న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు.
ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment