క్రెడిట్ కార్డ్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో వాడకం విస్తృతమవుతోంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో, ఆన్‌లైన్‌లోనూ కార్డులతో చెల్లింపులు చేసే వారు పెరుగుతున్నారు. దీంతో ఇదొక ప్రధాన చెల్లింపు సాధనంగా మారింది. క్రమశిక్షణగా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా 45–50 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ ప్రయోజనాన్ని అందుకోవచ్చు. క్రెడిట్‌కార్డ్‌ల విషయంలో ఉన్న ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఎస్‌బీఐ కార్డ్ కొన్ని సూచనలు చేసింది.
ఆలస్య చెల్లింపులు వద్దు
క్రెడిట్ కార్డు బిల్లులో పేర్కొన్న గడువులోపు చెల్లింపులను చేయడం చాలా ముఖ్యం. సకాలంలో చెల్లించడమనేది వ్యక్తి యొక్క క్రెడిట్ ప్రొఫైల్‌ను ప్రభావితం చస్తుంది. క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో వ్యక్తి రుణ అర్హతపై సానుకూల ప్రభావం చూపుతుంది. సకాలంలో చెల్లించకపోతే ఆలస్యపు రుసుములు భరించాల్సి వస్తుంది.
స్పెషల్ డిస్కౌంట్‌లు
క్రెడిట్ కార్డులు కొన్ని కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్‌లను అందిస్తాయి. ఈ డిస్కౌంట్‌లను తరచుగా వివిధ జాతీయ మరియు స్థానిక బ్రాండ్‌ల భాగస్వామ్యంతో అందిస్తాయి. భాగస్వామ్య స్వరూపం మరియు పార్ట్‌నర్‌షిప్ బ్రాండ్‌ని బట్టి, ఆన్‌లైన్ కొనుగోళ్లు లేదా స్థానిక స్టోర్ కొనుగోళ్లు లేదా ఈ రెండింటిలో చేసే వాటిపై డిస్కౌంట్‌లు లభిస్తాయి. ఎస్‌బీఐ కార్డ్ వంటి కంపెనీలు అమెజాన్, ఫిప్‌కార్ట్ వంటి వివిధ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలతో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కనుక కార్డ్‌ల వినియోగం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు.
రివార్డ్ ప్రోగ్రామ్‌లు
క్రెడిట్ కార్డులు అందించే అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనాల్లో రివార్డ్స్ ప్రోగ్రామ్ ఒకటి. ఉచిత ట్రావెల్ టికెట్ల నుంచి సినిమా వోచర్‌లు, షాపింగ్ వోచర్ల వరకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను పొందొచ్చు.
ట్రావెల్ ప్రయోజనాలు
క్రెడిట్ కార్డు రకాన్ని బట్టి ప్రయాణ టికెట్ కొనుగోళ్లపై రివార్డులు, హోటల్లో విడిది, డైనింగ్‌లపై డిస్కౌంట్‌లు లభిస్తాయి. ప్రయాణికులకు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్‌ని ఉపయోగించి కార్డు మెంబర్‌షిప్ ఉన్న సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు రెండు కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్‌ల సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు. యాత్రా డాట్ కామ్, మేక్ మై ట్రిప్ వంటి ట్రావెల్ వెబ్‌సైట్‌ల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులు డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
మోసాల పట్ల అవగాహన
క్రెడిట్ కార్డ్‌పై కనిపించే నంబర్, వెనుక భాగంలో ఉండే మూడు అక్షరాల సీవీవీ, గడువు తేదీ వంటి సున్నితమైన కార్డు వివరాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఎవరితోనూ ఎలాంటి పరిస్థితిలోనూ పంచుకోరాదు. బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు కంపెనీలేవీ కస్టమర్ల నుంచి ఈ వివరాలను అడగవు. విశ్వసనీయమైన మరియు ప్రామాణికమైన వెబ్‌సైట్‌లలో మాత్రమే షాపింగ్ చేయండి. స్టోర్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డ్‌ని మీకు కనపడేలా చూసుకోండి. మీ ముందే మెషీన్‌లో కార్డుని స్వైప్/డిప్ చేయాలని అడగండి. మెషీన్‌లో మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించండి. ఇది మీ కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment