న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది.
దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్‌బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్‌బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment