వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా? | Industrial output growth drops to 20-month low of 0.1% in February | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?

Published Sat, Apr 13 2019 5:10 AM | Last Updated on Sat, Apr 13 2019 5:19 AM

Industrial output growth drops to 20-month low of 0.1% in February - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్‌ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి.
ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్‌బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్‌బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే...

తయారీ రంగం పేలవం...
► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం.
►  క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్‌ గూడ్స్‌... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది.  
►  విద్యుత్‌: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది.  
►  మైనింగ్‌: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది.  
►  కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌:  కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే,  నాన్‌–డ్యూరబుల్స్‌ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.  
 నవంబర్‌ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్‌ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం.  

11 నెలల కాలంలో..
2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో  (2017 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు  4.3 శాతంగా ఉంది.

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ధరల స్పీడ్‌
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్‌బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం  తాజా రిటైల్‌ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది.  

0.3 శాతం పెరిగిన ఫుడ్‌ బాస్కెట్‌ ధర
ఫుడ్‌ బాస్కెట్‌ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది.  పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement