మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలి? | Where to buy a mobile phone? | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలి?

Published Fri, May 22 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలి?

మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలి?

* మరమ్మతుల దృష్ట్యా రిటైల్ షాపులే బెటర్  
* ధరలు, ఫీచర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ సంస్థలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ మీడియాలుగా మారి పోయిన ఈ-కామర్స్ సంస్థలిపుడు సరికొత్త ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ఒక్కొక్క సంస్థకూ భారీ ఎత్తున యూజర్లుండటంతో... చైనా కంపెనీల మొబైళ్లను ఇవే నేరుగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

స్టోర్లకు ఇవ్వాల్సిన క మిషన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులన్నీ మిగులుతూ ఉండటంతో అత్యాధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. లెనోవో, షియోమీ, మోటోరోలా ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్‌సేల్ పేరిట నేరుగా విక్రయిస్తుండగా... తానేమీ తీసిపోలేదన్నట్లు అమెజాన్ కూడా చైనా కంపెనీ జెడ్‌టీఈతో జట్టు కట్టి... నుబియా సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మైక్రోమ్యాక్స్‌కు చెందిన ‘యూ’ సిరీస్ ఫోన్లను కూడా ఇది ప్రత్యేకంగా విక్రయిస్తోంది.
 
సరే! ఇదంతా బాగానే ఉంది. మరి వీధికొకటిగా వెలసిన స్టోర్ల మాటేంటి? కొన్ని స్టోర్లతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా విస్తరించిన మొబైల్ చైన్ల సంగతేంటి? అసలు విక్రయాల్లో ఆన్‌లైన్‌కూ, ఆఫ్‌లైన్‌కూ మధ్య ఉన్న తేడా లైన్ ఏంటి? ఆన్‌లైన్లో కొంటే బెటరా లేక దగ్గర్లోని రిటైల్ షాపే మంచిదా? ఇది తెలియాలంటే ఇటీవల జరిగిన రెండు ఉదాహరణలు చూడాలి. శివ ఈ మధ్యే ఒక మొబైల్ కొన్నాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌ల ద్వారా చిరపరిచితమైన కంపెనీకి చెందిన ఫోన్ కావటంతో దానికోసం ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు.

అన్ని ఫీచర్లూ ఉండటం... పైగా ధర కూడా రూ.7వేలే కావటంతో మొత్తానికి ఆ ఫోన్ దక్కించుకున్నాడు. ఫోన్ డెలివరీ అయింది. చూడటానికి, వాడటానికి కూడా బాగుండటంతో శివ ఆనందానికి అవధుల్లేవు. అయితే వారం తిరక్కుండానే... వాళ్లబ్బాయి టేబుల్ మీదున్న ఫోన్‌ను లాగటంతో కిందపడి స్క్రీన్ పగిలింది. ఫోన్ పనిచేస్తోంది కానీ డిస్‌ప్లే లేదు. శివ ఆ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు. వాళ్లేం చెప్పారంటే.. ‘‘దీని డిస్‌ప్లే పోయింది. వేయటానికి రూ.1,900 అవుతుంది.

కాకపోతే మా దగ్గర స్టాకు లేదు. తెప్పించాలంటే కనీసం 2 నెలలు పడుతుంది’’ అని. అది విన్నాక శివకు దిమ్మతిరిగింది. ఎందుకంటే 2 నెలలు ఫోన్ లేకుండా ఎలా? ఆన్‌లైన్లో కొందామని డిస్‌ప్లే కోసం వెదికినా ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే అది చైనా కంపెనీది. దాని విడిభాగాలు ఇంకా ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. చేసేదేమీ లేక కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. మహేష్ విషయంలో కూడా సరిగ్గా శివ మాదిరే జరిగింది. తను స్థానికంగా ఉన్న రిటైల్ దుకాణంలో ఫోన్ కొన్నాడు.

కొన్ని ఫీచర్లు తక్కువ ఉన్నా... ధర కూడా తనకు అందుబాటులోనే ఉండటంతో కొనుక్కున్నాడు. తనది కూడా నెల తిరక్కుండానే కిందపడి స్క్రీన్ పగిలింది. సదరు కంపెనీకి ఒప్పందం ఉన్న సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. మరుసటి రోజు రమ్మన్న సర్వీస్ సెంటర్ ప్రతినిధి... అప్పటికల్లా స్క్రీన్ వేసి సిద్ధంగా ఉంచాడు. మహేష్ హ్యాపీ.
 
ఈ రెండు ఉదాహరణలూ చూశాక ఏమనిపిస్తుంది? ఆన్‌లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించే ఫోన్లను కొన్నపుడు... వాటికి రిపేరు రాకుండా ఉన్నంతకాలం ఓకే. కానీ రిపేరు వచ్చిందంటే కష్టం. కాకపోతే ఫీచర్లు ఎక్కువ... ధర కాస్త తక్కువ. రిటైల్ షాపులో కొన్న ఫోన్లకైతే సర్వీసింగ్ సదుపాయం ఉంటుంది. ఎందుకంటే ఫోన్లు విక్రయించే ముందే ఆ కంపెనీకి ఉన్న నెట్‌వర్క్, విడిభాగాల లభ్యత, అన్నీ చూసి విక్రయిస్తామని చెబుతున్నారు రిటైలర్లు.
 
ఉత్తమ సర్వీస్ ఇస్తేనే..
‘‘సెల్‌ఫోన్లకు వారంటీ ఉందా? విక్రయానంతర సేవలు ఏ స్థాయిలో ఉన్నాయి? సదరు కంపెనీ ఎన్ని సర్వీసింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది? ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే సదరు బ్రాండ్ల ఫోన్లను విక్రయస్తామని చెప్పారు మల్టీబ్రాండెడ్ రిటైలర్ టెక్నోవిజన్ ఎండీ సికిందర్. ‘‘ఫోన్‌కు ఏదైనా సమస్య వస్తే దుకాణదారులతో గొడవపడే కస్టమర్లూ ఉన్నారు. అందుకే బ్రాండ్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తాం’’ అన్నారాయన. బ్రాండ్ పట్ల నమ్మకం ఏర్పడితేనే రిటైలర్లు విక్రయాలకు ఓకే చెబుతున్నారని, సర్వీసింగ్ సరిగా ఇవ్వలేని కంపెనీలు కనుమరుగవటం ఖాయమని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కైలాశ్ లఖ్‌యాని చెప్పారు.
 
ధర, మార్జిన్లు కూడా ముఖ్యమే..
మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు వాటిని విక్రయిస్తే తమకెంత మార్జిన్ ఉంటుందనేది కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తెలియనిదేమీ కాదు. అయితే  టెక్నాలజీ వ్యయాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఉపకరణాల ధరలూ దిగొస్తున్నాయి. అందుకే రిటైల్ దుకాణాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

మొబైల్స్ విషయంలో దాదాపుగా ఒకే రకమైన ఫీచర్లున్నప్పటికీ బ్రాండ్‌ను బట్టి ధరల్లో బాగా తేడా ఉంటోంది. ‘‘బ్రాండ్‌ను ఒప్పుకునే ముందు ఏ మోడల్‌కు ఎంత ధర ఉంది? ఇంత ధర ఉండొచ్చా? అనేది కూడా చూస్తాం’’ అని లాట్ మొబైల్స్ ప్రతినిధి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement