కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్‌లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్‌లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్‌లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలు
ప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment