న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది.
అంతేకాదు, 2024కు ముందు సిమ్‌ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది.
కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్‌లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది.
ధరలు పెరిగే ప్రమాదం..
ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు.
దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది.
దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది.
త్వరలో కుదురుకుంటుంది..
సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది.
హైలైట్స్
► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ
► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్‌ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ
► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ
► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ
► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ
► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ
Comments
Please login to add a commentAdd a comment