ఆఫర్లతో జాగ్రత్త ..
పండుగల వేళ షాపులు, కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడి ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. సాధారణంగానే డిస్కౌంటు అనగానే మనసు అటు లాగేస్తుంటుంది. ఒక్కటి మాత్రమే కొంటానంటూ బైల్దేరినా.. దానికి మరొకటి తోడయ్యి... చివరికి పర్సు గుల్లయ్యి.. ఇంటికొచ్చాక తీరిగ్గా కూర్చుని ఫీలవుతుంటాం. ఇలా కాకూడదంటే .. అసలు మన చేత ఖర్చు పెట్టించేందుకు షాపులవాళ్లు చేసే ట్రిక్కులు ఏమిటి.. వాటిని ఎలా ఎదుర్కోవచ్చో చూద్దామా..
డిస్కౌంట్లు..
రిటైలర్లు డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లంటూ ఊదరగొట్టినా వాటి వెనుక మతలబు ఉంటుంది. అమ్మకందారు ఎవరైనా సరే (ఆఖరికి మనమైనా) లాభం లేకుండా అమ్మరు కదా. నిజానికి ఇలాంటి సేల్ ఆఫర్లు పెట్టినప్పుడు ఆయా ఉత్పత్తుల రేట్లను సాధారణంగా కంటే మరింత ఎక్కువ చేసి చూపిస్తుంటారు రిటైలర్లు. తద్వారా బోలెడంత డిస్కౌంటు ఇస్తున్నట్లు చూపిస్తుంటారు. ఇలాంటప్పుడు అసలు రేటు ఎంత ఉంటుందనేది కాస్త రీసెర్చ్ చేస్తే అసలు మర్మం తెలుస్తుంది. ఇందుకోసం ఆన్‌లైన్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటే రమారమీ రేటు తెలుస్తుంది.
ఇది కాకుండా ఇంత వేల్యూ చేసేవి కొంటే.. మరొకటేదో ఫ్రీగా ఇచ్చేస్తామని కూడా ఊదరగొడుతుంటారు రిటైలర్లు. అమ్మకాలు అంతగాలేని వాటిని వదిలించుకునేందుకు వారు ఉపయోగించే టెక్నిక్కుల్లో ఇది కూడా ఒకటి. ఆ మాయలో పడకూడదంటే.. ముందుగానే కొనుగోళ్లకు ఒక బడ్జెట్ పెట్టుకుని, దానికే కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించండి.
స్టోర్ డిజైన్.. అనుభూతి..
కస్టమర్లను ఆకర్షించేందుకు షాపులు, మాల్స్ చల్లని ఎయిర్ కండీషనింగ్, ఆహ్లాదకరమైన మ్యూజిక్, ఉచిత శాంపిల్స్ మొదలైన వాటితో ఆకర్షిస్తుంటాయి. అలాగే, ఏదో రకంగా ఏదో ఒకటి కొనిపించేందుకు డబ్బులు కట్టే కౌంటరు దగ్గర కూడా చాక్లెట్లు, బిస్కెట్ల లాంటి వాటితో ఊరిస్తుంటాయి. వీటి మాయలో పడకూడదంటే... షాపింగ్ చేసేటప్పుడు కాస్త సంయమనంగా వ్యవహరిస్తే సరి. ఇక షాపులో విషయానికొస్తే.. కొన్నిసార్లు ఆకర్షణకు లోనై మనకు అనవసరమైనవి కూడా కొనేస్తుంటాం. అలా జరగకుండా ఉండాలంటే.. కొనుగోలు చేసిన ఐటమ్స్‌ని బాస్కెట్‌లోనే ఉంచి షాపంతా కలియతిరగండి. ఈ సమయంలో వాటి అవసరం గురించి ఆలోచించేందుకు కాస్త సమయం చిక్కుతుంది. అనవసరం అనుకున్నవి పక్కన పెట్టేయొచ్చు.
పదాల మాయాజాలం..
ఇప్పుడు త్వరపడకపోతే.. ఇక ఆఫర్ చేజారిపోయినట్లే అనిపించేలా తొందరపెట్టేసేందుకు రిటైలర్లు ... రిటైలర్లు లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, స్టాక్ ఉన్నంత వరకే అంటూ కంగారుపెట్టేస్తుంటారు. అలాగని తొందరపడి పరుగులు తీయకుండా.. అవసరాన్ని బట్టి, మిగతా చోట్ల రేట్లను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతిమంగా మన బడ్జెట్టు, మన అవసరాలకు తగ్గట్లుగా షాపింగ్ చేస్తున్నామా లేదా అన్నది మన మీదే ఆధారపడి ఉంది.