న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్‌ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది.
దేశీ ఎఫెక్ట్
విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది.
తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్‌కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్‌లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్‌కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది.
దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్‌యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment