ఆన్‌లైన్లోనూ అమ్ముతాం.. | Consumers Claim To Shop More Online, But Do They? | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లోనూ అమ్ముతాం..

Published Sat, Feb 7 2015 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

ఆన్‌లైన్లోనూ అమ్ముతాం..

ఆన్‌లైన్లోనూ అమ్ముతాం..

మారిన ఎలక్ట్రానిక్స్ కంపెనీల వైఖరి
 ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో రంగంలోకి  
⇒  మొదట్లో వద్దనుకున్నా మారిన వ్యూహం
 ఈ-కామర్స్‌ను విస్మరించలేమన్నదే కారణం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మేం ఆన్‌లైన్‌కు వ్యతిరేకం. ఆన్‌లైన్లో మాకెవ్వరూ అధీకృత డీలర్లు లేరు. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్‌లో కొంటే వారంటీ వర్తించదు.

సర్వీసింగ్ విషయంలోనూ కంపెనీ ఎలాంటి బాధ్యతా వహించదు’’... ఇదీ పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు గతంలో ఇచ్చిన ప్రకటన. మరిప్పుడో...! పరిస్థితులు మారాయి. ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు మధ్య ధరల్లో తేడా చాలా ఎక్కువగా ఉందని, ఇది స్నేహపూర్వక వ్యాపారం కాదని గతంలో ఊదరగొట్టిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పుడు ఆన్‌లైన్ విక్రయాలకు సై అంటున్నాయి.

వ్యూహాత్మకంగా ‘ఎక్స్‌క్లూజివ్’ పేరుతో రంగంలోకి దిగుతున్నాయి. ఆన్‌లైన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను వాటికి అప్పగిస్తున్నాయి. అంటే ఈ మోడళ్లు ఏదైనా ఒక ‘ఈ-కామర్స్’ కంపెనీ పోర్టల్‌లో మాత్రమే లభిస్తాయన్న మాట. వ్యూహం ఏదైనా... ఒక్కటి మాత్రం నిజం. అంతకంతకూ పెరుగుతున్న భారత ఈ-కామర్స్ మార్కెట్‌ను విస్మరించగలిగే పరిస్థితుల్లోనైతే ఎలక్ట్రానిక్స్ కంపెనీలు లేవు. ఒకవేళ విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని, అది తమ మనుగడనే దెబ్బతీసే ప్రమాదం ఉందని అవి భయపడుతున్నాయి. అందుకే ఆన్‌లైన్ బాట పడుతున్నాయి.  
 
ఇదీ... మన ఈ-కామర్స్ విశ్వరూపం
భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ-కామర్స్ మార్కెట్ పుంజుకుంటోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా, ఇందులో ఈ-కామర్స్ వాటా ఇంచుమించు లక్ష కోట్లు. దీన్లో ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం సుమారు రూ.24,000 కోట్లు కాగా మిగతాదంతా ఈ-టికెటింగ్ తదితరాలకు వెళుతోంది. ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం ప్రస్తుతం స్వల్పంగానే ఉన్నా 2018 నాటికి రూ.లక్ష కోట్లకు చేరుతుందని సీఐఐ-కేపీఎంజీ నివేదిక చెబుతోంది.

వీటిలో ఎలక్ట్రానిక్స్ వాటా ఎక్కువగానే ఉండటంతో పలు కంపెనీలు ఈ-కామర్స్‌ను సైతం వ్యాపార వేదికగా చేసుకుంటున్నాయి. అయితే తక్కువ ధర ఉండటం, తిరిగి పంపించే వస్తువులు కూడా ఎక్కువగానే ఉండటం, పార్ట్‌లు మార్చిన వస్తువులు వస్తుండటంతో సర్వీస్ సెంటర్లు గగ్గోలు పెడుతుండటం వంటి కారణాల వల్ల పలు కంపెనీలు ఆన్‌లైన్లో అమ్మటానికి ఇప్పటిదాకా ముందుకు రాలేదు. కానీ పోటీ కంపెనీలు ఆన్‌లైన్ వ్యాపారంలో కూడా గణనీయమైన వ్యాపారం చేస్తుండటంతో మిగతా కంపెనీలూ ఆ దార్లోకి రాక తప్పటం లేదు.

ఇందుకోసం కొత్త మార్గాన్ని ఎన్నుకుని... ఎక్స్‌క్లూజివ్ పేరిట తమ మోడళ్లను ప్రత్యేక ఒప్పందంతో విడుదల చేస్తున్నాయి. ఉదాహరణకు షియోమీ తన ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే విడుదల చేయగా బీభత్సమైన స్పందన వచ్చింది. చివరికి ఎప్పటికప్పుడు ఆ మోడళ్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోవటం, మళ్లీ కొన్నాళ్ల తరవాత పెట్టడం జరిగింది. లెనోవో ఎస్8 ట్యాబ్లెట్, ఏ6000 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోంది.

హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్ 8జీబీ వేరియంట్, ఆర్‌ఈ కెమెరాను, ప్యానాసోనిక్ ఎలూగ ఎస్ మోడల్‌ను స్నాప్‌డీల్‌లో విక్రయించాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మినీ మోడల్‌ను గతేడాదే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లోకి తెచ్చింది. ఇక సోనీ సంస్థ స్నాప్‌డీల్‌తో చేతులు కలిపింది. తన డీలర్లనే ఆన్‌లైన్ విక్రేతలుగా నియమించుకుంది. తద్వారా అసలైన ఉత్పత్తులు, వారంటీకి తోడు ఆఫ్‌లైన్‌కు సమానమైన ధర ఉంటుందని సోనీ ఇండియా సేల్స్ హెడ్ సునీల్ నయ్యర్ చెప్పారు. ప్యానాసోనిక్ సైతం రంగంలోకి దిగింది.
 
జనరల్ ట్రేడ్ సేఫ్..
భారత్‌లో చిల్లర వర్తకంలో సంప్రదాయ దుకాణాల పాత్ర అత్యంత కీలకం. అందుకే కొత్త వ్యాపార వేదికైన ఆన్‌లైన్‌ను వినియోగించుకుంటూనే ఆఫ్‌లైన్‌ను కూడా విస్మరించకూడదని తయారీ కంపెనీలు నిర్ణయించాయి. అందుకోసమే పోర్టళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఇవి దుకాణాల్లోగానీ, ఇతర పోర్టళ్ల వద్దగానీ లభించవు. వాస్తవానికి ఆన్‌లైన్ కంపెనీలు కొన్ని మోడళ్లను మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నాయి.

ధరలు తగ్గించి విక్రయించడంతో మార్కెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను ఇవ్వడం వల్ల ఇతర మోడళ్ల జోలికి ఆన్‌లైన్ కంపెనీలు పోవన్నది తయారీ సంస్థల భావన. ఏదైతేనేం జనరల్ ట్రేడ్‌లో తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేసేవాళ్లే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ వ్యాఖ్యానించారు. ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో సాధారణ ట్రేడర్ల వ్యాపారంపై  ప్రభావం ఉండదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement