న్యూఢిల్లీ: తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయాలను జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకుంది. గడువు దాటి దాఖలు చేసే రిటర్నులపై రుసుము, వడ్డీ భారాన్ని తగ్గించింది. రూ.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం కలిగిన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే, వడ్డీ రేటును సగానికి (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గిస్తూ శుక్రవారం జరిగిన భేటీలో నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాఖలు చేసే రిటర్నులకు ఈ తగ్గింపు అమలవుతుంది. ఇక ఈ ఏడాది మే, జూన్, జూలై నెలలకు సంబంధించిన రిటర్నులను ఎటువంటి వడ్డీ భారం లేకుండానే సెప్టెంబర్ వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ అనంతరం వెల్లడించారు. లాక్‌డౌన్ అమలైన ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీఎస్‌టీ ఆదాయం ఏ మేరకు ఉండొచ్చన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 45 శాతం వరకు ఉండొచ్చన్నారు. టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి జీఎస్‌టీ హేతుబద్ధీకరణపై నిర్ణయాన్ని కౌన్సిల్ వాయిదా వేసింది.
తాజా నిర్ణయాల నేపథ్యంలో..
పన్ను చెల్లించాల్సిఉండి, జీఎస్‌టీఆర్–3బీ రిటర్నులను 2017 జూలై 1 నుంచి 2020 జనవరి కాలానికి ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే అప్పుడు గరిష్ట ఆలస్యపు రుసుము రూ.500గానే ఉంటుంది. ప్రతి నెలా రిటర్నుపై రూ.500 చొప్పున అమలవుతుంది. ఇప్పుడున్న రూ.10,000 రుసుముతో పోలిస్తే భారీ గా తగ్గింది. అదేవిధంగా ఇదే కాలానికి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని సంస్థలు రిటర్నులు ఆలస్యం గా దాఖలు చేసినా ఆలస్యపు రుసుము ఉండదు.
కాంపెన్సేషన్ సెస్సుపై జూలైలో నిర్ణయం
రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించే ‘కాంపెన్సేషన్ సెస్సు’పై ప్రత్యేకంగా చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ జూలైలో మరోసారి భేటీ కానుంది. కేంద్రం గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలానికి రాష్ట్రాలకు పరిహారంగా రూ.36,400 కోట్లను విడుదల చేసినప్పటికీ.. వాస్తవ అంచనాలతో పోలిస్తే ఇంకా లోటు నెలకొంది. మార్చి నెల కు సంబంధించి రూ.12,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని అయినా తమకు చెల్లించాలని రాష్ట్రాలు కోరాయి.
పరోటాలపై జీఎస్‌టీ 18%
న్యూఢిల్లీ: తినడానికి సిద్ధంగా ఉండే (రెడీ టు ఈట్) పరోటాలను మానవ వినియోగానికి వీలుగా మరింత ప్రాసెస్ (సిద్ధం చేసుకోవడం) చేసుకోవాల్సి ఉంటుందని.. కనుక వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. హోల్ వీట్ పరోటా, మలబార్ పరోటాలను జీఎస్‌టీలోని చాప్టర్ 1905కింద గుర్తించి 5 శాతం జీఎస్‌టీ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థ ఏఏఆర్‌ను ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. చాప్టర్ 1905 లేదా 2106లో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఉత్పత్తులకే 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందంటూ, అవి ఖాఖ్రా, సాధారణ చపాతీ లేదా రోటి అయి ఉండాలని ఏఏఆర్ స్పష్టం చేసింది.
చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట
Published Sat, Jun 13 2020 4:18 AM | Last Updated on Sat, Jun 13 2020 5:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment