
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి, ఆన్‌లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు..
► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు.
► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది.
► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్‌బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది.