pre budget meeting
-
కేంద్రబడ్జెట్ సన్నాహక సమావేశం
ఢిల్లీ: రాబోయే 2024-25 పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నకల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు.ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కేంద్రబడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా ఏడో బడ్జెట్. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె అధిగమించి చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె ఘనత సాధించారు. -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను 2023–24 వార్షిక బడ్జెట్లో రద్దు చేయాలని కేంద్రానికి పరిశ్రమల వేదిక– ఫిక్కీ తన ప్రీ–బడ్జెట్ కోర్కెల మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ పన్ను విధింపు చమురు, గ్యాస్ అన్వేషణకు సంబంధించిన పెట్టుబడులకు ప్రతికూలమని తన సిఫారసుల్లో పేర్కొంది. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. ఇంధన రంగానికి సంబంధించి ఫిక్కీ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► పెట్రోలియం క్రూడ్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా రద్దు చేయాలి. లేదా అసాధారణ చర్యగా కొంత కాలం లెవీని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ రేటును యాడ్–వాల్రెమ్ లెవీగా మార్చాలి. ఇది 100 డాలర్లపైన పెరిగే క్రూడ్ ధరలో 20 శాతంగా ఉండాలి. ► రాయల్టీ (ఆన్‌షోర్ ఫీల్డ్‌లకు చమురు ధరలో 20%, ఆఫ్‌షోర్ ప్రాంతాలకు 10%) అలాగే చమురు పరిశ్రమ అభివృద్ధి (ఓఐడీ) సెస్ (చమురు ధరలో 20%) ఇప్పటికే భారం అనుకుంటే, విండ్‌ఫాల్ పన్ను ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ► విండ్‌ఫాల్ టాక్స్ వాస్తవ ధరపై కాకుండా, టన్ను ఉత్పత్తిపై మదింపు జరుగుతోంది. దీనివల్ల ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోంది. ప్రపంచ ప్రమాణాలు పాటించాలి.. ప్రస్తుతం దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులపై దాదాపు 70% పన్ను విధిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, 35–40% పన్ను మాత్రమే విధించాలి. ఈ రంగంలో కీలక పెట్టుబడులకు ఇది పన్ను దోహదపడుతుంది. ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడానికి, అస్థిర ప్రపంచ ముడి మార్కెట్ల నుండి దేశాన్ని రక్షించడానికి కీలకమైన విధాన సంస్కరణలు తెచ్చేందుకు ఈ బడ్జెట్ మంచి అవకాశం. – సునీల్ దుగ్గల్, వేదాంత గ్రూప్ సీఈఓ -
ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసికట్టుగా పనిచేయాలని, అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ పరిధి దాటి విశాల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రముఖ ఆర్థికవేత్తలతో శుక్రవారం ప్రధాని సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. డిజిటల్ కార్యకలాపాల విషయంలో, ఫిన్‌టెక్ విస్తరణలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించినట్టు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది. సమ్మిళిత వృద్ధికి ఇది కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ వృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఉత్పాదకతలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని కోరారు. రిస్క్‌లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా డిజిటైజేషన్, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగాల్లో విస్తతమైన అవకాశాలున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ తన వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో ప్రధానికి సూచించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యలు కొనసాగుతాయంటూ, భారత్ మరింత బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు చర్యలను ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ, ఉన్నతాధికారులతోపాటు.. ఆర్థికవేత్తలు శంకర్ ఆచార్య, అశోక్ గులాటీ, షమిక రవి తదితరులు పాల్గొన్నారు. -
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ సమావేశం.. హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన
ఢిల్లీ: వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా రామన్ ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సహా అభివృద్ధి పథకాలకు నిధులు వంటి అంశాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు రానున్న బడ్జెట్లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. చదవండి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారానికి మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం (2022–23) బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాట్ వంటి స్థానిక పన్నులను ఉపసంహరించుకోవడం జరిగింది. దీనివల్ల ఏర్పడే ఆదాయ లోటు కోసం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తుంది. కరోనా కష్టకాలంలో మరో ఐదేళ్లు పరిహార కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాలు తాజాగా డిమాండ్ చేశాయి. పలు వర్గాలతో భేటీ... 2022–23 వార్షిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు వీరిలో ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్‌గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్దీకరణ, డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్ స్టోరేజ్‌కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.మోడీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్. ఇక్కడి విజ్ఞాన్ భవల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు తమ డిమాండ్లు ఏమిటన్నది మీడియాకు వెల్లడించారు. ఆయా అంశాలు పరిశీలిస్తే... బంగారం దిగుమతి సుంకాలు తగ్గాలి 2027 వరకూ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్ సరైందే. దీనిని కేంద్రం పరిశీలించాలి. దీనికితోడు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి. కేంద్ర పథకాల్లో కేంద్రం వాటా క్రమంగా తగ్గుతూ, రాష్ట్రాల వాటా పెరగాలనేది మా అత్యంత ముఖ్యమైన డిమాండ్. ఇంతకుముందు షేరు 90–10గా ఉండేది. మరియు ఇప్పుడు అది 50–50 లేదా 60–40గా ఉంది. అది 90–10కి తిరిగి వెళ్లాలని మా అభ్యర్థన. కోవిడ్ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇది అత్యవసరం. నీటిపారుదల, నీటి పనుల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని అలాగే కేంద్ర పథకాలుగా ప్రకటించాలని కూడా కోరుతున్నాం. – సుభాష్ గార్గ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి లేకపోతే కష్టమే... పలు రాష్ట్రాలు పరిహారం కొనసాగింపును కోరాయి. మేము కూడా పొడిగించమని కోరాము. పొడిగించకపోతే, అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాం జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయానికి గండి పడింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రం దాదాపు రూ. 5 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి జీఎస్టీ పరిహారం మంజూరును కొనసాగించాలని కోరుతున్నాం. మూడే ళ్లలో కేంద్ర బడ్జెట్లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.13,089 కోట్ల తక్కువ కేంద్ర పన్నుల వాటా వచ్చింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కోల్ బ్లాక్ కంపెనీల నుంచి బొగ్గు తవ్వకాలకు సంబంధించి టన్నుకు రూ.294 చొప్పున కేంద్రం వద్ద జమ అయ్యింది. దీనికి సంబంధించి రూ.4,140 కోట్లను కూడా వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు బదలాయించాలి. భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అదనపు రుణ సౌలభ్యత కావాలి కరోనా సవాళ్లతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచకతప్పదు. దీనితోపాటు రాష్ట్ర రుణాలకు సంబంధించి, ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా అదనపు రుణాల సౌలభ్యతను కల్పించాలి. – చంద్రిమా భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి -
ఐటీ శ్లాబ్స్ హేతుబద్ధీకరించాలి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, ఆన్లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు.. ► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు. ► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది. ► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది. -
ఉపాధి కల్పనే లక్ష్యంగా.. బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు షురూ!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి బడ్జెట్ కసరత్తు ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి ప్రీ–బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక సర్క్యులర్ ప్రకటించింది. నవంబర్ రెండవ వారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి.కోవిడ్–19 మహమ్మారి తీవ్ర సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న రెండవ వార్షిక బడ్జెట్ ఇది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది నాల్గవ బడ్జెట్. డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, ఎనిమిది శాతం వృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలతో తాజా బడ్జెట్ రూపొందనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 2022 ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చదవండి: పెట్రోల్ విషయంలో సామాన్యులకు మరోసారి నిరాశ! -
పెట్టుబడిదారులతోనే బడ్జెట్ సంప్రదింపులా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, విద్యార్ధులు, యువత, మధ్యతరగతిని విస్మరించి తనకు కావాల్సిన అత్యంత సంపన్నులతోనే భేటీ అవుతున్నారని దుయ్యబట్టారు. నీతిఆయోగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆర్థిక వేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలతో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రైతులు, చిన్నవ్యాపారులు, విద్యార్ధులు, ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రధాని మోదీకి అవసరం లేదని సూట్‌బూట్‌సర్కార్ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు. తన సన్నిహిత సంపన్న పారిశ్రామికవర్గాల ప్రయోజనాలకే ప్రధాని మోదీ పట్టం కడతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
దేశ ఆర్థిక మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్‌లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ .. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ‘దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా.. టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేధోమథనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోదగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణ వితరణ పెరగాలి... రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోదగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. ‘ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది‘ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్థిక మంత్రి గైర్హాజరు... దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
ఇంటి రుణాలపై వడ్డీరేటు 7%కి తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. -
టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ‘‘ఏజీఆర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం ఆదాయంలో 8 శాతంగా ఉన్న స్పెక్ట్రమ్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని కోరాం. స్పెక్ట్రమ్ వినియోగ చార్జీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని అడిగాం. తగిన వ్యవధిలోపు దీన్ని చేస్తారేమో చూడాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకును ఏర్పాటు చేసి, పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించి.. తక్కువ రేటుకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరాం’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో స్పష్టత కోసం వేచి చూస్తున్నామని టెలికం శాఖ తమకు తెలిపినట్టు చెప్పారు. జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బకాయిలు రూ.36,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. ‘‘స్పెక్ట్రమ్, లైసెన్స్ ఫీజుపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. ఎందుకంటే వీటిని సేవలుగా పేర్కొన్నారు. అవి సేవలు కావని వివరించాం’’ అని మాథ్యూస్ తెలిపారు. జీఎస్టీని సులభంగా మార్చాలి: ఆర్థిక వేత్తలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను సులభంగా మార్చాలని, ప్రత్యక్ష పన్నుల కోడ్ (చట్టం)ను అమలు చేయాలని కేంద్రానికి ఆర్థిక వేత్తలు సూచించారు. వృద్ధికి మద్దతుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, అందుకు అన్ని రంగాల్లోనూ విధానపరమైన పరిష్కారాలు వేగంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే, ద్రవ్య నిర్వ హణ, విద్యుత్ రం గంలోనూ సంస్కరణలు అవసరమని బడ్జెట్ ముందస్తు సమావేశంలో సూచించారు. ‘‘వృద్ధి క్షీణత పరంగా కనిష్ట స్థాయి ముగిసింది. వృద్ధిని 7–7.5 శాతానికి వేగవతం చేయడానికి ఏమి చేయగలమన్నదే ముఖ్యం’’ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మాణి సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. చిన్న వ్యాపారాలకు డీటీసీ అమలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సందేహాత్మక స్థితి నుంచి బయట పడాలి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమలు సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలని, సహజ ఉత్సాహాన్ని ప్రదర్శించాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బడ్జెట్ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అసోచామ్ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘స్వీయ సందేహాత్మక ధోరణి నుంచి బయటకు రావాలి. మేం ఇది చేయగలమా? భారత్ ఇది చేయగలదా?.. ఎందుకీ ప్రతికూల భావన? ఈ అనుమానాల నుంచి బయటకు రండి. భారత వ్యవస్థను మార్చే విషయమై ప్రభుత్వం తన దృఢత్వాన్ని చూపించింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిశ్రమల పట్ల స్పందిస్తుందని నమ్మకం కలిగించాం’’ అని చెప్పారు. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి, ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, పరిశ్రమల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, స్థూల ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, ఎఫ్‌డీఐల రాక బలంగా ఉందని, విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్టాల వద్ద ఉన్నాయని వివరించారు. ‘‘దేశ వృద్ధి పథంలో పాల్గొనాలి. తొలి బిడ్ వేయడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. -
సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్టార్టప్‌లు, మొబైల్ తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రతినిధులు మంత్రి ముందు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు. ఐటీ పరిశ్రమ.. ‘‘కొత్తగా ఏర్పడే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త సేవల కంపెనీలకూ 15 శాతం రేటు అమలు చేస్తే సెజ్‌లలోని తయారీ, సేవల రంగాలకు ఒకటే రేటు అమలవుతుందని కేంద్రానికి సూచించాం’’ అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల విషయంలో సెజ్‌లు భవిష్యత్తు వృద్ధికి కీలకమన్నారు. విస్తృతమైన టెక్నాలజీలపై (డీప్‌టెక్) పనిచేసే స్టార్టప్‌ల కోసం నిధితోపాటు, ఆవిష్కరణల సమూహాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో డేటా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించినట్టు రిలయన్స్ జియో వైస్ ప్రెసిడెంట్ విశాఖ సైగల్ తెలిపారు. ఆర్థిక సేవల సంస్థలు.. టర్మ్ ఇన్సూరెన్స్ విస్తరణ కోసం జీఎస్టీ రేటును తగ్గించాలని, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి కేవైసీ నిబంధనలను క్రమబద్ధీకరించాలని ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రంగానికి చెందిన కంపెనీలు (బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు) ప్రభుత్వానికి సూచించాయి. ప్రభ్వురంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపరచడంపై, పీజే నాయక్ కమిటీ సిఫారసుల అమలుపై దృష్టి సారించాలని కోరాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్లను తొలగించి, నిర్వహణను మెరుగుపరిచే విషయమై కూడా సూచనలు చేశాయి. ఆర్థిక పరిమితులకు లోబడి వీటిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ‘‘ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని సూచించాయి. అటల్ పెన్షన్ యోజనలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు చేయాలని కూడా కోరాం’’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొబైల్ పరిశ్రమ... ఇటీవల ప్రభుత్వం ఎగుమతులపై తగ్గించిన రాయితీలతో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, అలాగే, మొబైల్ హ్యాండ్సెట్లపై జీఎస్టీ రేటు తగ్గించాలని కోరింది. దేశంలో పెద్ద ఎత్తున తయారీకి ఇది అవసరమని పేర్కొంది. ఎగుమతులపై 8% రాయితీ ఇవ్వాలని కోరింది. జీఎస్టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం ముంబై: జీఎస్టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్ నెట్వర్క్ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం కీలకమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి (సీబీఐసీ) ట్వీట్ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
కేంద్ర బడ్జెట్ కసరత్తు షురూ, తొలి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన సన్నాహాలను మొదలుపెట్టేశారు. 2020-21 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కసరత్తులో భాగంగా తొలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సార్ట్-అప్, ఫిన్‌టెక్, డిజిటల్ సంస్థల ప్రతినిధులతో ముందస్తు సంప్రదింపులు నిర్వహించారు. ఈ సంప్రదింపులు డిసెంబర్ 23 వరకు సంప్రదింపులు కొనసాగుతాయని సమాచారం. సోమవారం నుండి ప్రారంభమయ్యే ప్రీ బడ్జెట్ సమావేశాల్లో, వినియోగం, వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక సంస్థలు పరిశ్రమ సంస్థలు, రైతు సంస్థలు ఆర్థికవేత్తలతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 19న పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. వ్యాపారం సులభతరం, ప్రైవేటు పెట్టుబడులను ప్రభావితం చేసే నియంత్రణ వాతావరణం, ఎగుమతి పోటీతత్వం, రాష్ట్రాల పాత్ర (చెల్లింపులు ఆలస్యం, కాంట్రాక్ట్ అమలు), ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణ వృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్నులో కొంత ఉపశమనం లభించనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ రెండవసారి కొలువు దీరిన అనంతరం ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రెండోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఒకవైపుభారీగా క్షీణించిన వినియోగ డిమాండ్, జీడీపీ 5శాతం దిగువకు లాంటివి ఆమె ముందున్న సవాళ్లు. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమందగమనం పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. -
మా హామీల భారం మీదే: చంద్రబాబు
* అధికారులు నిరంతరం పనిచేయాలి * ప్రీ బడ్జెట్ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు * సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకోవాలి * రాష్ట్రంలో సాగు దెబ్బతింది * రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల్లో తామిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. బుధవారం విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు హామీలివ్వడం, వాటి ద్వారా ఓట్లు కోరడం సాధారణమని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. నూతన రాష్ట్రానికి నూతన బడ్జెట్ రూపకల్పన చేసుకుంటున్నామన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి ఏడు నెలలు పూర్తవుతుందన్నారు. ఈ కాలంలో విజయాలు చెప్పుకొని, లోటుపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు దెబ్బతిన్నదన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే అప్పుల ఊబిలో ఉన్న రైతులు 51 శాతం అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 93 శాతం ఉన్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, అందువల్లే రైతులు అప్పులపాలవుతున్నారన్నారు. కోట య్య కమిటీ నివేదికలో రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని సూచించారని, దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కేబినెట్లో రూ. 1.50 లక్షలు రుణమాఫీ కుటుంబానికి చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని శాఖలు ఆధార్‌తో అనుసంధానం.. రేషన్ కార్డు, పెన్షన్, స్కాలర్షిప్, భూమి సర్వే.. ఏదైనా ఆధార్‌తో అనుసంధానం చేయడానికి సంకల్పించామన్నారు. రుణమాఫీకి బ్యాంకులు, ఆర్బీఐ సహకరించకపోయినా ఫేజ్ వన్ విజయవంతంగా చేశారని అధికారులను అభినందించారు. రూ. 50 వేలు పైన రుణం తీసుకున్న వారికి రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల తక్కువ మాఫీ అయివుంటే వాళ్లకు వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా రుణవిముక్తి కల్పించాలని ఆదేశించారు. డైనమిక్ రాజధాని కోసమే.. రాష్ట్రం మధ్య భాగంలో డైనమిక్ సిటీ ఉండే విధంగా రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూ సేకరణ విషయంలో కొంతమంది అడ్డంపడుతున్నా రైతులు విజ్ఞతతో వ్యవహరించారన్నారు. ఇక్కడే మాకు రాజధాని కావాలన్న రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవడం వల్ల సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సీఎం చెప్పారు. ఈనెల 12న సింగపూర్ టీం మళ్లీ ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. వాళ్ల మంత్రితో పాటు హైలెవెల్ టీం కూడా వస్తోందన్నారు. జపాన్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోందన్నారు. నూతన రాజధాని నిర్మాణం త్వరగా కావాల్సి ఉందని, దీనికోసం యాక్షన్‌ప్లాన్ తయారు చేసినట్లు చెప్పారు. విభజన జరిగిన మూడు నెలల నుంచే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. బొగ్గును కూడా దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్‌లు డ్వాక్రా మహిళలకు ఇచ్చి వారి ద్వారా ఇసుకను అడిగిన వారందరికీ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇక, సంక్రాంతికి ఉచితంగా ఇచ్చే ఆరు నిత్యావసర వస్తువులను 11వ తేదీ సాయంత్రానికి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎప్పుడూ పనే కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా పెద్ద ఎత్తున జరపాలని సీఎం పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వీక్‌గా ఉందంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఆడుకునే ప్రయత్నం చేస్తారని కలెక్టర్లతో సీఎం అన్నారు. గవర్నమెంట్ గట్టిగా ఉందంటే జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. సైంటిఫిక్ బడ్జెట్.. ఈసారి సైంటిఫిక్ వే ద్వారా బడ్జెట్ రూపొం దించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2019 ఫేజ్వన్, 2022 ఫేజ్ టూ బడ్జెట్ల ద్వారా భారత దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉండే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. 2029లో దేశంలో అగ్ర రాష్ర్టంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయు డు, రావెల కి శోర్బాబు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావులతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాము డు, ఆర్థిక కార్యదర్శి టక్కర్, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.