పారిశ్రామిక వృద్ధి అంతంతే..! | Consumer inflation rose to 5.11% in January, industrial growth ... | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక వృద్ధి అంతంతే..!

Published Fri, Feb 13 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

పారిశ్రామిక వృద్ధి అంతంతే..!

పారిశ్రామిక వృద్ధి అంతంతే..!

* డిసెంబర్‌లో 1.7 శాతం
 
*  గనుల రంగం పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు 2014 డిసెంబర్‌లో నామమాత్రంగా 1.7 శాతంగా నమోదయ్యింది. గనులు, తవ్వకాల రంగం పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే 2013 డిసెంబర్‌తో పోల్చిచూస్తే మాత్రం వృద్ధి కొంత బెటర్. అప్పట్లో ఈ వృద్ధి రేటు నామమాత్రంగా 0.1 శాతంగా ఉంది. కాగా 2014 నవంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటును స్వల్పంగా 3.8 శాతం నుంచి 3.9 శాతానికి సవరించారు.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఐఐపీ వృద్ధి రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 0.1 శాతం నుంచి 2.1 శాతానికి ఎగసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా కేంద్రం ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు గణాంకాలను విడుదల చేస్తుంది. గురువారం విడుదలైన తాజా డిసెంబర్ గణాంకాలను విభాగాల వారీగా చూస్తే...

మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం డిసెంబర్‌లో 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలో ఈ రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చితే క్షీణత నుంచి బైటపడింది. మైనస్ 0.4 శాతం నుంచి 1.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి.
మైనింగ్ రంగం 2.6 శాతం వృద్ధి బాట నుంచి -3.2 శాతం క్షీణ బాటకు మళ్లింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మాత్రం ఈ రేటు సానుకూలంగా ఉంది. -1.5 శాతం క్షీణత నుంచి 1.7 శాతం వృద్ధి రేటులో ఉంది.
ఇక డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీ విభాగం క్యాపిటల్ గూడ్స్ 4.1 శాతం వృద్ధి సాధించింది.  9 నెలల్లో  -0.4 శాతం క్షీణ రేటు 4.8 శాతం వృద్ధి బాటలో ఉంది.
విద్యుత్ రంగం వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో వృద్ధి రేటు 5.6 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది.
 
బడ్జెట్‌లో చర్యలు అవసరం: కార్పొరేట్లు
పారిశ్రామిక ఉత్పత్తి మందగమనంలో ఉన్న నేపథ్యంలో  రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలని, పెట్టుబడుల వృద్ధికి ఫిబ్రవరి 28 బడ్జెట్‌లో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఈ దిశలో కేంద్రం బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఉత్సాహానికి మరికొంత ఊపును ఇవ్వడానికి పటిష్ట, సుస్థిర విధాన పరమైన చర్యలూ అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్  వ్యాఖ్యానించారు.

జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం అప్
న్యూఢిల్లీ: రిటైల్ వస్తువుల ధరలు జనవరిలో 5.11 శాతం పెరిగాయి. అంటే 2014 జనవరి రిటైల్ ధరలతో పోల్చితే 2015 జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం పెరిగాయన్నమాట. పండ్లు (10.62 శాతం), కూరగాయల (9 శాతం) ధరల పెరుగుదల  ప్రభావం మొత్తం రిటైల్ బాస్కెట్ ధరలపై పడింది. పాలు, పాల ఉత్పత్తుల ధరలు కూడా 9.38 శాతం ఎగశాయి.  కొత్తగా మార్చిన 2011-12 బేస్ ఇయర్ ప్రాతిపదికన కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.28%.

2013-14తో పోల్చితే 2014-15లో రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందని కొత్త సిరీస్‌లో ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ తెలిపారు. ఒక్క ఆహార వస్తువుల విభాగాన్ని చూస్తే(ఆహారోత్పత్తులు, పానీయాలు) ద్రవ్యోల్బణం 6.13%గా ఉంది. సీపీఐ గణాంకాలతో పాటు, ఒక్క ఆహార ఉత్పత్తులకు సంబంధించి వినియోగ ఆహార ధరల సూచీ(సీఎఫ్‌పీఐ)ని కేంద్రం విడుదల చేసింది. వార్షికంగా ఈ సూచీ ఆధారిత  ద్రవ్యోల్బణం 6.06% పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement