ఎఫ్‌డీఐ నిబంధనలు సరళం
కాంపోజిట్ పరిమితి అమలు ప్రతిపాదన
రిటైల్ కంపెనీలు, కమోడిటీ, పవర్ ఎక్స్చేంజీలకు ప్రయోజనకరం కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్రం నిబంధనలను మరింత సరళతరం చేసింది. పలు రంగాల్లో ఎన్నారై, ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ తదితర మార్గాల్లో వచ్చే విదేశీ పెట్టుబడులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి కాంపోజిట్ పరిమితుల విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. రిటైల్ కంపెనీలు, మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు, కమోడిటీ.. పవర్ ఎక్స్చేంజీలు మొదలైన వాటికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళతరం చేసేందుకే కాంపోజిట్ పరిమితుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై అన్ని ఎఫ్‌ఐఐలు, ప్రవాస భారతీయుల పెట్టుబడులు, ఇతరత్రా విదేశీ పెట్టుబడులన్నింటినీ ఒక్క విభాగం కింద చేర్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఎన్నారైలు మొదలైన ఇన్వెస్టర్లను వేర్వేరు కేటగిరీలుగా పరిగణిస్తూ, వేర్వేరు పరిమితులను అమలుచేస్తున్నారు.
విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు(ఎఫ్‌సీసీబీ), డిపాజిటరీ రిసీట్స్(డీఆర్) రూపంలో వచ్చిన పెట్టుబడులను ఈక్విటీ కిందికి మార్చుకోనంత వరకూ విదేశీ పెట్టుబడుల కింద పరిగణించడం జరగదని కేంద్రం తెలిపింది. వివిధ విభాగాల పరిమితులకు సంబంధించి గందరగోళాన్ని తొలగించి, విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేసేలా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. 2014-15లో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగి 40.92 బిలియన్ డాలర్లకు, ఎఫ్‌డీఐలు 27 శాతం ఎగిసి 30.93 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఆర్‌ఆర్‌బీలకు అదనంగా రూ. 700 కోట్లు..
బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీ) ఊరటనిచ్చేలా మరో రూ. 700 కోట్ల మేర నిధులను కేబినెట్ మంజూరు చేసింది. ఆర్‌ఆర్‌బీలు అదనంగా మూలధనాన్ని సమకూర్చుకునేందుకు రీక్యాపిటలైజేషన్ స్కీమ్ గడువును 2016-17 దాకా పొడిగించింది. రుణాల రిస్కులకు తగ్గట్లుగా మూలధన నిష్పత్తిని పాటించాల్సిన నిబంధనలను (సీఆర్‌ఏఆర్) అందుకోగలిగేలా 21 రాష్ట్రాల్లోని 40 ఆర్‌ఆర్‌బీలకు రూ. 2,200 కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ అవసరమంటూ కేసీ చక్రవర్తి కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 2010-11లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2014 మార్చి ఆఖరు దాకా 39 ఆర్‌ఆర్‌బీలకు రూ.1,087 కోట్లు విడుదలయ్యాయి.
ఆర్బిట్రేషన్ చట్ట సవరణపై నిర్ణయం వాయిదా
వ్యాపారపరమైన వివాదాలను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ధారించేందుకు, ఆర్బిట్రేషన్ ఫీజుపై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఆర్బిట్రే షన్ చట్టాన్ని సవరించడంపై నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.