రియల్టీ, నిర్మాణ రంగాలకు జోష్ | Sensex, Nifty hit over 1-year high; log 6th straight monthly gain | Sakshi
Sakshi News home page

రియల్టీ, నిర్మాణ రంగాలకు జోష్

Published Thu, Sep 1 2016 12:18 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

రియల్టీ, నిర్మాణ రంగాలకు జోష్ - Sakshi

రియల్టీ, నిర్మాణ రంగాలకు జోష్

తాజా నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం
* సమస్యల పరిష్కారం, ద్రవ్య లభ్యత మెరుగు ధ్యేయం

న్యూఢిల్లీ: రియల్టీ, నిర్మాణ రంగాలకు మరింత ఊపును ఇవ్వడానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశలో తాజా నిబంధనలకు ఆమోదముద్ర వేసింది. నిర్మాణ రంగం విషయంలో వివాదాల సత్వర పరిష్కారం, నిలిచి పోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభం, ఆర్థిక సహకారం లక్ష్యాలుగా తాజా నియమ నిబంధనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రదానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన  క్యాబినెట్ సమావేశం తరువాత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 8 శాతం వాటా కలిగి, దాదాపు నాలుగు కోట్ల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న నిర్మాణ రంగం పునరుత్తేజానికి తాజా చొరవ దోహదపడుతుందని అన్నారు.

నిర్మాణ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఒత్తిడిలో ఉన్న నిర్మాణ రంగం విషయంలో అనుసరించడానికి ఒక విధానాన్ని ఆర్థికమంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ కలిసి రూపొందిస్తాయనీ జైట్లీ తెలిపారు.  రియల్టీ, నిర్మాణ రంగాలకు ఎటువంటి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కొరతా రానీయరాదన్నది కేంద్రం విధానమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
ప్రాజెక్టుల పూర్తికి సహకారం...
క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ప్రస్తుత ప్రాజెక్టుల పూర్తికిగాను మౌలిక కంపెనీలకు 75 శాతం నిధుల కేటాయింపు కీలకమైనది. పౌర సంస్థ- ప్రాజెక్టు కంపెనీ మధ్య సమస్యకు సంబంధించి ఆర్టిట్రేషన్ పక్రియ  పెండింగులో  ఉంటే.. సంబంధిత కంపెనీకి ఎటువంటి ఆర్థిక సమస్యా లేకుండా బ్యాంక్ గ్యారెంటీపై కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ నుంచి 75 శాతం నిధుల మంజూరు తాజా విధాన లక్ష్యం.  రుణాలను సకాలంలో చెల్లించడం, ప్రాజెక్టుకు అవసరమైన నిధుల వినియోగం వంటి అంశాలను ఈ 75 శాతం నిధులను వినియోగించుకునే వీలుంటుంది.

ఇక  కంపెనీలు- పౌర విభాగాల మధ్య వివాదాల పరిష్కార ప్రక్రియను కొత్త ఆర్బిట్రేషన్ చట్టం కిందకు తీసుకురావడం మరొకటి. దీనివల్ల వివాదాల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. మూడవది  వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల అప్పగింతకు సంబంధించి నియమ నిబంధనల ముసాయిదా సర్క్యులేషన్. అందుకు అనుగుణంగా చర్యలు. నిర్మాణ రంగానికి సంబంధించి బ్యాంకింగ్ రుణం ప్రస్తుతం దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది.  ఇందులో దాదాపు 45 శాతం (రూ.1.35 లక్షల కోట్లు) ఒత్తిడిలో ఉన్న రుణాలు కావడం గమనార్హం.  ఇక దాదాపు రూ.70,000 కోట్ల విలువైన  ప్రాజెక్టులు ఆర్బిట్రేషన్ వివాదంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం సగటు వివాద పరిష్కార సమయం ఏడేళ్లకన్నా ఎక్కువగా ఉంది.
 
ఎఫ్‌డీఐ... ఇటీవలి నిర్ణయాలకు ఆమోదం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి జూన్ 20వ తేదీన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర (ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో) వేసింది. రక్షణలో 100 శాతం ఎఫ్‌డీఐలుసహా, ఇతర రంగాల్లో ఎఫ్‌డీఐ విధానాన్నీ కేంద్రం ఇటీవల సరళీకరించిన సంగతి తెలిసిందే. ఆటోమేటిక్ రూట్‌లో ఒక కంపెనీ ఈక్విటీలో 49 శాతం ఎఫ్‌డీఐ నిర్ణయం ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకు సంబంధించీ ఆటోమేటిక్ రూట్‌లో 100% పెట్టుబడులకు ఇటీవల నిర్ణయం తీసుకుంది.
 
మరికొన్ని అంశాలు...
* ఆసియా ప్రాంతానికి రూ.500 కోట్ల ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం.  
* ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై బెర్త్‌ల అభివృద్ధికి గోవాలోని మొర్ముగావ్ నౌకాశ్రయంలో రూ.1,145 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర.
* సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రద్దుకు ఓకే. సంస్థలో 2015లోనే స్వచ్ఛంధ పదవీ విరమణ పథకాన్ని అమలు చేశారు. ప్రస్తుతం కేవలం ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. పునరుద్ధరణకు వీలుకాని పరిస్థితుల ప్రాతిపదికన క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.
 
విదేశీ ఇన్వెస్టర్లకు ‘రెసిడెన్సీ’ హోదా
దేశంలో విదేశీ పెట్టుబడులకు మరింత ఊపును ఇవ్వడానికి ‘సింగపూర్  అనుసరిస్తున్న విధానాన్నే’ దేశం అనుసరించనుంది.  విదేశీ పెట్టుబడిదారులకు  20 సంవత్సరాల రెసిడెన్సీ హోదా అవకాశాన్ని కల్పిస్తూ... వీసా నిబంధనల్లో మార్పునకు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీనిప్రకారం,  18 నెలల్లో దేశానికి రూ.10 కోట్లు తెచ్చే విదేశీయులకు 10 ఏళ్లు రెసిడెన్సీ హోదా ఇస్తారు. అంటే దేశంలో నివాస హోదా లభిస్తుందన్నమాట. మూడేళ్లలో రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టినవారికీ ఇది వర్తిస్తుంది.  దీన్ని మరో పదేళ్లు పొడిగించే వీలుంది. అయితే ఈ స్కీమ్ పాకిస్తాన్, చైనా పౌరులకు వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement