సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు.
రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment