IIP growth rate
-
వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్ గూడ్స్... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది. ► విద్యుత్: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది. ► మైనింగ్: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ ప్రొడక్ట్స్: కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, నాన్–డ్యూరబుల్స్ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► నవంబర్ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం. 11 నెలల కాలంలో.. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు 4.3 శాతంగా ఉంది. స్వల్పంగా పెరిగిన రిటైల్ ధరల స్పీడ్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది. 0.3 శాతం పెరిగిన ఫుడ్ బాస్కెట్ ధర ఫుడ్ బాస్కెట్ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది. పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. -
పారిశ్రామిక వృద్ధి అంతంతే..!
* డిసెంబర్లో 1.7 శాతం * గనుల రంగం పేలవం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు 2014 డిసెంబర్లో నామమాత్రంగా 1.7 శాతంగా నమోదయ్యింది. గనులు, తవ్వకాల రంగం పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే 2013 డిసెంబర్‌తో పోల్చిచూస్తే మాత్రం వృద్ధి కొంత బెటర్. అప్పట్లో ఈ వృద్ధి రేటు నామమాత్రంగా 0.1 శాతంగా ఉంది. కాగా 2014 నవంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటును స్వల్పంగా 3.8 శాతం నుంచి 3.9 శాతానికి సవరించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఐఐపీ వృద్ధి రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 0.1 శాతం నుంచి 2.1 శాతానికి ఎగసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా కేంద్రం ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు గణాంకాలను విడుదల చేస్తుంది. గురువారం విడుదలైన తాజా డిసెంబర్ గణాంకాలను విభాగాల వారీగా చూస్తే... ⇒ మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం డిసెంబర్లో 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలో ఈ రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చితే క్షీణత నుంచి బైటపడింది. మైనస్ 0.4 శాతం నుంచి 1.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ⇒ మైనింగ్ రంగం 2.6 శాతం వృద్ధి బాట నుంచి -3.2 శాతం క్షీణ బాటకు మళ్లింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మాత్రం ఈ రేటు సానుకూలంగా ఉంది. -1.5 శాతం క్షీణత నుంచి 1.7 శాతం వృద్ధి రేటులో ఉంది. ⇒ ఇక డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీ విభాగం క్యాపిటల్ గూడ్స్ 4.1 శాతం వృద్ధి సాధించింది. 9 నెలల్లో -0.4 శాతం క్షీణ రేటు 4.8 శాతం వృద్ధి బాటలో ఉంది. ⇒ విద్యుత్ రంగం వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో వృద్ధి రేటు 5.6 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. బడ్జెట్లో చర్యలు అవసరం: కార్పొరేట్లు పారిశ్రామిక ఉత్పత్తి మందగమనంలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలని, పెట్టుబడుల వృద్ధికి ఫిబ్రవరి 28 బడ్జెట్లో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఈ దిశలో కేంద్రం బడ్జెట్లో తగిన చర్యలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఉత్సాహానికి మరికొంత ఊపును ఇవ్వడానికి పటిష్ట, సుస్థిర విధాన పరమైన చర్యలూ అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం అప్ న్యూఢిల్లీ: రిటైల్ వస్తువుల ధరలు జనవరిలో 5.11 శాతం పెరిగాయి. అంటే 2014 జనవరి రిటైల్ ధరలతో పోల్చితే 2015 జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం పెరిగాయన్నమాట. పండ్లు (10.62 శాతం), కూరగాయల (9 శాతం) ధరల పెరుగుదల ప్రభావం మొత్తం రిటైల్ బాస్కెట్ ధరలపై పడింది. పాలు, పాల ఉత్పత్తుల ధరలు కూడా 9.38 శాతం ఎగశాయి. కొత్తగా మార్చిన 2011-12 బేస్ ఇయర్ ప్రాతిపదికన కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.28%. 2013-14తో పోల్చితే 2014-15లో రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందని కొత్త సిరీస్‌లో ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ తెలిపారు. ఒక్క ఆహార వస్తువుల విభాగాన్ని చూస్తే(ఆహారోత్పత్తులు, పానీయాలు) ద్రవ్యోల్బణం 6.13%గా ఉంది. సీపీఐ గణాంకాలతో పాటు, ఒక్క ఆహార ఉత్పత్తులకు సంబంధించి వినియోగ ఆహార ధరల సూచీ(సీఎఫ్‌పీఐ)ని కేంద్రం విడుదల చేసింది. వార్షికంగా ఈ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.06% పెరిగింది.