Interest Rates Decrease
-
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించండి.. ఆర్బీఐకి సీఐఐ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది. దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది. -
ఎల్ఐసీ హౌసింగ్ రుణ రేటు 6.90%
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలపై వడ్డీ రేటును కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి 6.90 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. 700 అంతకుమించి సిబిల్ స్కోరు ఉన్న వారికి రూ.50 లక్షల వరకు గృహ రుణంపై ఈ రేటును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ రూ.50 లక్షలకు మించి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు 7%గా వసూలు చేయనుంది. కంపెనీ రుణాల్లో 25% మారటోరియంలో ఉన్నట్టు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణ రంగ రుణాల్లో రూ.8,500–9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నట్టు చెప్పారు. పెన్షనర్లకు గృహరుణ పథకం పెన్షనర్లకు ప్రత్యేక పథకాన్ని ‘గృహ వరిష్ట’ పేరుతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆవిష్కరించింది. దీని కింద గృహ రుణాన్ని 80 ఏళ్ల వయసు వరకు కాల వ్యవధిపై లేదా 30 ఏళ్లు ఏది తక్కువ అయితే ఆ కాలానికి రుణాన్ని అందిస్తుంది. రిటైర్మెంట్ తీసుకున్న లేదా ప్రస్తుతం సర్వీసులో ఉండి భవిష్యత్తులో కచ్చితమైన పెన్షన్ సదుపాయం కలిగిన కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ ల ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద అధిక రుణం కావాలంటే ఆర్జనా శక్తి కలిగిన తమ పిల్లలతో కలసి పెన్షన్ దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. -
చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది. గడువు దాటి దాఖలు చేసే రిటర్నులపై రుసుము, వడ్డీ భారాన్ని తగ్గించింది. రూ.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం కలిగిన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే, వడ్డీ రేటును సగానికి (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గిస్తూ శుక్రవారం జరిగిన భేటీలో నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాఖలు చేసే రిటర్నులకు ఈ తగ్గింపు అమలవుతుంది. ఇక ఈ ఏడాది మే, జూన్, జూలై నెలలకు సంబంధించిన రిటర్నులను ఎటువంటి వడ్డీ భారం లేకుండానే సెప్టెంబర్ వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం వెల్లడించారు. లాక్డౌన్ అమలైన ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం ఏ మేరకు ఉండొచ్చన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 45 శాతం వరకు ఉండొచ్చన్నారు. టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి జీఎస్టీ హేతుబద్ధీకరణపై నిర్ణయాన్ని కౌన్సిల్ వాయిదా వేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో.. పన్ను చెల్లించాల్సిఉండి, జీఎస్టీఆర్–3బీ రిటర్నులను 2017 జూలై 1 నుంచి 2020 జనవరి కాలానికి ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే అప్పుడు గరిష్ట ఆలస్యపు రుసుము రూ.500గానే ఉంటుంది. ప్రతి నెలా రిటర్నుపై రూ.500 చొప్పున అమలవుతుంది. ఇప్పుడున్న రూ.10,000 రుసుముతో పోలిస్తే భారీ గా తగ్గింది. అదేవిధంగా ఇదే కాలానికి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని సంస్థలు రిటర్నులు ఆలస్యం గా దాఖలు చేసినా ఆలస్యపు రుసుము ఉండదు. కాంపెన్సేషన్ సెస్సుపై జూలైలో నిర్ణయం రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించే ‘కాంపెన్సేషన్ సెస్సు’పై ప్రత్యేకంగా చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో మరోసారి భేటీ కానుంది. కేంద్రం గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలానికి రాష్ట్రాలకు పరిహారంగా రూ.36,400 కోట్లను విడుదల చేసినప్పటికీ.. వాస్తవ అంచనాలతో పోలిస్తే ఇంకా లోటు నెలకొంది. మార్చి నెల కు సంబంధించి రూ.12,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని అయినా తమకు చెల్లించాలని రాష్ట్రాలు కోరాయి. పరోటాలపై జీఎస్టీ 18% న్యూఢిల్లీ: తినడానికి సిద్ధంగా ఉండే (రెడీ టు ఈట్) పరోటాలను మానవ వినియోగానికి వీలుగా మరింత ప్రాసెస్ (సిద్ధం చేసుకోవడం) చేసుకోవాల్సి ఉంటుందని.. కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. హోల్ వీట్ పరోటా, మలబార్ పరోటాలను జీఎస్టీలోని చాప్టర్ 1905కింద గుర్తించి 5 శాతం జీఎస్టీ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థ ఏఏఆర్ను ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. చాప్టర్ 1905 లేదా 2106లో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఉత్పత్తులకే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందంటూ, అవి ఖాఖ్రా, సాధారణ చపాతీ లేదా రోటి అయి ఉండాలని ఏఏఆర్ స్పష్టం చేసింది. -
వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ, కెనరా బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం అన్ని కాలపరిమితులపై రుణరేట్లను స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. కెనరాబ్యాంక్ కూడా ఇదే బాటన పయనించింది. కాగా ద్రవ్య లభ్యత బాగున్న నేపథ్యంలో డిపాజిట్ రేట్లనూ ఎస్బీఐ తగ్గించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాల ప్రకటన మరుసటి రోజు బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తించే ఏడాది కాల వ్యవధి రుణ రేటు ప్రస్తుత 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది. ► రూ.2 కోట్లకన్నా తక్కువ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు అలాగే రూ.2 కోట్ల పైబడిన బల్క్ టర్మ్ డిపాజిట్ రేటును బ్యాంక్ సవరించింది. రిటైల్ విభాగంలో డిపాజిట్ రేటు 10–50 బేసిస్ పాయింట్లు తగ్గగా, బల్క్ సెగ్మెంట్లో 25–50 బేసిస్ పాయింట్లు తగ్గింది. ► తగ్గించిన రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. కెనరాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్‌కు ఈనెలలోనే 50,000 కోట్లు! బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని నిధులు లభ్యమయ్యే కీలక చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి 17, 24 తేదీల్లో రూ.50,000 కోట్ల రీపర్చేజింగ్ ఆపరేషన్స్ (రెపో) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సంబంధిత 2 రోజుల్లో రూ.25,000 చొప్పున రెపో ఆపరేషన్స్‌ను ఆర్బీఐ నిర్వహించనుంది. అయితే 17న మూడేళ్ల కాలవ్యవధి రెపో ఆపరేషన్‌కాగా, 24వ తేదీ రెపో ఆపరేషన్ ఏడాది కాల వ్యవధికి ఉద్ధేశించినది. దీనివల్ల బ్యాంకింగ్‌కు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి. వడ్డీరే ట్లు మరింత తగ్గడానికి ఈ చర్యలు వీలుకల్పిస్తాయి. -
ఇంటి రుణాలపై వడ్డీరేటు 7%కి తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. -
మరో పావు శాతం తగ్గిన ఫెడ్ రేటు
వాషింగ్టన్: అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్లో ఉన్న ‘ఫెడ్ ఫండ్స్ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్ రిజర్వ్‌కు ఇది మూడో సారి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్ తగ్గించింది. అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడంతో రేట్లను ఫెడ్ తగ్గిస్తూ వస్తోంది. ఫెడరల్ ఫండ్స్ రేట్ అంటే... బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్ రుణాలపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించే రేటునే ఫెడరల్ ఫండ్స్ రేట్గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్, వ్యాపార ఇలా వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. -
వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్ గూడ్స్... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది. ► విద్యుత్: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది. ► మైనింగ్: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ ప్రొడక్ట్స్: కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, నాన్–డ్యూరబుల్స్ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► నవంబర్ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం. 11 నెలల కాలంలో.. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు 4.3 శాతంగా ఉంది. స్వల్పంగా పెరిగిన రిటైల్ ధరల స్పీడ్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది. 0.3 శాతం పెరిగిన ఫుడ్ బాస్కెట్ ధర ఫుడ్ బాస్కెట్ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది. పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. -
డిస్కౌంట్ల పండగ వచ్చింది..
గతేడాది కంటే 30% వృద్ధి అంచనా * పండగ అమ్మకాలపై ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆశలు * దోహదం చేయనున్న వడ్డీ రేట్ల తగ్గుదల * డిస్కౌంట్లు, కొత్త ఉత్పత్తులతో ఆన్లైన్ సంస్థల ‘సై’ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండగ సీజన్ తరుముకుంటూ వచ్చేస్తోంది. దుకాణాలు, ఆఫ్‌లైన్ స్టోర్లను అధిగమించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ కంపెనీలు ఈ సారి ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తుల్ని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. పెద్ద ఎత్తున వివిధ సంస్థల నుంచి ఫండింగ్ అందుకుని ఊపుమీదున్న ఈ కంపెనీలు... భారీగా డిస్కౌంట్లనూ ఆఫర్ చేయబోతున్నాయి. అయితే ఆఫ్‌లైన్ కంపెనీలు కూడా చిరకాలంగా తమనే ఆశ్ర యిస్తున్న కస్టమర్లకు బహుమతులు, డిస్కౌంట్లను ఇచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేశాయి. 2014తో పోలిస్తే ఈ పండగల సీజన్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి వుంటుందని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చెబుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలు సైతం.. దసరా, దీపావళి, క్రిస్మస్కు సాధారణంగా కొత్త గృహోపకరణాలను కొనేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపిస్తారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే వంటి ఇ-కామర్స్ కంపెనీలు ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులతో రంగంలోకి దిగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని వందల ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. అలాగే తక్కువ సమయంలో ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నాయి. మధ్యలో తమ ఫెసిలిటేషన్ సెంటర్‌కు రాకుండానే రిటైలర్ నుంచి నేరుగా కస్టమర్లకు వస్తువులను చేరవేసేలా కూడా సిద్ధమవుతున్నాయి. ఇంటెక్స్, లావా, ఫిలిప్స్ బ్రాండ్ల ఎక్స్‌క్లూజివ్ మొబైల్స్‌ను విక్రయించనున్నట్టు ఈబే ఇప్పటికే ప్రకటించింది. వడ్డీ రేట్లు తగ్గడంతో.. భారత్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2014లో రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2015లో రూ.52,000 కోట్లకు చేరుకుంటుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంటోంది. ఇటీవల కీలక రేట్లను సవరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ పరిణామంతో సెంటిమెంటు బలపడి పరిశ్రమకు ఊతమిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. భారత్‌లో అమ్మకాల్లో ఫైనాన్స్ స్కీమ్‌ల ద్వారా జరుగుతున్న లావాదేవీల వాటా 30 శాతంగా ఉంది. ఇది మరింత పెరుగుతుందని సియామ్ ఆశిస్తోంది. అమ్మకాలు పెరగడంలో బజాజ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్స్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. సులభ వాయిదాల్లో ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతారని చెప్పారు. మార్కెటింగ్‌కు ప్యానాసోనిక్ రూ.90 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలియజేశారు. 30 శాతం దాకా వృద్ధి.. ప్రస్తుతం మార్కెట్ సానుకూలంగా ఉందని సామ్సంగ్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ రిషి సూరి అన్నారు. కంపెనీ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండడంతో 40 అంగుళాలు, ఆపైన సైజున్న టీవీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పండగల సీజన్లో 25 శాతం దాకా వృద్ధి ఆశిస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ నీలాద్రి దత్తా తెలిపారు. వెబ్ ఓఎస్ టెక్నాలజీతో ఓఎల్ఈడీ టీవీ, స్మార్ట్ టీవీతోపాటు డ్యూయల్ డోర్ ఇన్ డోర్ రిఫ్రిజిరేటర్, జెట్ స్ప్రే టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లను ఎల్జీ విడుదల చేసింది. ఈ సీజన్లో బ్రాండ్‌ను బట్టి 25 శాతం వరకూ డిస్కౌంట్లుంటాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఐటీ మాల్ సైతం ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోందన్నారు. ఆన్లైన్లో భారీ తగ్గింపు.. దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... అక్టోబరు 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన బిగ్ బిలియన్ డేలో కొన్ని సమస్యలు తలెత్తటం, పరువు పోయే పరిస్థితి రావటంతో ఈ సారి ఒకేరోజు కాకుండా ఐదు రోజుల పాటు బిలియన్ డేస్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. అంతేకాక తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి ఇటీవలే ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, హోం ఎంటర్టైన్మెంట్ వంటి టెక్నాలజీ ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంటు ఇవ్వనున్నట్టు ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని వెల్లడించారు.70% దాకా డిస్కౌంట్‌ను తమ కంపెనీ నుంచి ఆశించొచ్చని స్నాప్‌డీల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు.