National real estate development
-
అట్టహాసంగా నరెడ్కో ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ 13వ ప్రాపర్టీ షో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక విధానాలతో ఐటీ రంగంతో పాటు ఫార్మా, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి అన్ని రంగాలలో జోరుగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఆయా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బహుళ జాతి కంపెనీలకు హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, దీంతో గృహ విభాగంలో డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పట్టణీకరణ పెరగడంతో చాలా మంది కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బీ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీతో ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందని చెప్పారు. స్థిరాస్తిలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. జనరల్ సెక్రటరీ విజయసాయి మేక మాట్లాడుతూ.. నరెడ్కో తెలంగాణ కేవలం స్థిరాస్తి రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలోనూ భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. రెరా సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్ట్‌లు,లావాదేవీలలో పారదర్శకత ఉండే ప్రాజెక్ట్లనుమాత్రమే ప్రాపర్టీలో ఉన్నాయని, కొనుగోలుదారులు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) నేడు, రేపు కూడా.. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారం కూడా ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రదర్శనలో వందకు పైగా డెవలపర్లు, ఆరి్ధక సంస్థలు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సుమారు నగరంలో నలుమూలలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన 300లకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ ల్యాండ్స్ ఇలా అన్ని రకాల ప్రాపరీ్టలు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ హోమ్ లోన్స్ వంటి బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కూడా ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. -
ధర తగ్గిస్తే ఇల్లు కొంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనాలంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. అలాగే సులభ వాయిదాలూ ఉండాల్సిందేనని 73 శాతం కస్టమర్లు చెబుతున్నారని హౌజింగ్.కామ్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 3,000 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2022 జనవరి–జూన్ రెసిడెన్షియల్ రియల్టీ కన్జూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ ప్రకారం.. రియల్టీలో పెట్టుబడులకు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇదే అత్యధికం. 2020 జూలై–డిసెంబర్ కాలానికి చేపట్టిన సర్వేలో ఇల్లు, స్థలంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినవారి సంఖ్య 35 శాతం మాత్రమే. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు 57 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. విశ్వసనీయత లేమి కారణంగా కాబోయే కొనుగోలుదార్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఫ్లాట్‌ను బుక్ చేయడానికి ఇప్పటికీ జాగ్రత్తగానే ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నరెడ్కో చెబుతోంది. డెవలపర్లు తమ నిబద్ధతతో కూడిన గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారిస్తుండటంతో పరిస్థితి మారవచ్చని వివరించింది. ధరలు పెరుగుతాయ్..: ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్నందున వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు అధికం అవుతాయని 51 శాతం మంది వినియోగదార్లు భావిస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత వినియోగంలో వేగం ఊపందుకుంది. ఆన్లైన్లో ఇల్లు చూసి కొనడం లేదా ఒకసారి ఇంటిని పరిశీలించిన వెంటనే ఒప్పందాన్ని పూర్తి చేయడానికి 40 శాతం మంది కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది ప్రధాన నగరాల్లోని గృహ కొనుగోలుదారులు విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోద స్థలాలకు సమీపంలో ఇంటిని కోరుకుంటున్నారు. అత్యధికులు తమ ఇళ్ల నుండి 1–1.5 కిలోమీటరు దూరంలో ఇటువంటి సౌకర్యాలు ఉండాలంటున్నారు. గృహ రుణాల వడ్డీపై రిబేట్ పెంపు, నిర్మాణ సామగ్రిపై గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ లభ్యత విస్తరణ, స్టాంప్ డ్యూటీ కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని హౌజింగ్.కామ్, నరెడ్కో చెబుతున్నాయి. కోవిడ్ ముందస్తు స్థాయికి..: రానున్న 6 నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని 79% మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో 41%తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుందని 21% మంది మాత్రమే సూచించారు. 63% మంది గృహ కొనుగోలుదారులు రాబోయే 6 నెలలకు తమ ఆదాయంపై నమ్మకంతో ఉన్నారు. డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో 2021 లో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయిలను దాటతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని హౌజింగ్.కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
లాభాల కోసం చూడొద్దు.. అమ్మేసుకోండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటేటా పెరుగుతున్న అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు అత్యాశగా లాభాల కోసం ఎదురుచూడకుండా ఇన్వెంటరీ గృహాలను విక్రయించుకోవాలని.. దీంతో కనీసం బ్యాంక్ వడ్డీ భారాౖన్నైనా తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏర్పాటు చేసిన వెబ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్వెంటరీ గృహాల విషయంలో అత్యాశ వద్దు. ఎంత ధర వచ్చినా సరే విక్రయించడమే ఉత్తమం. కనీసం చేతిలో నగదు లభ్యత అయినా పెరుగుతుంది. ముంబైలో చాలా మంది బిల్డర్లు ప్రీమియం ధర రావాలని ఇన్వెంటరీని విక్రయించడం లేదు. చ.అ.కు రూ.35–40 వేల ధర వచ్చే వరకు ఎదురుచూస్తున్నారని’’ వివరించారు. ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్లతో డెవలపర్లు ధరల గురించి చర్చించాలని, బ్యాంక్‌లు, ప్రైవేట్ రుణదాతల వడ్డీ వ్యయ భారం నుంచి విముక్తి కోసమైనా వీటిని విక్రయించడమే మేలని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, గృహ విభాగంలో డిమాండ్‌ను సృష్టించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. రూ.10 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను నిర్మించాలని కోరారు. రోడ్లు, రహదారుల విభాగంలో భారీ వ్యాపార అవకాశాలున్నాయి. ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగంతో లాజిస్టిక్ పార్క్‌లు, రహదారుల నిర్మాణంలోకి రావాలని సూచించారు. రహదారుల వెంట బస్ డిపోలు, పెట్రోల్ పంప్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటివి అభివృద్ధి చేస్తున్నామని.. ఆసక్తివున్న నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ముంబై–ఢిల్లీ కారిడార్‌లో టౌన్‌షిప్‌ల నిర్మాణం ప్రణాళికలో ఉందని చెప్పారు. సొంతంగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకోండి.. నిర్మాణ కంపెనీలు తమ వ్యాపార విభాగాలను మార్చుకోవాలని, సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్థాపించాలని సూచించారు. ఉదాహరణకు ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా తయారీ కంపెనీలకు సొంతంగా ఆటో ఫైనాన్స్ కంపెనీలున్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా సొంతంగా గృహ రుణ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించాలని సూచించారు. దీంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ఇన్వెస్టర్లలకు ఈక్విటీ ఇష్యూల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎన్బీఎఫ్సీలు నిధులను సమీకరించాలని సూచించారు. -
ఇంటి రుణాలపై వడ్డీరేటు 7%కి తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. -
నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగం, ప్రభుత్వం మధ్య సంధానకర్తగా పనిచేస్తున్న జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరెడ్కో) తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ ఆర్ చలపతి రావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. స్థిరాస్తి రంగంలోని క్షేత్ర స్థాయిలోని సమస్యల్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను మంత్రిత్వ శాఖలను నరెడ్కోలో చీఫ్ ప్యాట్రన్స్‌గా నియమిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నరెడ్కో చీఫ్ ప్యాట్రన్‌గా గృహ మరియు పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్ ఉండాలని ఇటీవల ఆయన్ని కోరామని చెప్పారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 12న ఢిల్లీలో నరెడ్కో 12వ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం. 2022 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 18.7 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 43.7 మిలియన్ ఇళ్ల కొరత ఏర్పడుతుంది. వీరందరికి సొంతిల్లు కల్పించాలంటే సుమారుగా రూ.1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వంటి పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో నిధుల కొరత తీరుతుంది.