Cellular Operators Association of India (COAI)
-
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ‘‘ఏజీఆర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం ఆదాయంలో 8 శాతంగా ఉన్న స్పెక్ట్రమ్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని కోరాం. స్పెక్ట్రమ్ వినియోగ చార్జీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని అడిగాం. తగిన వ్యవధిలోపు దీన్ని చేస్తారేమో చూడాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకును ఏర్పాటు చేసి, పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించి.. తక్కువ రేటుకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరాం’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో స్పష్టత కోసం వేచి చూస్తున్నామని టెలికం శాఖ తమకు తెలిపినట్టు చెప్పారు. జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బకాయిలు రూ.36,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. ‘‘స్పెక్ట్రమ్, లైసెన్స్ ఫీజుపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. ఎందుకంటే వీటిని సేవలుగా పేర్కొన్నారు. అవి సేవలు కావని వివరించాం’’ అని మాథ్యూస్ తెలిపారు. జీఎస్టీని సులభంగా మార్చాలి: ఆర్థిక వేత్తలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను సులభంగా మార్చాలని, ప్రత్యక్ష పన్నుల కోడ్ (చట్టం)ను అమలు చేయాలని కేంద్రానికి ఆర్థిక వేత్తలు సూచించారు. వృద్ధికి మద్దతుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, అందుకు అన్ని రంగాల్లోనూ విధానపరమైన పరిష్కారాలు వేగంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే, ద్రవ్య నిర్వ హణ, విద్యుత్ రం గంలోనూ సంస్కరణలు అవసరమని బడ్జెట్ ముందస్తు సమావేశంలో సూచించారు. ‘‘వృద్ధి క్షీణత పరంగా కనిష్ట స్థాయి ముగిసింది. వృద్ధిని 7–7.5 శాతానికి వేగవతం చేయడానికి ఏమి చేయగలమన్నదే ముఖ్యం’’ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మాణి సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. చిన్న వ్యాపారాలకు డీటీసీ అమలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సందేహాత్మక స్థితి నుంచి బయట పడాలి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమలు సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలని, సహజ ఉత్సాహాన్ని ప్రదర్శించాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బడ్జెట్ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అసోచామ్ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘స్వీయ సందేహాత్మక ధోరణి నుంచి బయటకు రావాలి. మేం ఇది చేయగలమా? భారత్ ఇది చేయగలదా?.. ఎందుకీ ప్రతికూల భావన? ఈ అనుమానాల నుంచి బయటకు రండి. భారత వ్యవస్థను మార్చే విషయమై ప్రభుత్వం తన దృఢత్వాన్ని చూపించింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిశ్రమల పట్ల స్పందిస్తుందని నమ్మకం కలిగించాం’’ అని చెప్పారు. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి, ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, పరిశ్రమల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, స్థూల ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, ఎఫ్‌డీఐల రాక బలంగా ఉందని, విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్టాల వద్ద ఉన్నాయని వివరించారు. ‘‘దేశ వృద్ధి పథంలో పాల్గొనాలి. తొలి బిడ్ వేయడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. -
ఇంటర్నెట్ వాడకంపై సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రపంచమే ఇంటర్నెట్ మయంగా మారిపోయిన కాలం.. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ గణనీయంగా వ్యాప్తి చెందుతున్న రోజులివి. కానీ భారత్‌లో ఇంటర్నెట్ వాడకంపై మాత్రం సంచలన విషయాలే వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో వయసున్న వారిలో కేవలం 19 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారట. ఈ వయసున్న వారిలో 35 శాతం మందే ఇంటర్నెట్ తెలిసిన వారు ఉంటున్నారని తాజా రిపోర్టు నివేదించింది. ‘ఆఫ్టర్యాక్సస్ : ఐసీటీ యాక్సస్ అండ్ యూజ్ ఇన్ ఇండియా అండ్ ది గ్లోబల్ సౌత్’ పేరుతో లిర్న్‌ఆసియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రిపోర్టును ప్రచురించింది. భారత్‌లో ఇంటర్నెట్ వాడకం ఎంత తక్కువగా ఉందో తెలుపుతూ ఈ రిపోర్టును నివేదించింది. భారత్‌లో ఇంటర్నెట్ గురించి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని ఈ రిపోర్టు పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కేవలం 35 శాతం మందికే ఇంటర్నెట్ ఏమిటన్నది అవగాహన ఉందని, అత్యంత తక్కువగా 19 శాతం మంది మాత్రమే దీన్ని వాడుతున్నారని రిపోర్టు నివేదించింది. ప్రపంచంలో అత్యంత అఫార్డబుల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని లెర్న్‌ఆసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెర్న్‌ఆసియా హిలాని గల్పాయా చెప్పారు. కానీ ఇంటర్నెట్ వాడకం ఇంకా తక్కువగానే ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యనున్న మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 27 శాతం మంది మాత్రమే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారని పేర్కొన్నారు. -
55 లక్షల కొత్త జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఆగస్టులో 55.4 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. ఈ గణాంకాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్‌ల వివరాలు లేవు. సీఓఏఐ గణాంకాల ప్రకారం..., * ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మొత్తం జీఎస్ఎం మొబైల్ యూజర్ల సంఖ్య 74.99 కోట్లకు పెరిగింది. * ఆగస్టులో అత్యధికంగా కొత్త మొబైల్ వినియోగదారులు ఐడియా సెల్యులర్కు లభించారు. 17.2 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 14.18 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 18.91 శాతంగా ఉంది. * వొడాఫోన్‌కు 12.2 లక్షల మంది కొత్తగా వినియోగదారులయ్యారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 17.24 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 23 శాతంగా ఉంది. * కొత్తగా లభించిన 7.69 లక్షల వినియోగదారులతో ఎయిర్టెల్ మొత్తం యూజర్ల సంఖ్య 21.05 కోట్లకు పెరిగింది. మార్కెట్ వాటా 28.07%. * ఎయిర్‌సెల్‌కు 9.05 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 7.48 కోట్లకు పెరిగింది. 7.06 లక్షల మంది కొత్త వినియోగదారులతో యూనినార్ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.09 కోట్లకు చేరింది. వీడియోకాన్ మొబైల్ సంస్థకు 1.96 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. -
జీఎస్ఎం వినియోగదారుల జోరు
మేనెల నాటికి 73 కోట్లు న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగానే పెరుగుతోంది. ఈ ఏడాది మేలో 61.9 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో ఏప్రిల్ చివరి నాటికి 72.68 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య మే చివరికల్లా 73.3 కోట్లకు పెరిగిందని వివరించింది. మేలో భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా(16.5 లక్షల మంది) కొత్త వినియోగదారులు లభించారని, ఆ తర్వాతి స్థానంలో (13 లక్షల మందితో) యూనినార్ నిలిచిందని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్ 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్(23 శాతం), ఐడియా సెల్యులర్లు(19 శాతం) నిలిచాయని వివరించింది.