న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడంపై పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) స్పందించింది. ఇవి ‘తిరోగామి‘ నిబంధనలంటూ శుక్రవారం వ్యాఖ్యానించింది. వీటివల్ల కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలగడంతో పాటు అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. ఫలితంగా భారత్‌లో ఆన్‌లైన్ రిటైల్ వృద్ధిపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అభిప్రాయపడింది. ప్రభుత్వాలు... వ్యాపారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం తగదని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేష్ అఘి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. పరిశ్రమ వర్గాలెవరితోనూ చర్చించకుండా నిబంధనలను మధ్యలో మార్చేయడం సరికాదన్నారు.
‘ఈ–కామర్స్ విధానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన సవరణలు తిరోగామి చర్యలుగా ఉన్నాయి. రిటైల్ రంగానికి కీలకమైన కొనుగోలుదారు ప్రయోజనాలకు ఇవి ప్రతికూలం. ఈ సవరణ కారణంగా భారతీయ తయారీదారులు, విక్రేతలు.. అంతర్జాతీయ ఆన్‌లైన్ రంగంలో సమర్థంగా పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుంది‘ అని ముకేష్ తెలిపారు. పాలసీ విధానంలో పారదర్శకత లోపించడాన్ని ఇది సూచిస్తుందని, అనిశ్చితికి దారితీస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, తాము నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు సాగిస్తున్నామని, తాజా సవరణలపై మరింత స్పష్టత కోసం ప్రభుత్వాన్ని సంప్రతిస్తామని అమెజాన్ ఇండియా పేర్కొంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఉన్న ఈ–కామర్స్ సంస్థలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. ఇటీవలే మోర్ సూపర్ మార్కెట్లో వాటా కొనుగోలు చేసిన అమెజాన్, దాదాపు 16 బిలియన్ డాలర్లతో ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ లాంటి అమెరికన్ దిగ్గజాలకు ఈ నిబంధనలు సమస్యాత్మకంగా మారనున్నాయి. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment