీ హోల్డింగ్స్ 1.79 బిలియన్ డాలర్లతో 5% వాటా కొనడం విదితమే. తన ఉత్పత్తులను అమెజాన్ డాట్ ఇన్‌లో విక్రయించేందుకు షాపర్స్‌స్టాప్ ఒప్పందం కూడా చేసుకుంది. అమెజాన్.ఇన్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో గ్రోసరీ ఉత్పత్తులను విక్రయిస్తుండగా, ఆహార రిటైల్‌లో ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతినీ తీసుకుంది.
జొమాటోపై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను!
వాల్‌మార్ట్‌లో తనకున్న వాటాలను భారీ విలువకు విక్రయించేందుకు డీల్ చేసుకున్న జపాన్ దేశ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై కన్నేసింది. జొమాటోలో పెట్టుబడులు పెట్టేందుకు గాను చర్చలు ప్రారంభించింది. ఈ వారం మొదట్లో ఇది జరిగినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడి చేశాయి. ఆరు నెలల క్రితం బెంగళూరుకు చెందిన మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో 200–250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సాఫ్ట్ బ్యాంకులు చర్చలు జరిపిన విషయం గమనార్హం. గతేడాది నవంబర్ నుంచి పలు మార్లు సంప్రదింపులు సాగించింది. అయితే, సాఫ్ట్‌బ్యాంకు నుంచి నిధులు సమీకరించే విషయంలో స్విగ్గీ ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు దేశీయ ఫుడ్ డెలివరీ మార్కెట్లో కీలక పాత్రను పోషించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పాయి. కనీసం 200–400 మిలియన్ డాలర్ల మధ్య ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది సాఫ్ట్‌బ్యాంకు యోచనని, ఈ ఏడాది చివరి నాటికి ఇది కార్యరూపం దాల్చొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment