
వాషింగ్టన్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దించడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనాను ఒత్తిడికి గురిచేయొద్దని గతంలో భారత్ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఓ కథనం ప్రచురించింది.
బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని, ఇది భారత్ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు భారత్ తెలిపినట్లు కథనంలో రాసుకొచ్చారు. హసీనాపై కఠిన వైఖరి వద్దని అమెరికాను భారత విదేశాంగవర్గాలు కోరినట్లు కథనం సారాంశం. 2024 ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో పలువురిని జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు విమర్శించారు.
అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు పోలీసులపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఈ విభాగం నేరుగా హసీనా కింద పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దేశంలో హింస చెలరేగడంతో షేక్‌హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా దేశం విడిచిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment