సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థలయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. డిస్కౌంట్ల విషయంలో ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి. అన్ని సరకులపై 15 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ డిస్కౌంట్ అమ్మకాలను సెప్టెంబర్ పదవ తేదీన ప్రారంభించగా, అదే రోజు నుంచి తమ డిస్కౌంట్ సేల్స్ ప్రారంభం అవుతాయని ముందుగా ప్రకటించిన అమెజాన్ సంస్థ, అంతకన్నా 12 గంటల ముందే అంటే, 9వ తేదీ మధ్యాహ్నం నుంచే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ పేరిట అమ్మకాలకు శ్రీకారం చుట్టింది.
అక్టోబర్ 15వ తేదీ వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో మూడు వందల కోట్ల డాలర్ల (22,206 కోట్ల రూపాయలు) వ్యాపారం సాగుతుందని ‘రెడ్‌సీర్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది ఈ రెండు ఆన్‌లైన్ సంస్థల ద్వారానే భారత్‌లో 150 కోట్ల వ్యాపారం సాగింది. అంటే ఈసారి అంతకన్నా రెట్టింపు వ్యాపారం జరుగుతుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో సెల్‌ఫోన్లు, ఎలక్రానిక్స్, ఆటోమొబైల్స్, బట్టలతోపాటు గృహోపకరణాల అమ్మకాల్లో 40 శాతం అమ్మకాలు ఈ ఒక్క దసరా, దీపావళి సందర్భంగానే జరుగుతుంటాయి. ఈ సారి ఆన్‌లైన్ అమ్మకాల్లో సెల్‌ఫోన్లే ఎక్కువగా అమ్ముడు పోతాయని, దాదాపు వందకోట్ల డాలర్ల సెల్‌ఫోన్ అమ్మకాల వ్యాపారం జరగవచ్చని ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఇండియా’ సీనియర్ అనలిస్ట్ జైపాల్ సింగ్ అంచనా వేశారు.
అమెరికాలో ‘బ్లాక్ ఫ్రైడే’, చైనాలో ‘సింగిల్స్ డే’ పేరిట కొనసాగే డిస్కౌంట్ అమ్మకాలకన్నా భారత్‌లో పండగల సీజన్ సందర్భంగా జరిగే అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తుండగా, కాస్త ఖరీదైన సెల్‌ఫోన్ల ద్వారా అమెజాన్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యనుండే ఫోన్లే ఈ సారి ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉందని వివిధ సంస్థలకు చెందిన సీనియర్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా అతిపెద్ద ఆన్‌లైన్ సంస్థగా ఎదిగిన ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ ఆరు రోజుల్లో వందకోట్ల డాలర్లకు పైగా వ్యాపారం చేయనున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ సంస్థ దేశవ్యాప్తంగా 66 సెంట్రల్ హబ్స్‌తో కోటి చదరపు అడుగుల గిడ్డంగి సౌకర్యాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 900 డెలివరి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. ఈ ఒక్క పండగ సీజన్ కోసమే 30వేల మంది ఉద్యోగులను అదనంగా తీసుకుంది. వారికి తగిన శిక్షణ కూడా ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లోని కిరాణ కొట్ల వరకు నెట్‌వర్క్‌ను విస్తరించింది. అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ ఇందులో దేనికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 50 సెంట్రల్ హబ్‌లున్నాయి. వాటì కి రెండు కోట్ల క్యూబిక్ అడుగుల గిడ్డంగులు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో 30 సార్టింగ్ సెంట్రల్ ఉన్నాయి. రెండు వేల ఔట్‌లెట్లు ఉన్నాయి. ప్రతి రోజు దేశంలోని 500 నగరాలను సందర్శించే 1500 ట్రక్కులు ఉన్నాయి.
వినియోగదారులకు సకాలంలో కోరుకున్న సరకును అందించడం కోసం ఈ రెండు సంస్థలు సాంకేతిక రంగంలో కూడా పరస్పరం పోటీ పడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ గతేడాదే ‘ఎఫ్‌క్విక్’ యాప్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈసారి పది శాతం అమ్మకాలు ఈ యాప్ ద్వారానే కొనసాగుతాయని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియా ‘ఐ హావ్ స్పేస్’ పేరిట 2015 నుంచే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత్‌లోని భిన్న నైసర్గిక స్వరూపాలు, సంస్కృతులు, భాషలు, భిన్న ఆదాయ వర్గాలు, వారి మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల కోసం తాము వ్యాపారాన్ని నిర్వహించాల్సి వస్తోందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ రాఘవన్ తెలిపారు.
అమెరికా సంస్థ వాల్‌మార్ట్ మద్దతు కలిగిన ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఆన్‌లైన్ మార్కెట్‌లో 3,463 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగా, అమెజాన్ ఇండియా సంస్థ గత ఆగస్టు నెలలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. భారత్‌లో ఐదేళ్ల కాలంలో ఐదువందల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలనే అమెరికా కంపెనీ కార్యాలయం స్కీమ్‌కు అదనం ఈ పెట్టుబడులు.
Comments
Please login to add a commentAdd a comment