మా హామీల భారం మీదే: చంద్రబాబు
* అధికారులు నిరంతరం పనిచేయాలి
* ప్రీ బడ్జెట్ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు
* సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకోవాలి
* రాష్ట్రంలో సాగు దెబ్బతింది
* రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల్లో తామిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. బుధవారం విజయవాడలోని ఒక స్టార్ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు హామీలివ్వడం, వాటి ద్వారా ఓట్లు కోరడం సాధారణమని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. నూతన రాష్ట్రానికి నూతన బడ్జెట్ రూపకల్పన చేసుకుంటున్నామన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి ఏడు నెలలు పూర్తవుతుందన్నారు.
ఈ కాలంలో విజయాలు చెప్పుకొని, లోటుపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు దెబ్బతిన్నదన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే అప్పుల ఊబిలో ఉన్న రైతులు 51 శాతం అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 93 శాతం ఉన్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, అందువల్లే రైతులు అప్పులపాలవుతున్నారన్నారు. కోట య్య కమిటీ నివేదికలో రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని సూచించారని, దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కేబినెట్‌లో రూ. 1.50 లక్షలు రుణమాఫీ కుటుంబానికి చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు.
అన్ని శాఖలు ఆధార్‌తో అనుసంధానం..
రేషన్ కార్డు, పెన్షన్, స్కాలర్‌షిప్, భూమి సర్వే.. ఏదైనా ఆధార్‌తో అనుసంధానం చేయడానికి సంకల్పించామన్నారు. రుణమాఫీకి బ్యాంకులు, ఆర్బీఐ సహకరించకపోయినా ఫేజ్ వన్ విజయవంతంగా చేశారని అధికారులను అభినందించారు. రూ. 50 వేలు పైన రుణం తీసుకున్న వారికి రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల తక్కువ మాఫీ అయివుంటే వాళ్లకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా రుణవిముక్తి కల్పించాలని ఆదేశించారు.
డైనమిక్ రాజధాని కోసమే..
రాష్ట్రం మధ్య భాగంలో డైనమిక్ సిటీ ఉండే విధంగా రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూ సేకరణ విషయంలో కొంతమంది అడ్డంపడుతున్నా రైతులు విజ్ఞతతో వ్యవహరించారన్నారు. ఇక్కడే మాకు రాజధాని కావాలన్న రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవడం వల్ల సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సీఎం చెప్పారు. ఈనెల 12న సింగపూర్ టీం మళ్లీ ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. వాళ్ల మంత్రితో పాటు హైలెవెల్ టీం కూడా వస్తోందన్నారు. జపాన్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోందన్నారు.
నూతన రాజధాని నిర్మాణం త్వరగా కావాల్సి ఉందని, దీనికోసం యాక్షన్‌ప్లాన్ తయారు చేసినట్లు చెప్పారు. విభజన జరిగిన మూడు నెలల నుంచే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. బొగ్గును కూడా దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్‌లు డ్వాక్రా మహిళలకు ఇచ్చి వారి ద్వారా ఇసుకను అడిగిన వారందరికీ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇక, సంక్రాంతికి ఉచితంగా ఇచ్చే ఆరు నిత్యావసర వస్తువులను 11వ తేదీ సాయంత్రానికి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎప్పుడూ పనే కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా పెద్ద ఎత్తున జరపాలని సీఎం పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వీక్‌గా ఉందంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఆడుకునే ప్రయత్నం చేస్తారని కలెక్టర్‌లతో సీఎం అన్నారు. గవర్నమెంట్ గట్టిగా ఉందంటే జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
సైంటిఫిక్ బడ్జెట్..
ఈసారి సైంటిఫిక్ వే ద్వారా బడ్జెట్ రూపొం దించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2019 ఫేజ్‌వన్, 2022 ఫేజ్ టూ బడ్జెట్‌ల ద్వారా భారత దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉండే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. 2029లో దేశంలో అగ్ర రాష్ర్టంగా ఉండాలని చెప్పారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయు డు, రావెల కి శోర్‌బాబు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావులతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాము డు, ఆర్థిక కార్యదర్శి టక్కర్, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.