టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి | COAI raises AGR issue, seeks cut in levies at meeting win nirmala sitaraman | Sakshi
Sakshi News home page

టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి

Published Sat, Dec 21 2019 5:32 AM | Last Updated on Sat, Dec 21 2019 5:32 AM

COAI raises AGR issue, seeks cut in levies at meeting win nirmala sitaraman - Sakshi

న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 2020–21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ‘‘ఏజీఆర్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం ఆదాయంలో 8 శాతంగా ఉన్న స్పెక్ట్రమ్‌ ఫీజును 3 శాతానికి తగ్గించాలని కోరాం. స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని అడిగాం.

తగిన వ్యవధిలోపు దీన్ని చేస్తారేమో చూడాలి. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకును ఏర్పాటు చేసి, పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించి.. తక్కువ రేటుకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరాం’’ అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో స్పష్టత కోసం వేచి చూస్తున్నామని టెలికం శాఖ తమకు తెలిపినట్టు చెప్పారు. జీఎస్‌టీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ బకాయిలు రూ.36,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. ‘‘స్పెక్ట్రమ్, లైసెన్స్‌ ఫీజుపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. ఎందుకంటే వీటిని సేవలుగా పేర్కొన్నారు. అవి సేవలు కావని వివరించాం’’ అని మాథ్యూస్‌ తెలిపారు.

జీఎస్‌టీని సులభంగా మార్చాలి: ఆర్థిక వేత్తలు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను సులభంగా మార్చాలని, ప్రత్యక్ష పన్నుల కోడ్‌ (చట్టం)ను అమలు చేయాలని కేంద్రానికి ఆర్థిక వేత్తలు సూచించారు. వృద్ధికి మద్దతుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, అందుకు అన్ని రంగాల్లోనూ విధానపరమైన పరిష్కారాలు వేగంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే, ద్రవ్య నిర్వ హణ, విద్యుత్‌ రం గంలోనూ సంస్కరణలు అవసరమని   బడ్జెట్‌ ముందస్తు సమావేశంలో సూచించారు. ‘‘వృద్ధి క్షీణత పరంగా కనిష్ట స్థాయి ముగిసింది.  వృద్ధిని 7–7.5 శాతానికి వేగవతం చేయడానికి ఏమి చేయగలమన్నదే ముఖ్యం’’ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ విర్మాణి సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. చిన్న వ్యాపారాలకు డీటీసీ అమలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

సందేహాత్మక స్థితి నుంచి బయట పడాలి
నిర్మలా సీతారామన్‌
దేశీయ పరిశ్రమలు సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలని, సహజ ఉత్సాహాన్ని ప్రదర్శించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. బడ్జెట్‌ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అసోచామ్‌ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘స్వీయ సందేహాత్మక ధోరణి నుంచి బయటకు రావాలి. మేం ఇది చేయగలమా? భారత్‌ ఇది చేయగలదా?.. ఎందుకీ ప్రతికూల భావన? ఈ అనుమానాల నుంచి బయటకు రండి. భారత వ్యవస్థను మార్చే విషయమై ప్రభుత్వం తన దృఢత్వాన్ని చూపించింది.

కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిశ్రమల పట్ల స్పందిస్తుందని నమ్మకం కలిగించాం’’ అని చెప్పారు. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి, ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, పరిశ్రమల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, స్థూల ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, ఎఫ్‌డీఐల రాక బలంగా ఉందని, విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్టాల వద్ద ఉన్నాయని వివరించారు. ‘‘దేశ వృద్ధి పథంలో పాల్గొనాలి. తొలి బిడ్‌ వేయడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement