పొగాకులో ఎఫ్డీఐపై నిషేధం!
త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిషేధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలను పెద్ద పరిమాణంలో పేర్కొనాలంటూ లోగడ కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా ఈ రంగంలో ఎఫ్‌డీఐ రాకను నిషేధించే అంశాన్ని కేంద్రం పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ కేబినెట్ పరిశీలన కోసం పంపినట్టు అధికార వర్గాలు తెలిపారుు. ఈ నోట్‌కు అన్ని మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు, కేంద్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల అభిప్రాయాలను సైతం జతచేసినట్టు వెల్లడించారుు.
ప్రస్తుతం పొగాకు రంగంలో ఫ్రాంచైజీ లెసైన్సింగ్, ట్రేడ్‌మార్క్, బ్రాండ్ నేమ్, కాంట్రాక్టుల నిర్వహణ తదితర సాంకేతిక సహకార అంశాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అదే సమయంలో సిగార్లు, సిగరెట్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాల తయారీలో ఎఫ్‌డీఐపై నిషేధం అమలవుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ తన ప్రతిపాదనలో ఈ విభాగాల్లోనూ ఎఫ్‌డీఐల నిషేధానికి ప్రతిపాదించింది.
దేశీయ తయారీదారులకు ప్రతికూలమే
ఒకవేళ పొగాకు రంగంలో ఎఫ్‌డీఐల సంపూర్ణ నిషేధానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది దేశీయ సిగరెట్ తయారీదారులకు ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. పరోక్షంగా ఈ రంగంలోకి వచ్చే నిధుల ప్రవాహానికి కూడా బ్రేక్ పడుతుందంటున్నారు. అంతేకాదు, పొగాకు నియంత్రణకు కట్టుబడి ఉన్న దేశంగా భారత్‌ను నిలబెడుతుంది. కాగా, ఈ ప్రతిపాదనపై సిగరెట్ల తయారీ సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.